భూగోళం తిరుగుతుంది
తన చుట్టూ, సూర్యుడి చుట్టూ కూడా
గ్రహాలూ తిరుగుతాయి
మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తూ.
ఇవి చిన్నప్పుడే తెలుసుకున్న విషయాలు.
తనకు తెలియకుండానే
మనిషి తిరుగుతున్నాడు
నేడు డబ్బు చుట్టూ
అది జీవితాన్ని శాసిస్తూంది
మనిషిని బొంగరంలా తిప్పుతూంది.
తిండి తిప్పలు మరచి
తన వాళ్లను పట్టించుకోక
పరాయి పంచల్లో వలస పక్షిగా మారి
పరుగెడుతున్నాడు అలుపు సొలుపు లేకుండా.
మంచి చెడులు
న్యాయాన్యాయాలు
సిగ్గు ఎగ్గులు విడచి
జీవితమంతా కొట్టుమిట్టాడుతున్నాడు
తాను సృష్టించిన డబ్బుకు బందీగా.
శరీరం కృశించి
ఆరోగ్యం నశించి
అవయవాలు సహకరించక
అవసాన దశకు చేరినపుడు
జీవితం పణంగా పెట్టి
సంపాదించిన లక్షలు కోట్లు కొరగానివని
తన ప్రాణాలు నిలబెట్ట లేవని
సత్యం తెలిసిన రోజున
డబ్బు యావతో అయిన వాళ్లకు దూరమై
ఒంటరిగా నిలచిన రోజున
బ్రతుక్కు అర్థం కనిపించని రోజున
ఆరోగ్యం గురించి
అయినవాళ్ల గురించి
తన జీవితం నుండి తప్పిపోయిన
ఆనందం గురించి
నిష్ప్రయోజనమైన ఆలోచన.
తత్వం బోధ పడేసరికి
సంపాదించిందంతా వదలి నిష్క్రమణ.
ఆకలికి ఆహారం
కొంత శారీరక శ్రమ
వేళకు విశ్రాంతి
ఆహార విహారాల్లో
కోరికల్లో మితం
మనస్థిమితం
ఆచారాలు, సాంప్రదాయాలతో
పండగ పబ్బాల్లో
అభిమానులతో ఆనందం
శారీరక మానసిక ఆరోగ్యానికి మార్గం
అదే జీవిత మహా భాగ్యం.
(ఆరోగ్య దినం సందర్భంగా)
Also read: “స్వతంత్రం”
Also read: “చెప్పుల జోడు”
Also read: “లేమి’’
Also read: “కాలాక్షేపం”
Also read: ‘‘వసంతం’’