- ముగురమ్మల ద్వారా మూలపుటమ్మను పూజిస్తాం
- దుష్ట ఆలోచనలను జయించి అన్ని రకాల విజయాలు సాధిస్తాం
- చెడుపై పోరాటం, మంచికి తుది విజయం
భారతదేశంలో హిందువులు చేసుకునే పండుగలలో విజయదశమి చాలా ముఖ్యమైనది. దసరా అనే పేరుతో జరుపుకునే ఈ ఉత్సవాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరున ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో కనకదుర్గమ్మ, తెలంగాణలో బతుకమ్మ, కలకత్తాలో కాళిక, మైసూరులో చాముండి చాలా ప్రసిద్ధమైనవి. దశహర అనే పదం నుండి దసరా వచ్చింది. దస హరా అంటే 10రోజులు. నవరాత్రులు జరుపుకొని, పదవరోజు విజయదశమి జరుపుకుంటారు. విజయదశమికి ఎంతటి ప్రాశస్త్యం ఉందో నవరాత్రులకూ అంతే ప్రాభవం ఉంది. శక్తిని/దుర్గమ్మను ఈ పదిరోజులు విశిష్టంగా పూజిస్తారు. నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉంటూ శక్తి స్వరూపిణిని ఉపాసించడం ఎన్నో ఏళ్ళ నుండి భారతదేశంలో ఉన్న ఆనవాయితీ. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలలో శక్తిని ఆరాధిస్తారు. ప్రధానంగా ముగ్గురమ్మలను, ముగ్గురమ్మల మూలపుటమ్మను ఉపాసిస్తారు.
శ్రీరాముడూ, పాండవులూ అమ్మను ఆరాధించి విజయాలను వరించినవారే
శ్రీరామచంద్రుడు, పాండవులు మొదలు పూర్వ మహా చక్రవర్తులంతా అమ్మను ఆరాధించి విజయపరంపరలు సాధించారు. బాహ్యంగా ఉన్న భౌతిక శత్రువులను జయించడంతో పాటు, ధ్యాన, యోగ, ఉపాసనా మార్గాల ద్వారా మనసులో ఉండే దుష్ట ఆలోచనలను కూడా జయించి, శారీరక, మానసిక, భౌతిక, సామాజిక విజయాలన్నీ సాధించడం కోసం వారందరూ దుర్గోపాసన/శక్తి ఉపాసనను ఎంచుకున్నారు. మహిషాసుర మర్దినియైన శక్తిని నమ్ముకుని వీరందరూ విజయపథంలో ముందుకు సాగారు. శరత్ ఋతువులో వచ్చేరోజులు కాబట్టి వీటిని శరన్నవరాత్రులు అంటారు. మొదటి మూడు రోజులు పార్వతీదేవిని, తర్వాత లక్ష్మీదేవిని, మిగిలిన మూడురోజులు సరస్వతీదేవిని పూజిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే, ముగ్గురు అమ్మలనూ పూజించడం, తద్వారా ఈ మూడు శక్తులకు మూలమైన మహాశక్తిని ఆరాధించడం అని అర్థం చేసుకోవాలి. ఈ పర్వదినాలలో చేసే బొమ్మలకొలువులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.ఇది ముఖ్యంగా పిల్లలను ఎక్కువ ఆకర్షించే వేడుక.
రావణుడిపై రాముడు గెలిచిన సమయం, పాండవుల వనవాసం ముగిసిన సందర్భం
పౌరాణిక గ్రంథాల ప్రకారం శ్రీరాముడు రావణుడిని గెలిచింది ఈకాలంలోనే అంటారు. పాండవులు వనవాసం సమయంలో జమ్మిచెట్టుపై ఉంచిన ఆయుధాలను తిరిగి తీసిన రోజు విజయదశమి అని భారత ఇతిహాసం చెబుతోంది. మన తెలుగు రాష్ట్రాలలో ఎంత గొప్పగా చేసుకుంటామో, ఈశాన్య భారతంలోనూ దేవీపూజను అంతే బాగా చేస్తారు. ముగ్గురు అమ్మల శక్తిగా భావించే ఈ మహాశక్తిలో త్రిమూర్తుల శక్తులు,సర్వ శక్తులు సమ్మిళతంగా దాగి ఉంటాయి. లౌకికంగా చెప్పాలంటే చెడుపై జరిగే పోరాటం. చివర్లో మంచి గెలుస్తుంది. చెడు ఎప్పటికైనా నాశనమవుతుంది, మంచి ఎప్పటికైనా గెలుస్తుందన్నది దీని తాత్పర్యం. చెడ్డవారు కొంతకాలం వెలిగినా, చివరకు ఆరిపోతారు. మంచివారు కొంతకాలం చీకట్లో ఉన్నా, మళ్ళీ వెలుగులోకి వస్తారు. మంచి-చెడు, జ్ఞానం-అజ్ఞానం, సంస్కారం-అహంకారం, వెలుగు-చీకటి, గెలుపు-ఓటమి మధ్య సాగే పోరులో మంచిమార్గంలో వెళితే, మంచి గెలుస్తుంది, మంచే గెలుస్తుందన్నది మూలసూత్రం. ఈ గెలుపును, ఈ వైభవాన్ని పండుగగా జరుపుకోవడమే విజయదశమి. ఈ పదిరోజుల ఉపవాస, ఉపాసనా ప్రస్థానంలో మానసిక, శారీరక ఆరోగ్యాలు పెరుగుతాయి. ఈ పర్వదినాల్లో మరో ఆకర్షణ దసరా వేషాలు.
