హైదరాబాద్ : ఆర్థిక మంత్రి హరీష్ రావుకు అదనంగా వైద్య శాఖను అప్పగించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) నిర్ణయించారు. ఈ మేరకు జీవో జారీ చేశారు. వైద్య శాఖను నిర్వహిస్తూ వచ్చిన ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత ఆ శాఖను ముఖ్యమంత్రి తన దగ్గరే ఉంచుకున్నారు. ఈటల రాజేంద్ర మంత్రివర్గం నుంచి ఉద్వాసన తర్వాత శాసనసభ సభ్యత్వానికీ, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేయడం, తర్వాత బీజేపీలో చేరడం తెలిసిందే. అనంతరం హుజూరాబాద్ లో ఉపఎన్నికలను ప్రకటించారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హరీష్ రావు కాలికి బలపం కట్టుకొని నియోజకవర్గం అంతటా పర్యటించి, రాత్రింబవళ్ళు శ్రమించి టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ విజయానికి కృషి చేశారు. అక్టోబర్ 30న పోలింగ్ జరిగింది. నవంబర్ రెండున ఓట్ల లెక్కింపు జరిగింది. ఈటల 23 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇది జరిగిన వారం రోజలుకు హరీష్ రావు కు అదనపు బాధ్యత అప్పగించారు.