Tuesday, January 21, 2025

సీతమ్మతో హనుమ సంభాషణ

రామాయణమ్ 140

..శరీరము పచ్చన,

కట్టిన వస్త్రము తెల్లన,

తేజస్సు అపరిమితమైన మెరుపులకాంతి!

రూపములో వానరము!

ఆ రూపము చూసి ఒక్కసారిగా సీతమ్మ ఉలిక్కిపడ్డది.

Also read: సీతమ్మ కంటబడిన హనుమ

‘‘ఇది కలయా ! నిజమా! ఇది స్వప్నమే! కలలో నాకీనాడు వానరరూపము కనపడ్డది. ఏమి కీడు మూడనున్నదో’’ అని ఉలిక్కిపడింది సీతామాత.

‘‘నా రామునకు క్షేమమగుగాక,

రామానుజునకు క్షేమమగుగాక,

నా తండ్రి జనకమహారాజుకు క్షేమమగుగాక.

రాముడు దగ్గరలేని నాకు సుఖమెక్కడిది?

Also read: రాక్షస స్త్రీల మానసిక హింస, త్రిజట కల

అసలు నాకు నిద్రేపట్టుటలేదుకదా!

ఈ స్వప్నమెచటనుండి వచ్చును.

ఇది నిజమే!

సదా నా మనస్సు రామనామ ధ్యానములోయున్నది కనుక రామునకు సంబంధించిన విషయములే నా చెవులలో మారుమ్రోగుచున్నవి.

అయినా ఈతడు నా ఎదురుగా స్పష్టమైన రూపము ధరించియుండి నిలచియున్నాడు కదా!

ఇది సత్యమే అయి ఉండును!

Also read: సీతను దారికి తేవాలని రాక్షసస్త్రీలను ఆదేశించిన రావణుడు

పగడంపు ముఖము కలిగి దోసిలియొగ్గి వినయముతో సీతమ్మ ఎదుట నిలచి …హనుమ…

‘‘తల్లీ,  నీవెవ్వరవు? నలిగిన బట్టకట్టి నగుమోము నుండి కన్నీరు వర్షించుచూ దీనముగా ఈ చెట్టుకొమ్మను పట్టుకొని యున్నావు.

రెండు తామరపూవులనుండి నీరుకారినట్లు నీ కన్నులు కన్నీరు కురియుచున్న వేమమ్మా?

ఓ దోషరహితురాలా?

సురవనితవా?

కింపురుషపడతివా?

గంధర్వ ఇంతివా?

రాక్షసస్త్రీవా?

నాగుల పడుచువా?

యక్షుల ఆడపడుచువా? ఎవరుతల్లీ నీవు ?

ఏ జాతికి చెందినదానవు ?

Also read: ‘నువ్వు గడ్డిపోచతో సమానం’ అని రావణుడికి స్పష్టం చేసిన సీత

నీవు రుద్రగణములోని దానివా?

నీవు మరుద్గణములోని దానివా?

లేక వసుగణములోని దానివా?

నాకు నీవు దేవతాస్త్రీవనిపించుచున్నది.

అమ్మా వసిష్ఠుని మీద అలిగి ఇచటికేతెంచిన అరుంధతివా

నీకు ఎందుకింత వేదన?

ఎవ్వరి గురించి ఈ రోదన?

నీ ఏడుపులు

నీ నిట్టూర్పులు

నీ కనురెప్పల కదలికలు …నీవు దేవతాస్త్రీవి కాదు అని తెలుపుచున్నవి.

సాముద్రిక లక్షణములు  నీవెవ్వరో క్షత్రియ వనిత అని తెలియ చెప్పుచున్నవి.

నేను అడుగుచున్నాను చెప్పుమమ్మా.

జనస్థానమునండి రావణుడెత్తుకు వచ్చిన రామపత్నివి సీతమ్మవు కావుకదా? నాకు నీవు రాముని భార్యవే అని అనిపించుచున్నది …’’

అనుచూ హనుమ స్వామి నెమ్మదిగా సీతమ్మ కంగారు పడకుండా సంభాషణ ప్రారంభించాడు….

హనుమ అడిగిన ప్రశ్నలువిన్న సీతామాత మెల్లగా తన గురించి చెప్ప సాగింది.

నేను కోసలాధీశుడైన దశరధమహారాజు కోడలిని. విదేహాధిపతి జనకుని కుమార్తెను. దశరధమహారాజు పెద్దకొడుకు శ్రీరాముని ఇల్లాలిని. అయోధ్యలో పండ్రెండు ఏండ్లు  అనుపమ భోగములనుభవించితిని.

దశరధమహారాజు రామునకు పట్టాభిషేకము చేయ సంకల్పించెను. ఆ విషయము తెలిసి కైక తనకు దశరధుడిచ్చిన వరములను గుర్తుచేసి ఆ వరములుగా రాముని వనవాసము, తన కొడుకైన భరతుని పట్టాభిషేకము కోరుకొనెను.

క్రూరమూ, అప్రియమూ అయిన కైక మాటలకు విలవిలలాడిన దశరధమహారాజు తన మాటను మీరలేక రాముని అరణ్యమునకు పంపివేసెను.

Also read: సీతను సుముఖం చేసుకోవడానికి రావణుని ప్రేలాపన

రామునితోడుగా నేను, ఆయన నీడ వలె లక్ష్మణుడు అనుసరించితిమి.

దండకారణ్యమందు మేము నివసించుచుండగా రాముడు లేని సమయము చూసి నన్ను అపహరించుకొని వచ్చి నాడు దురాత్ముడైన రావణుడు.

నాకు ఒక సంవత్సరము గడువొసగినాడు. అందులో పది మాసములు గడచిపోయినవి. ఇక ఈ బొందిలో ప్రాణముండునది రెండు నెలలవరకే ….అని సీతమ్మ తన ఎదురుగా ఉన్న హనుమస్వామికి చెప్పి మౌనము దాల్చెను.

అప్పుడు హనుమంతుడు …అమ్మా! నేను రాముడు పంపగా నీవద్దకు దూతగా వచ్చినాను. అచట రాముడు క్షేమము. నీ క్షేమము గూర్చి అడిగినాడు…

Also read: భీతిల్లే లేడికూన సీత

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles