నిరంతర కర్మే నేను చేసే తపస్సు!
“మన విప్లవం భావాల మీద ఆధారపడేది;
భావాలను హత్య చేయడం అసాధ్యం!”
– స్వామి మన్మథన్
నేను పుణ్యతిథిలో పాల్గోవడానికి వెళ్ళాను. ఇలాంటి కర్మ కాండలకి చాలా దూరంగా ఉండే నేను ఒక వ్యక్తి వర్ధంతి సందర్భంగా జరిగిన మత క్రతువులో పాల్గొనడానికి ఉత్తరా ఖండ్ లోని హిమశిఖరాల మధ్య నున్న ఆశ్రమానికి అతిథిగా వెళ్ళాను. ఆ వ్యక్తినీ, ఆయన జీవితాన్నీ తరచి చూసిన కొద్దీ బతకడానికి అర్ధం తెలుస్తూ ఉంది. అసలు బతు కంటే ఇదే కదా అనిపిస్తుంది. నిస్వార్థానికి నిదర్శనం కనిపిస్తుంది. పేరుకి ఆధ్యాత్మికతే కానీ ఆయన చేసిన పోరాటా లన్నీ అసమానతల్ని రూపు మాపడానికే. అసహాయులకి న్యాయం చేయడానికే. ఆయనే స్వామి మన్మథన్, భువనేశ్వరి మహిళా ఆశ్రమం వ్యవస్థా పకులు!
స్వామి మన్మథన్, కేరళలో ఏ ప్రాంతమో తెలీదు. ఎందుకొచ్చాడో, ఎప్పుడు, ఎక్కడ నుండి వచ్చాడో తెలీదు. ఆయన పుట్టుక, తల్లిదండ్రులు తదితర వివరాలేవీ తెలీవు. కానీ, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అంజనీసైన్ అనే ప్రాంతపు ప్రజలకు దేవుడు. వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపిన యోధుడు. ఆయన పుట్టుక, కుటుంబం, ఇతర వ్యక్తిగత వివరాల గురించిన సమాచారం లేదు. కానీ, ఆయన తన ఆలోచన ద్వారా రగిల్చిన స్పూర్తి, ఆచరణపరంగా మిగిల్చిన అసాధారణ కార్యక్రమాల రూపకల్పన ఈనాటికీ ఉన్నాయి!
ఆయనెంత అసాధారణ అన్వేషకుడంటే 15 సంవత్సరాల పాటు ఆ హిమగిరి ప్రాంతంలో దాదాపు ప్రతీ మారుమూల గ్రామాన్నీ జల్లెడ పట్టాడు. చైనా మనిషనీ, క్రైస్తవ సన్యాసనీ ఇంకా ఎన్నో నిందలు మోసాడు. మరెన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నాడు. వాళ్ళ జీవితాల్లో విడదీయరాని భాగమయ్యాడు. అక్కడి మహిళల పరిస్థితిని కళ్ళారా చూసాడు. మద్యపానం మొదలు పురుషాధిక్యత వరకూ అమలవుతున్న దారుణాల ఆక్రందనల్ని మనసు పెట్టి విన్నాడు. ఆయన చేసిన పోరాటాలు చూస్తే, అవన్నీ ప్రజాపక్షాన ఎలుగెత్తిన ఆకాంక్షల అభివ్యక్తులే. జనాందోళనల వైపు వెల్లువలా సాగిన పురోగతికి చిహ్నాలే!
ఎక్కడెక్కడో తిరిగి ప్రజల స్థితి గతులు అధ్యయనం చేసి సుమారు 55 ఏళ్ళ క్రితం అక్కడి స్త్రీలు, పిల్లల కోసం పెట్టిన సంస్థే భువనేశ్వరి మహిళా ఆశ్రమం. పార్వతీ దేవి దేహ భాగం పడిన ప్రాంతం కాన అక్కడ దేవాలయంలో భువనేశ్వరి యంత్రం ఉందనేది స్థల పురాణం, భక్తుల నమ్మకం. దాని ఆధారంతోనే మన్మథన్ చేపట్టిన గొప్ప సంస్కరణల మార్గం ఆ ఆశ్రమం. బాల బడులు మొదలు మూఢ నమ్మకాల నిర్మూలన వరకూ, గ్రామీణులకి గ్యాస్ స్టవ్, కుక్కర్ల పంపిణీ నుండి ప్రఖ్యాత చంద్రబదనీ ఆలయం మొదలు కొని సుమారు ఆరేడు ఆలయాల్లో జంతుబలుల నిర్మూ లన దాకా, ఘడ్వాలీ విశ్వవిద్యాలయం కోసం ఉద్యమించడం నుంచీ మొట్ట మొదటి పర్యావరణ పాఠశాల స్థాపన వరకూ ఆయనో స్రవంతి, అలుపెరుగని పెను ప్రవాహం !
