- కరోనా పట్ల జాగ్రత్త వహించాలి
- నిత్యావసర వస్తువుల ధరల అదుపులో ఉండాలి
- జనజీవనంలో సంక్షోభం పరిష్కరించాలి
నిన్నటి జ్ఞాపకాలను మోసుకుంటూ, రేపటి ఆశలను రేకెత్తిస్తూ కొత్త సంవత్సరం వచ్చేసింది. ప్రతి జనవరి 1వ తేదీ ఇంగ్లిష్ సంవత్సరాది లాంఛనమే. ఈ రెండేళ్లు కాస్త ఊరట పొందాం. ఇప్పుడు కరోనా మళ్ళీ కలంకలం రేపుతోంది. ముగిసి పోయిందనుకున్న వేళ, అప్రమత్తం అవ్వాల్సిన రోజులు మళ్ళీ వచ్చాయి. నిను వీడని నీడను నేను.. అంటూ కొత్త వేరియంట్ రూపంలో ఇంకా వెంటాడుతూనే ఉంది. వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆశాజనకంగా సాగడం వల్ల నేడు మనలో విశ్వాసం పెరిగింది. కరోనా గురించి అతిగా భయపడవద్దని శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. జాగ్రత్తలు పాటిస్తూ స్వయం క్రమశిక్షణతో ముందుకు సాగుదాం. కాలంలో ఆన్నీ సర్దుకుంటాయనే పాతమాటకు విలువిద్దాం. వ్యక్తుల నుంచి వ్యవస్థల వరకూ సాధించాల్సింది చాలా ఉంది. నిన్నటి చీకటి నుంచి బయటపడిన కొన్ని రంగాలు వెలుగులవైపు అడుగులు వేస్తున్నాయి. నిరంతరంగా కొన్ని వెలుగుతూనే ఉన్నాయి. చీకటివెలుగుల మధ్య దేశ ప్రయాణం సాగుతోంది. వెలుతురు కొంత ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో పల్లెలకు – పట్టణాలకు మధ్య దూరం చెరగిపోతోంది. నగరాల విస్తరణలో కొన్ని గ్రామాలు కనుమరుగైపోయినా, ఇంకా అనేక గ్రామాలు తమ ఉనికిని కాపాడుకుంటునే ఉన్నాయి. పండుగలకు, శుభకార్యాలకు, వేడుకలకు పల్లెలకు వెళ్లే సంస్కృతి క్రమంగా పెరుగుతోంది. వారంతాలు, సెలవుదినాల్లో పల్లెలు కిక్కిరిసిపోతున్నాయి.
Also read: ఎన్నికల వేళ సంపన్నుల హేల
ఆధునిక సదుపాయాలు పల్లోల్లో అందాలి
‘వైఫై’ వంటి సదుపాయాలు పూర్తిగా అందుబాటులోకి వస్తే, పల్లెజీవనం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో పల్లెల అభివృద్ధిపై, సౌకర్యాల కల్పనపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. కరోనా ప్రభావంతో కుంటుపడిన సర్వ వ్యవస్థలను మరమ్మత్తు చేసుకొని ముందుకు సాగడంపై మరింతగా దృష్టి సారించాలి. 2023లో దేశవ్యాప్తంగా సార్వత్రికంతో పాటు కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ కూడా వాటిల్లో ఉంది.రాజకీయం రణక్షేత్రంగా మారుతోంది. అధికార పక్షాలు సైతం ప్రతిదానినీ రాజకీయంగానే చూడకుండా, అన్ని పక్షాల అభివృద్ధిపై దృష్టి సారిస్తే, ప్రగతిరథచక్రాల పరుగు పెరుగుతుంది, ప్రభుత్వాల పరువు నిలుస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి, పెరుగుతూనే ఉన్నాయి. ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సామాజిక ఆర్ధిక శాస్త్రవేత్తలు గొల్లుమంటున్నారు. నిరుద్యోగం ఆకాశాన్ని అంటుతోంది. ప్రతిఒక్కరికీ సాఫ్ట్ వేరే రంగం ఒక్కటే ఉపాధి కాదు. అది కాస్త మెరుగ్గా ఉన్నా, చాలా రంగాలు ఇంకా ప్రగతిని సాధించాలి. చిరుపరిశ్రమలు, హోటల్స్, టూరిజం, మీడియా మొదలైన రంగాలన్నీ ఇంకా అభివృద్ధి పథం వైపు నడవాల్సి వుంది. నిర్మాణరంగం పరిస్థితి కూడా ఇంకా ఊపందుకోవాలి. రియల్ ఎస్టేట్ స్తబ్దుగానే ఉంది.
Also read: పాక్ ఎన్నికల్లో హిందూ అభ్యర్థి
పేదల బతుకుల్లో వెలుగులు నింపాలి
కూలికి వెళ్లి పొట్టపోసుకొని జీవనం సాగించే చాలామంది బతుకుల్లో ఇంకా వెలుతురు అలుముకోవాలి. అసంఘటిత కార్మిక రంగాల ఆకలికేకలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. కొత్త ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలి. నూతన విద్యా విధానంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో మంచిచెడులు రెండూ ఉన్నాయి. విద్యావిధానంపై దేశవ్యాప్తంగా సమగ్రమైన చర్చ జరగాలి. దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు, వ్యవసాయమే జీవధాత్రి. వ్యవసాయం లాభసాటిగా మారకపోతే రైతన్నలు కాడిపడేయడం ఖాయం. అందాకా తెచ్చుకోకుండా ప్రభుత్వాలు వ్యవసాయం సర్వతోముఖాభివృద్ధి వైపు దృష్టి సారించాలి. సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తవ్వాలి. రాష్ట్రాల మధ్య జలవివాదాలు ఏళ్ళుపూళ్ళుగా సాగుతూనే ఉన్నాయి. నదీజలాల అనుసంధానం ఎప్పటి నుంచో వున్న నినాదం.’స్వర్ణచతుర్భుజి’పై మాజీ ప్రధానమంత్రి వాజ్ పెయి ఎన్నో కలలు కన్నారు. నదులు, దారుల అనుసంధానం దేశగతిని సమూలంగా మార్చివేస్తాయని తపనపడిన పాలకులలో మొదటిస్థానం వాజ్ పెయికే దక్కుతుంది. ప్రస్తుతం దేశం బిజెపి ఏలుబడిలోనే ఉంది. ఆ మహనీయుడి ఆశయాలను నెరవేర్చడం, ఆయన వేసిన అడుగుజాడల్లో ముందుకు వెళ్లడంపై నేటి పాలకులు మనసు పెట్టాలి.
Also read: కశ్మీర్ లో కలకలం
మానవ వనరుల సద్వినియోగం
మానవవనరుల సద్వినియోగంపై ప్రత్యేక శ్రద్ధను చూపించినవారిలో ప్రథమ ప్రధాని పీవీ నరసింహారావు. సమాజంలో అనేక రంగాలు ఉన్నట్లే, ఒక్కొక్కరికీ ఒక్కొక్క రంగంలో ప్రతిభ, ఆసక్తి ఉంటాయి. వాటిని గుర్తెరిగి, సద్వినియోగం చేసుకోవడం లాభదాయకం. స్పృశించని రంగాలు, విస్మరించిన విభాగాలు కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటిని సమీక్షించుకుంటూ, మానవవవనరులను శక్తివంతంగా వాడుకుంటే దేశవికాసం కొత్తరూపు తీసుకుంటుందని పీవీ నరసింహారావు చెప్పిన మాటలను నేటి ప్రభుత్వాలు గుర్తుకు తెచ్చుకోవాలి. స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా, మౌలిక సదుపాయాల కల్పనలో పరిపూర్ణతను సాధించుకోలేకపోయాం. సహజవనరులను సద్వినియోగం చేసుకోకపోగా, విధ్వంసం చేసిన దాఖలాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంస్కరణ నెపంతో, ప్రైవేటీకరణ పేరుతో ముఖ్యమైన రంగాలన్నీ పరాయిపరం చేయడంపై ఆయా రంగాలపైన ఆధారపడినవారు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ క్రమంలో, బ్యాంకింగ్, ఎల్ ఐ సీ మొదలైన ఆర్ధిక వ్యవస్థలపై ప్రజల్లో గందరగోళం నెలకొంటోంది. వీటన్నిటిపై ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టమైన హామీలు కొత్త సంవత్సరంలో వినపడతాయని ఆశిద్దాం. ఆరోగ్యం, ఆరోగ్యకర వాతావరణం ఎంత ముఖ్యమో కరోనా కాలం చెప్పేసింది. సర్వ ఆరోగ్యభారత నిర్మాణం వైపు అడుగులు వేద్దాం.నూతన సంవత్సరం భరతజాతికి నూత్న శోభను, వినూత్న ప్రభను చేకూరుస్తుందని ఆకాంక్షిద్దాం.
Also read: కరోనా ఆచూకీ, ఆందోళన వద్దు!