త్రిపుర గారు నాకు సంతకం చేసి ఆయన పుస్తకం పంపించారు. ఉంచుకోలేదు. దాచుకోలేదు. దాచి ఉంచుకునే మనుషులకు ఇచ్చేసా.
పతంజలి గారి చివరి సభలో త్రిపుర గారు వచ్చారు. నా కళ్ళ నిండా కన్నీరే. కళ్ళనిండా పతంజలి గారే. త్రిపుర గారి కేసి చూసింది లేదు.
హైద్రాబాద్ వచ్చిన కొత్తలో త్రిపుర గారి కథకు ఒకదానికి స్టోరీ బోర్డ్ వేసా. ఈ మధ్య కాలంలో త్రిపుర గారి రెండు కథలు “సుబ్బారాయుడి రహస్య జీవితం” “నిద్ర రావడం లేదు” కథలకు బొమ్మలు వేశా ” నిద్ర రావడం లేదు” కథకు బొమ్మ నాకు ఇష్టం అయ్యెంత గా కుదిరింది. ఈ దినం త్రిపుర గారి పుట్టిన రోజు. ఆయనకు హేపీ బర్త్ డే చెప్పండి. ఈ క్రింద ఉన్నది ఆయన కవిత. నాకు ఎంతగానో ఇష్టమైన కవిత. ఈ కవిత చదివి ఆయనకు మళ్ళీ మళ్ళీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి.
మనుష్యులు
పర్వతాలు గొప్ప ఎత్తుగా వుంటాయి
శిఖరాల్ని ఆకాశం నీలిలో తడుపుతూ,
చిరకాలం వుంటాయి కాలం చెరలో పడకుండా.
కాని,
నువ్వు నీ పుట్టిన రోజు పండుగ నాడు
మిత్రుల్ని పిలిచి కూడేసి కూచుందామనుకున్నప్పుడు
ఆ కొండలూ రావూ పిలిచినా, ఆకాశమూ రాదూ,
విహరిస్తున్న మేఘాలూ రావూ కిందికి దిగి,
వచ్చేది మనుష్యులే.
నీ మోర్టల్ హృదయం
సానుభూతి కోసం పరితపిస్తున్నప్పుడు
ఆ కొండల చుట్టూ వీచే గాలులు వీస్తూ వచ్చి
నీతో మాటలూ ఆడవూ, నీ దుఖ్ఖాన్నీ వోదార్చవూ,
నీ కష్టాల గట్టుల మీంచి ఎక్కిస్తూ
నీకు పాటలూ వినిపించవూ.
మర్రిచెట్టు మంచిది.
రావికి చేతులెత్తి కావాలంటే దండం పెట్టొచ్చు.
వరం లాంటిదే వేప.
అయితే,
నీ పెళ్ళినాడు పందిట్లో సన్నాయితో వూగుతూ
నువ్విచ్చిన తాంబూలాల్ని ఎర్రగా నవ్వుతూ
నీ తల మీద అక్షింతలు జల్లేది
నీ పిలుపు విని వేంచేసిన మనుష్యులే.
మర్రీ రాదూ, వేపా రాదూ, రావాకూ రాదూ,
పక్షులూ అంతే.
సరస్సులూ, లేళ్ళూ, రప్పలూ,
వువ్వులూ అంతే. రాళ్ళూ అంతే.
రెక్కలూ, రంగు మేఘాల అంచుల
ఎంబ్రాయిడరీ కూడా అంతే.
నీ కళ్ళ రెప్పల మీద బరువుగా
నీ ఆఖరి క్షణాల్లో వాలిన మృత్యువు
రెక్కలు విదిలిస్తున్నప్పుడు గాలులూ రావూ,
విలపిస్తూ వచ్చి వృక్షాలు కళ్ళ నీళ్ళు
రాల్చనూ రాల్చవూ,
పువ్వులూ రావూ,
పరిమళాలూ రావూ
నమస్కారాలు గుబాళిస్తూ.
మనుష్యుల భుజాల మీంచే పోతావు
నీ అంతిమ విశ్రాంతి కోసం.
నీ చితి చుట్టూ చేరిన
మనుష్యుల కళ్ళ నీళ్ళ జ్ఞాపకంలోనే
మెదులుతూ వుంటావ్,
ఆ మనుష్యుల జ్ఞాపకాల కళ్ళ నీళ్ళలోనే
కదులుతూ వుంటావ్.
– త్రిపుర