పగటి వేషగాళ్ళు
వివిధ దేవుళ్ళ వేషాలు ధరించి కొందరు వీధుల్లో తిరుగుతారు. దీన్ని కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీటిని పగటివేషాలు అని కూడా అంటారు. ఒకప్పుడు ఉపాధ్యాయులు విద్యార్థులను వెంటపెట్టుకొని ఇళ్లకు వెళ్లి మామూళ్లు పుచ్చుకునేవారు. “అయ్యవారికి చాలు అయుదు వరహాలు..పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు” అంటూ పాడుతూ వెళ్లేవారు. ఆ కాలంలో ఉపాధ్యాయులకు జీతాలు చాలా చాలా తక్కువగా ఉండేవి.కుటుంబ పోషణకు కూడా ఎంతో ఇబ్బంది పడేవారు. ఇలా సంవత్సరానికి ఒకసారి ఇలా ధన,ధాన్య రూపాలలో మామూళ్లు పొందేవారు. ఇదొక ఆచారం. జ్ఞానం బోధించే ఉపాధ్యాయులు ఆర్ధికంగా చీకట్లో ఉన్నా, సమాజానికి వెలుగులు పంచేవారు. అవి చీకటి రోజులు. అదే సమయంలో, సంస్కారమనే వెలుగులు నింపిన రోజులు కూడా. వివిధ వృత్తులవారికీ మామూళ్లు ఇచ్చేవారు. వీటినే దసరామామూళ్లు అనేవారు. ఇప్పుడు మామూళ్లు అంటే, లంచానికి పర్యాయపదంగా మారిపోయింది. దీన్ని అందంగా ఫార్మాలిటీస్ అంటున్నారు.
డబ్బుమయమై దుర్గతిలో విద్యావ్యవస్థ
వెలుగులు పంచే విద్యావ్యవస్థ డబ్బుమయమైన దుర్గతిలో సాగుతోంది. వీటన్నింటి నుండి సమాజం బయటపడిన రోజులు సమాజానికి నిజమైన పర్వదినాలు. “పండుగ మా ఇంటికి ఎప్పుడూ రాదు, ఆ డబ్బున్న వాళ్ళ ఇంటికే వస్తుంది” అని ఆ మధ్య ఓ కవి ఆవేదన చెందాడు. అలాకాక, అందరి ఇళ్లల్లో పండుగ వాతావరణం రావాలని కోరుకుందాం. విజయవాడలో పదవరోజునాడు కృష్ణా నదిపై అమ్మవారు తెప్పపై ఊరేగుతూ, భక్తులకు దర్శనం ఇస్తుంది. దీన్నే తెప్పోత్సవం అంటారు. ఆంధ్రప్రదేశ్ లో తెప్పోత్సవం చాలా ప్రసిద్ధమైంది. వీరవాసరంలో ఏనుగుల సంబరాలు, విజయనగరంలో సిరిమాను ఉత్సవాలు, వీపనగండ్లలో రాళ్ళ ఉత్సవం, సంగారెడ్డిలో రావణ దహనం, ఒంగోలులో కళారాలు ఈ పర్వదినాల్లో ప్రత్యేకంగా జరిగే వేడుకలు.దుర్గమ్మ దయవల్ల అందరూ దుర్గతి నుండి సద్గతికి వెళ్లాలని ఆకాంక్షిద్దాం. ప్రతిఒక్కరూ చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతమవ్వాలని అభినందనలు తెలుపుదాం. విజయదశమి శుభాకాంక్షలు అందిద్దాం.