రామాయణమ్ – 157
తమ్ముని మాటలు మన్నించాడు రావణుడు.. ఇతడు వానరుడు. వాలము వీనికి ఇష్టము కావున వాలమును కాల్చివేయండి. కాల్చివేయబడిన వాలముతో విరూపుడై తన తోటివారిలో నవ్వుల పాలై పోతాడు. ఆ! వీని వాలము కాల్చిపురవీధులలో తిప్పండి పౌరులకు వినోదమవుతాడు.
నూలుబట్టలు తెచ్చారు తోకకు చుట్టబెట్టారు వారు చుడుతూ ఉన్నారు వాలము పెరుగుతూనే ఉంది.
బట్టలు చుట్టిన తోకను నూనెలో తడిపారు. నూనెతో తడిపిన తోకకు నిప్పుపెట్టారు.
Also read: రావణుడికి విభీషణుడి హితవు
అంతవరకు ఓపికగా ఉన్న స్వామి ఒక్కసారిగా వళ్ళు విదిలించాడు. పట్టరాని కోపముతో తనచుట్టూ ఉన్న రాక్షసులను క్రిందకుపడదోశాడు.
వానరుడి తోకకు నిప్పుపెట్టారు అన్నవార్త నగరమంతా దావానలంలా వ్యాపించింది. పిల్లలు, పెద్దలు, పడుచు వారు, ముసలివారు అంతా అక్కడికి చేరారు.
మరల రాక్షసులు అక్కడ స్వామిని మరోసారి బంధించారు…ప్రశాంతంగా బంధిస్తుంటే బంధించనీ అని అనుకున్నాడు. ఆయన ఆలోచనవేరుగా ఉన్నది. రేపుజరుగ బోయే మహాయుద్ధానికి సన్నద్ధత కావాలంటే మొత్తం లంకానగరంలోని సందులూ, గొందులూ ఆ కోటలో ఆమూలాగ్రం తెలియాలి.
Also read: రావణుడికి హనుమ ధర్మబోధ
‘‘ఇప్పుడు వీరు నన్ను మొత్తం లంక అంతా తిప్పుతారు. లంక మొత్తాన్ని విశేషంగా పరిశీలిస్తాను. రహస్యాలన్నీ రామునికి నివేదిస్తాను’’ అని సంకల్పించుకొన్నవాడై తప్పించుకొని పైకి ఎగుర గలిగే శక్తి ఉన్నా మారుమాటాడకుండా వారి వెంట లంకా నగర వీధులలో నడువసాగాడు మహాబలి వాయుపుత్ర హనుమంతుడు.
హనుమ స్వామి వారి వెంట తిరుగుతున్నాడు. రహస్యభూగృహాలను చూశాడు. చిత్రవిచిత్రమైన విమానాలు చూశాడు. బాగా తీర్చిదిద్దిన చతుష్పథాలనూ చూశాడు. మార్గాలన్నిటినీ నిశితంగా పరిశీలించాడు.
రాక్షసులు స్వామిని చూపెడుతూ ఇతడొక గూఢచారి. బాగా చూడండి. ఇతడికి ఏమి శాస్తి అయ్యిందో…అని చెపుతూ నడిపించారు. పురజనులంతా బయటకు వచ్చి కుతూహలంతో ఆ హనుమంతుడిని తిలకించారు.
ఈ సంగతి ఆ నోట ఈ నోట బడి సీతమ్మదాకా చేరింది. ఒక్కసారిగా దుఃఖతప్తురాలై ఆవిడ అగ్నిని జ్వలింపచేసి ఉపాసించింది.
Also read: రావణుడి ఎదుట నిలిచిన వాయునందనుడు
హనుమంతుడి క్షేమముకోరుతూ ఆ మహా తల్లి ఈ విధంగా ప్రార్ధన చేసింది.
యద్యస్తి పతి శుశ్రూషా యద్యస్తి చరితం తపః
యది చాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమతః
అగ్నిదేవా నేను పతి సేవ చేసినదాననే అయితే, నేనేదైన తపస్సు చేసి ఉన్నట్లయితే, నాకు పాతివ్రత్యమే ఉన్నట్లయితే, హనుమంతుని విషయమున చల్లగా ఉండుము.
సీతమ్మ తల్లి చేసిన ప్రార్ధనకు మెచ్చి వరమిచ్చినాడన్నట్లుగా ఆవిడ జ్వలింప చేసిన మంట ప్రదక్షిణముగా తిరుగుతున్న జ్వాలాగ్రములతో ప్రకాశించింది.
తన స్నేహితుడి పుత్రుడు, రామబంటు అయిన హనుమంతుని విషయములో అగ్ని దేవుడు తన సహజప్రకృతిని ఉపసంహరించుకొని ఆయన వాలాగ్రమందు చల్లగా ఉండెను.
Also read: బ్రహ్మాస్త్రానికి బద్ధుడైన వాయుసుతుడు
‘‘ఆశ్చర్యము! నన్ను ఈ అగ్ని ఎందుకు దహించి వేయుట లేదు? ఓహో తెలిసినది మహాపతివ్రతాశిరోమణి సీతమ్మ తల్లి చలువ ఇది. అందుకే నా తోక చివర మంచుపెట్టినట్లుగా ఉన్నది.
ఇక ఆలోచించదలుచుకోలేదు. ఆలస్యము చేయదలచలేదు. కాయము పెంచి తన బంధనాలు తెంచుకొని సర్రున గగన వీధిలోకి దూసుకొని పోయినాడు.
కోటగోడలమీదకు ఎగిరి ప్రధాన ద్వారము వద్దనుండి పెద్ద పరిఘను ఊడబెరికి కావలివాండ్లను చావమోది సింహగర్జన చేసి తనను కాపాడుతున్న అగ్నిదేవుడికి సంతర్పణ చేయవలెనని సంకల్పించి ఎగిరి దూకుతూ లంకలోనిఇళ్ళకు నిప్పంటించడము మొదలు పెట్టినాడు.
Also read: రావణ సుతుడు అక్షకుమారుడి వధ
వూటుకూరు జానకిరామారావు