ప్రొఫెసర్ హరగోపాల్, సుధా భరద్వాజ్, ప్రొఫెసర్ పద్మజాషా, ప్రొఫెసర్ లక్ష్మణ్, అరుణ్ ఫెరీరా, జస్టిస్ సురేష్, తదితరులపైన (ఉపా) చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఆందోళన కూడా కలిగించింది. నిరుడు నమోదైన కేసు వివరాలు ఆకస్మికంగా, అసంకల్పితంగా వెల్లడైనట్టు కనిపిస్తోంది. పీపుల్స్ డెమాక్రాటిక్ మూవ్ మెంట్ అధ్యక్షుడు చంద్రమౌళిపైన రెండు మాసాల కిందట ‘ఉపా’ కేసు పెట్టారట. బెయిల్ కోసం ఆయన ఎల్ బీ నగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాడు. చంద్రమౌళి పిటిషన్ పైన వాదనల సందర్భంగా ఆయనపైన మరికొన్నికేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఆ కేసుల వివరాలు చెప్పమని న్యాయస్థానం ఆదేశించింది. అప్పుడు ములుగు జిల్లా తాడ్వాయి పోలీసులు ఏడాది కిందటే ప్రొఫెసర్ హరగోపాల్ తో సహా 152 మందిపైన పెట్టిన ‘ఉపా’ కేసు వెలుగు చూసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతవరకూ 12 ఉపా కేసులు నమోదైనాయి. వాటిలో ఇది ఒకటి. పన్నెండు కేసుల్లోనూ 50 నుంచి 150మంది ప్రజాసంఘాల సభ్యుల పేర్లు రాశారు. హరగోపాల్ పేరు మాత్రం తాడ్వాయి కేసులోనే ఉన్నది.
ములుగు జిల్లా తాడ్వాయిలో పోలీసులు జల్లెడపట్టగా మావోయిస్టులు దొరకకుండా పారిపోయారనీ, వారు వదలివెళ్ళిన సాహిత్యంలో ఒక డైరీ ఉన్నదనీ, అందులో ప్రొఫెసర్ల పేర్లూ, ఇతరుల పేర్లూ ఉన్నాయనీ విశ్వసనీయ సమాచారం. 19 ఆగస్టు 2022నాడు ఈ ‘ఉపా’ కేసు నమోదు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రజాసంఘాల నాయకుల పేర్లు ఈ ఎఫ్ ఐ ఆర్ లో ఉన్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయడానికీ, మంత్రులనూ, శాసనసభ్యులనూ హతమార్చడానికీ మావోయిస్టులతో కలసి కుట్ర చేసినట్టు వీరిపైన అభియోగం మోపారు.
ఈ వివరాలు ఈ రోజు (గురువారం) అన్ని పత్రికలూ ప్రముఖంగా ప్రచురించాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులూ, వామపక్షాల నాయకులూ, ఇతర ప్రజాసంఘాలవారూ ఈ కేసును కొట్టివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. గురువారం రోజంతా ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు.
ఈ కేసు విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానీ, ఐటీమంత్రి కేటీఆర్ కి కానీ తెలియదని నేను భావించాను. తెలిసి ఉంటే హరగోపాల్ వంటి వ్యక్తులపైన ఇటువంటి కేసు బనాయించడాన్ని చూస్తూ ఊరుకోరనీ అనుకున్నాను. ఈ రోజు పత్రికలలో వార్త చదివిన వెంటనే కేటీఆర్ హరగోపాల్ నివాసానికి వెళ్ళి కేసు ఉపసంహరించుకున్నట్టు చెప్పి, సరదాగా కొంతసేపు గడిపి వస్తారని భావించాను. అటువంటిదేమీ జరగకపోవడం, నా అంచనా తప్పుకావడం చాలా బాధ కలిగించింది.
హక్కుల నాయకుడుగా, బాలగోపాల్ తో, కన్నాభిరాన్ తో కలసి పని చేసిన వ్యక్తిగా హరగోపాల్ కు మావోయిస్టులతో పరోక్షంగా పరిచయాలు ఉంటే ఉండవచ్చును కానీ వారి సిద్ధాంతాలను ఆయన చాలా సందర్భాలలో నిర్ద్వంద్వంగా ఖండించారు. హింసాత్మక సిద్ధాంతాలకు ఆయన వ్యతిరేకి. పద్మజా షా అయితే ఉస్మానియా జర్నలిజం శాఖాధిపతిగా పని చేసి ఉద్యోగవిరమణ అనంతరం కొందరు వ్యక్తులతో కలసి సమాజహితం కోసం పని చేస్తున్నారు. ఆమెకు మావోయిస్టులు పరోక్షంగా తెలిసే అవకాశం కూడా లేదు. ప్రొఫెసర్ సుధా భరద్వాజ్ కడచిన ఐదు సంవత్సరాలుగా ముంబయ్ లోనే ఉన్నారు. ఈ కేసు పెట్టిన సమయంలో జైల్లో ఉన్నారు. పెరీరా కూడా అంతే. పౌరహక్కులకోసం పోరాడే ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ కు మావోయిస్టులతో సంబంధాలు ఉండే అవకాశం లేదు. జస్టిస్ హెచ్ సురేష్ ఎఫ్ ఐ ఆర్ రాయడానికి ముందే ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు. అది కూడా చూసుకోకుండా ఎఫ్ ఐ ఆర్ లో పేర్లు రాసేయడం దేనికి నిదర్శనం?
ఎన్నికలు నాలుగు మాసాలలో ఉన్నాయనగా బీఆర్ఎస్ నాయకత్వం హరగోపాల్ వంటి మేధావులపైన ‘ఉపా’ కేసు పెట్టడం అధికారపార్టీకి నష్టదాయకం కాదా? పోలీసు ఉన్నతాధికారుల, న్యాయమూర్తుల, ఐఏఎస్ అధికారుల సమావేశాలలో రాజకీయశాస్త్రం, పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్ పాఠాలు చెప్పే ప్రొఫెసర్ హరగోపాల్ సమాజంలో పేరుప్రఖ్యాతులు కలిగిన పెద్దమనిషి. ఆయనపైన ‘ఉపా’ కేసు పెట్టడం ఒక సబ్ ఎన్ స్పెక్టర్ స్థాయిలో జరిగే పని కాదని తెలుసు. ఈ కేసు కాకుండా ఇంకా డజను ‘ఉపా’ కేసులు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత, అంటే టీఆర్ఎస్/బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ పాలనలో పెట్టారని ఇంతవరకూ పౌరసమాజానికి తెలియదు. ఎవరిపైన ఈ కేసులు పెట్టారో, ఎన్ని కేసులలో ఎంతమందిని నిందితులుగా చేర్చారో తబ్సీళ్ళు తెలియవు.