ఆ ప్రాంతంలోనే కాదు, ప్రజాభ్యుదయం కోసం, ప్రకృతి పరిరక్షణ కోసం పాటుపడుతున్న స్వామి మన్మథన్‌కి రోజురోజుకీ పెరుగుతున్న ప్రజాదరణ పై కన్నుకుట్టిన రాజకీయ నేతలు, అసాంఘిక శక్తుల ప్రోద్భలంతో ఏప్రిల్ 6, 1990 న ఒక వ్యక్తి చేతుల్లో తుపాకీతో హత్య చేయ బడ్డాడు. చంపిన వ్యక్తి అరెస్టు కాబడి జైలుకి వెళ్ళి బెయిలు పై తిరిగొచ్చిన కొద్దికాలానికి స్థానికులు ఆ హంతకుడ్ని రాళ్ళతో తరిమికొట్టి హతమార్చారనంటే స్వామి మన్మథన్‌కి ప్రజల హృదయంలో ఉన్న స్థానం అర్థమవు తుంది!
అలాంటి మహోన్నత వ్యక్తి వర్ధంతిని ఆయన సన్నిహితుల సమక్షంలోనే ప్రతీ ఏడూ చేస్తామనీ ఇప్పటివరకూ ఆయన కుటుంబం తదితర వివరాలేవీ తెలీదంటూ దక్షిణాది నుండి కనీసం ఈసారి ఆయన చనిపోయిన రోజున మీరు రాగలిగితే బావుంటుందని ఆశ్రమ నిర్వాహకులు కోరడంతో కదిలిపోయాను. నిండు మనసుతో వెళ్ళి స్వామి మన్మథన్ పుణ్య తిథిలో పాల్గొన్నాను. ఆధ్యాత్మికత పేరిట వాళ్ళు చేస్తున్న సామాజిక కార్యక్రమాలు చూసి ఆశ్చర్య పోయాను!
నన్ను ఆకర్షించిన రెండు విష యాలు, ఒకటి ఉదయం వెళ్ళే సరికి చెప్పులు, బ్యాగులు బ్లాక్ బోర్డులతో పాటు బయటపడేసి తరగతిగదిలో పిల్లలు చేస్తున్న వివిధ పాటల సంగీత సాధన. ఆ స్కూలుకి మన రిషీవ్యాలీ కూడా ఒకానొక స్పూర్తని తెలిసి సంతోషించాను.ఇక, రెండోది, వాళ్ళ అద్భుతమైన గ్రంథాలయం.ఒక యూనివర్సిటీ లైబ్రరీకి ఏమాత్రం తీసిపోని రీతిలో దాదాపు వంద పుస్తకాలు ప్రచురించిన ఆశ్రమంలో ఉన్న గొప్ప గ్రంథాలయం. మొదట్లో మన్మథన్ ఆద్వర్యంలో చంద్రబద్నీ ఆలయంలో స్థాపించిన లైబ్రరీ తర్వాత ఆశ్రమంలోకి మార్చ డం జరిగిందట!
దక్షిణదికి చెందిన ఒక మహోన్నత వ్యక్తి. దశాబ్దాలుగా ఉత్తరాఖండ్‌లో అసాధారణ సమాజ సంక్షేమ కార్యక్రమాలకి తిరుగులేని చిరునామాగా నిల్చినవాడు. అవిశ్రాంతంగా ప్రజల కోసం పనిచేస్తూనే జీవితాన్ని చాలించిన మహా వ్యక్తి. అటువంటి మనిషి కోసం అక్కడి ప్రజలు, సంస్థ ఉద్యో గులు కలిసి ప్రతీఏటా చేస్తూ వస్తున్న కార్యక్రమానికి మొట్ట మొదటి సారిగా దక్షిణాది రాష్ట్రాల నుండి ఆయన 35 వ వర్ధంతి సభలో పాల్గొని, నివాళులు అర్పించడం నా మనః తృప్తి కోసమే కానీ మతక్రతువుల మీద నమ్మకంతో మాత్రం కాదు. నాది మానవతతో కూడిన విశ్వ మానవవాదమే కానీ మత వాదం మాత్రం కాదు, కాబోదు!
(మన్మథన్ గురించి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. తమిళనాడుకి చెందిన అమ్మ ఆధ్యాత్మిక సంస్థ మన్మథన్ కోసం డాక్యుమెంటరీ చిత్రం కూడా రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఆయన కోసం రాసిన ఒకట్రెండు హిందీ పుస్తకాలు కూడా ఉన్నాయి. చదివే ఆసక్తి ఉంటే పంపుతాను. అద్భుతమైన అంతెత్తు పచ్చని శిఖరాల మధ్యలో హుందాగా నిల్చి, మనోహరమైన పర్యావరణ పాఠశాల ద్వారా ప్రకృతి స్పృహని ఎందరో విద్యార్ధులకి కల్గిస్తూ, అనేకానేక సాంఘిక అంశాల పై ఈరోజు మరెంతగానో విస్తృత స్థాయిలో పని చేస్తున్న భువనేశ్వరి మహిళా ఆశ్రమం గురించి, స్పూర్తిదాత మన్మథన్ గురించి అక్కడ తీసిన కొన్ని ఫొటోలతో ఈ చిన్న రైటప్!)
– గౌరవ్