బుద్ధరాజు వెంకట అప్పల హరినాథ రాజు అలియాస్ హరనాథ్ (సెప్టెంబర్ 2, 1936 – నవంబర్ 1, 1989) తెలుగు సినిమా కథానాయకుడు. ఆయన 1936లో సెప్టెంబర్ 2 న తూర్పుగోదావరి గొల్లప్రోలు మండలం రాపర్తి గ్రామంలో బుద్దరాజు వరహాలరాజు దంపతులకు జన్మించాడు. ఆయనకు కుమారుడు శ్రీనివాస రాజు, కుమార్తె పద్మజ ఉన్నారు. తండ్రి బుద్ధరాజు వరహాలరాజు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అనే గ్రంథ రచయిత. మద్రాసులో పాఠశాల విద్యను పూర్తి చేసి, కాకినాడలో ఆర్ట్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తన కళాశాల రోజుల్లో, పాఠ్యేతర కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఉత్సాహం ప్రదర్శించిన వ్యక్తి. ఆయన తన కళాశాలలో నాటకాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి నిలిపాడు. కళాశాలలో హరనాథ్ ‘ఇన్‌స్పెక్టర్ జనరల్’ వంటి అనేక నాటకాల్లో నటించాడు. బహుమతులు కూడా గెలుచుకున్నాడు. ఆయన శిక్షణ పొందిన పైలట్. ఒక రోజు, ఆయన పైలట్ శిక్షణా తరగతికి హాజరై తిరిగి వచ్చినప్పుడు దర్శకుడు గుత్తా రామినీడును చూశాడు. వెంటనే రామినీడు హరనాథ్ ను తన మనస్సులో ఒక హీరోగా ఊహించు కొన్నాడు. వెంటనే చిత్రంలో హీరోగా బుక్ చేసుకున్నాడు. ఆ చిత్రం ‘ఋష్యశృంగ.’ 60 వ దశకంలో హరినాధ రాజు తెలుగు సినిమాల్లో రొమాంటిక్ ఐకాన్ గా పేరొందాడు.
తొలి సినిమా ‘మా ఇంటి మహాలక్ష్మి’
ఆయన తొలి సినిమా ‘మా ఇంటి మహాలక్ష్మి’ 1959 లో హైదరాబాద్ సారథీ స్టూడియోస్ లో చిత్రీకరించారు. మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో ఎన్టీయార్, ఏఎన్నార్ తరువాత తెలుగులో హరనాద్ ప్రముఖ హీరో అని అనిపించు కున్నాడు. నందమూరి తారక రామారావు 1959 నిర్మించిన సీతారామ కళ్యాణం’ సినిమాలో శ్రీరాముడుగా నటించాడు. 1967 లో నిర్మించిన భీష్మలో శ్రీకృష్ణుడుగా నటించాడు. 1969 శ్రీ రామ కథ శ్రీ రామ పాత్రలో నటించాడు. సుమారు 117 తెలుగు సినిమాలు, 12 తమిళం, ఒక హిందీ, ఒక కన్నడం సినిమాల్లో నటించాడు. హరనాథ్, జమున తో కలిసి చాలా చిత్రాల్లో నటించాడు. ‘లేత మనసులు’ చిత్రంలో హరనాథ్ నటించిన ‘అందాలా ఓ చిలకా, అందుకో నా లేఖా’ పాట ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని మంత్ర ముగ్దులను చేసింది.
జమున జయప్రదంగా నటన
‘పాలమనసులు,’ ‘పెళ్లి రోజు’ వంటి సినిమాలు, హరనాథ్, జమున ప్రధాన జంటగా అద్భుతమైన విజయాలు సాధించాయి. ఆయన చివరి చిత్రం 1989 లో ‘తోడల్లుడు.’ ఆయన 1981 లో విడుదలైన మా ఇంటి దేవత అనే ఒక చిత్రాన్ని నిర్మించాడు. చివరి దశలో మద్యపానానికి అలవాటు పడడంతో కేవలం అతిథి పాత్రలలో నటించే అవకాశాలే వచ్చాయి.1984లో హరనాథ్ చివరగా చిరంజీవి నటించిన ‘నాగు’ సినిమాలో తండ్రి పాత్ర పోషించాడు. ఆయన 1989, నవంబర్ 1 న మరణించాడు.
హరనాథ్ కుమార్తె జీవీజీ రాజు సతీమణి
హరనాథ్ కుమారుడు శ్రీనివాస్ బుద్ధరాజు చిత్ర నిర్మాత, కుమార్తె పద్మజ చిత్ర నిర్మాత జీవీజీ రాజు భార్య. హరనాథ్ కలవారి సంసారం (1982); గడసరి అత్త సొగసరి కోడలు (1981); బాల భారతం (1972); భలే పాప (1971); కథానాయిక మొల్ల (1970); శ్రీదేవి (1970); తల్లి తండ్రులు (1970); ప్రేమకానుక (1969); చల్లని నీడ (1968); నడమంత్రపు సిరి (1968); బంగారు సంకెళ్ళు (1968); పెళ్ళిరోజు (1968); భక్త ప్రహ్లాద (1967); చదరంగం (1967); శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967); లేత మనసులు (1966); శ్రీకృష్ణ పాండవీయం (1966); చంద్రహాస (1965); సర్వర్ సుందరం (1964); అమరశిల్పి జక్కన్న (1964); మురళీకృష్ణ (1964); పెంపుడు కూతురు (1963); గుండమ్మ కథ (1962); భీష్మ (1962); కలసివుంటే కలదు సుఖం; ఋష్య శృంగ (1961); మా ఇంటి మహాలక్ష్మి (1959); తదితర చిత్రాలలో విభిన్న పాత్రలలో నటించారు.
(నవంబర్ 1… హరనాథ్ వర్ధంతి)