సిద్దిపేట: టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్యన ఇక్కడ సోమవారంరాత్రి ఘర్షన జరిగింది. ఇరు పార్టీల నేతల, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. టీఆర్ఎస్ నాయకులు బస చేస్తున్న స్వర్ణప్యాలెస్ లో ఈ ఘటన జరిగింది. ఆందోళ్ ఎంఎల్ఏ క్రాంతికిరణ్ బస చేసిన గదిలోనే రసాభాస జరిగింది. దుబ్బాకలో జరుగుతున్న ఉపఎన్నికలలో డబ్బు వీరి నుంచే పంపిణీ అవుతున్నదని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, తలారి శ్రీను, కళారీ శ్రీను, కోరిమి అనీల్, ఎల్లంగౌడ్, హత్య కేసులో నిందితులతో కలసి దళిత ఎంఎల్ఏ క్రాంతికిరణ్ పై దాడి చేశారని టీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపించారు.
టి ఆర్ ఎస్ పార్టీ కి ప్రజల నుండి వస్తున్న అపూర్వ ఆదరణ చూసి, ఓర్వలేక బిజేపీ నాయకులు పని గట్టుకొని నియోజకవర్గం అవతల ప్రాంతంలో ఉన్న ఒక దళిత ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై భౌతిక దాడులకు దిగడం చాలా శోచనీయమనీ, ఇది హేయమైన చర్య అనీ, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాననీ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి టి. హరీష్ రావు సోమవారం సాయంత్రం అన్నారు.
‘‘ఇది ఉద్దేశ పూర్వకంగా పథకం ప్రకారం కావాలని వాళ్ళు ఉంటున్న హోటల్ కి వెళ్లి, వారి పై భౌతిక దాడులకు పాల్పడటం వారి దిగజారుడు తనానికి నిదర్శనం’’ అని హరీష్ రావు అన్నారు.
మాజీ ఎంపీ , దుబ్బాక బిజెపి ఎన్నికల ఇంచార్జ్ జితేందర్ రెడ్డి రామాయం పేట లోని రెడ్డి కాలనీ లో ఉంటే తప్పు లేనిది, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సిద్దిపేట లో ఉంటే తప్పు ఏమిటని హరీష్ ప్రశ్నించారు.
‘‘నిన్న మొన్న కొన్ని యాక్షన్ ప్లాన్ చేశారు. అందులో బాగమే ఈ కుట్ర.. బిజెపి నాయకులు శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తూ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. దాడికి ముందు 15 నిమిషాల ముందే పోలీస్ వాళ్ళు వచ్చి తనిఖీ చేసుకొని వెళ్లారు.. వాళ్ళ తనిఖీ ల సందర్భంగా ఎలాంటి ప్రచార సామగ్రి లేదు. టి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు , పార్టీ శ్రేణులు సమయమనం పాటించి ఎవరీ పనుల్లో వారు నిమగ్నం అయి ఉండాలి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది’’ అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.