రామాయణమ్ – 131
ఇప్పుడేమిచేసిన కాలానుగుణముగా, యుక్తముగా యుండును?అని ఆలోచించసాగాడు హనుమంతుడు.
‘‘సీతాదేవిని చూడకుండా కిష్కింధకు తిరిగి వెళ్ళినచో ఏమి సాధించినట్లు? సముద్రాన్ని దాటడము, లంకానగరప్రవేశము, రాక్షసులను చూడటము ఇవి అన్నీ వృధాయే కదా!
‘‘నేను తిరిగి వెళ్ళి ‘సీతమ్మకనపడలేదు’ అనుమాట పూర్తిచేయకమునుపే రాఘవుని ప్రాణములు గాలిలో కలిసిపోవును. అది చూసి లక్ష్మణుడు కూడా జీవించడు….రామలక్ష్మణుల మరణవార్త విని భరతశత్రుఘ్నులు ప్రాణములు విడుస్తారు. అన్నదమ్ములు నలుగురినీ చూసి బ్రతుకుతున్న రాజమాతలు మువ్వురూ తమ తనువు చాలిస్తారు.
Also read: చింతాక్రాంతుడైన ఆంజనేయస్వామి
ఇంత ఘోరము జరిగిన తరువాత సుగ్రీవుడు మాత్రము ప్రాణములతోయుండునా? అది కల్ల! ఆయన దేహపరిత్యాగమును చూసి రుమ, తార ఆయనను అనుసరిస్తారు. వారి వెనుక అంగదుడూ మరణిస్తాడు. సమస్త వానరకోటి దుఃఖసాగరములో మునిగిపోతుంది! కొందరు తట్టుకోలేక స్వర్గమువైపు పరుగులిడెదరు.
‘‘నేను ఒకవేళ ఉత్త చేతులతో తిరిగివెళ్ళినట్లయితే ఇన్ని అనర్ధములు గోచరించుచున్నవి. కావున కిష్కింధకు వెళ్ళనే వెళ్ళను. ఇక్కడే చేతికందిన ఏవో కాయకసరులు తినుచూ కాలము వెళ్ళబుచ్చెదను. ‘హనుమంతుడు ఇకవచ్చును, ఇకవచ్చును, శుభవార్తతెచ్చును’ అనుకొనుచూ ఆశతోనైనా వారు మనుగడ సాగించెదరు ….లేదా చితిని పేర్చుకొని నాశరీరమును అగ్నికి ఆహుతిచేసెదను. అంతియేకానీ సీతాదేవి కనపడలేదు అను వార్త మాత్రము రామునికి ఎరిగించుట నాద్వారా జరుగదుగాక జరుగదు!
Also read: హనుమ ఎంత వెదికినా కానరాని సీతమ్మ
‘‘మరణించుట అనేక దోషములకు హేతువు కావున నేను ప్రాణములు విడువను. ఇన్ని అనర్ధములకు హేతువైన ఆ దశకంఠుని మాత్రము విడిచిపెట్టను. వానిని హతమార్చెదను. వాడు చేసిన పనికి ప్రతిక్రియ చేసినట్లగును. లేదా వానిని పశువును ఈడ్చుకొని పోయినట్లు పలుపుతాడు మెడకు తగిలించి లాగుకొనిపోయి రాముని పాదాల వద్ద పడవేసెదను.’’
అని పరిపరి విధములుగా ఆలోచించుచూ, మనస్సులో దుఃఖము పొంగిపొరలుతుండగా అటునిటు చూస్తూ ఉండగా ……దూరముగా సమున్నతమైన వృక్షములతో అలరారుచూ ఉన్న అశోకవనము కనపడెను.
‘‘అవును, అక్కడ ఇంకా నేను వెతుకలేదు. అప్పుడే ఇంత నిరాశ ఎందుకు?
Also read: లంకలో హనుమ సీతాన్వేషణ
వసు, రుద్ర, ఆదిత్య, మరుత్తులకు నమస్కరించి మరల ప్రయత్నము చేసెదెను. ఈ రాక్షసుల దుఃఖము వృద్ధిపొందుటకై ప్రార్ధించెదను’’ అని అనుకొని అశోకవనములో ప్రవేశించుటకు ఉద్యుక్తుడైనాడు హనుమస్వామి.
‘‘ఇక్ష్వాకుకుల ఆనందవర్ధిని అయిన సీతను రాముని వద్దకు చేర్చెదను’’ అని క్షణకాలము ధ్యానించి లేచి ….
నమోస్తురామాయ సలక్ష్మణాయ
దేవ్యైచతస్యైజనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో
నమోస్తుచంద్రార్క మరుద్గణేభ్యః ….
అని ప్రార్ధిస్తూ అన్ని దిక్కులకూ తిరిగి నమస్కారము చేసెను.
Also read: లంకా నగరిలో సీతమ్మకోసం హనుమ అన్వేషణ
(NB.
పై శ్లోకము ఒక మహా మంత్రరాజము. ఇది నిత్యము చదువుకొనగలరు……అర్ధము —
లక్ష్మణునితో కూడియున్న రామచంద్రునకు నమస్కారము. దేవియగు జనకాత్మజకు( సీతమ్మకు)నమస్కారము. రుద్ర, ఇంద్ర, యమ, వాయు దేవతలకు నమస్కారము. చంద్రసూర్యమరుద్గణములకు నమస్కారము ……
ఈ శ్లోకములో మూడుసార్లు “నమ” శబ్దము ప్రయోగింపబడినది.
సీతమ్మ సాక్షాత్తూ లక్ష్మీస్వరూప. ఆమె స్వామిని విడిచియుండుట ఏమి? ఇది ఎన్నడునూ జరిగినది కాదు. అయిననూ అమ్మను తాను అన్వేషించుట ఏమి? అన్వేషించునది తానుకాదు. నేను కాదు. ఈ భావన వచ్చుట కొరకే …న..మః ….
మః అనగా నాది, న అనగా కాదు, అనగా అన్వేషించు బాధ్యత తనది కాదు. ఆవిడంతట ఆవిడే సాధకుడికి ప్రత్యక్షమవ్వాలి. జనకుడు ఆవిడను పొందవలెనని కాదుగా యజ్ఞక్షేత్రమును దున్నినది. ఆవిడంతట ఆవిడే స్వయం ప్రకటిత మయినది కదా. ఇప్పుడు కూడా అలా జరుగవలసినదే.
అందుకే తాను వెతికితే ఆవిడ కనబడదు. ఆమె దయకలగాలి. అందుకే… న..మః ..(ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి భాష్యము ఆశ్లోకానికి)
Also read: లంకిణితో హనుమ ఘర్షణ
వూటుకూరు జానకిరామారావు