రామాయణమ్ – 153
శీఘ్రముగా రధము మీద తన వైపు వస్తున్న ఇంద్రజిత్తును చూసి సింహనాదము చేసి కాయమును పెంచి సన్నద్ధుడై నిలిచాడు మహాబలి మారుతి.
వరుసగా పిడుగుల పడినట్లుగా ధనుష్ఠంకారము చేస్తూ వాడివాడి నారాచములను ఇంద్రజిత్తు ప్రయోగించగా వాటి వేగాన్ని గేలి చేస్తున్నట్లుగా వాయుసుతుడు రయ్యిమంటూ ఆకాశములోకి దూసుకొని పోయెను.
Also read: రావణ సుతుడు అక్షకుమారుడి వధ
బాణమునకు బాణమునకు మధ్య తానొక తారాజువ్వ అయిపోయి సంచరిస్తూ ఇంద్రజిత్తు చేసిన శస్త్రప్రయోగమును వ్యర్ధముగావించెను.
అంత దివ్యాస్త్రములు ప్రయోగించిన ఇంద్రజిత్తు అవి కూడా మారుతిని రవ్వంత కదిలించలేక పోయినందుకు మనస్సులో కళవళ పడెను.
అస్త్రములు వ్యర్ధమైపోయాయి.
Also read: అనేకమంది రాక్షస యోధులను యమసదనానికి పంపిన హనుమ
శస్త్రములువికలమయిపోయాయి. ఇంద్రజిత్తు చేస్తున్న యుద్ధము అంతా నిష్ప్రయోజనమయిపోయింది.
అసలు ఇంద్రజిత్తు చేసే ప్రతిప్రయోగాన్ని ఆదిలోనే సునిశితంగా గమనించి తదనుగుణంగా తన వేగాన్ని వృద్ధిపొందిస్తూ చిత్రవిచిత్ర గతులలో బాణానికి బాణానికి మధ్య సంచరిస్తూ ఆ రావణకుమారుని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించాడు హనుమస్వామి.
‘‘ఇక లాభంలేదు. ఇతడు సామాన్యుడు కాడు. బ్రహ్మాస్త్రప్రయోగము చేయవలసినదే’’ అని మనస్సులో సంకల్పించి ఆ అస్త్రమును అభిమంత్రించి మారుతిపై ప్రయోగించాడు ఇంద్రజిత్తు.
Also read: హనుమపై రాక్షసమూక దాడి
‘‘ఇక తప్పదు తనమీదకు వస్తున్నది బ్రహ్మాస్త్రము. ఈ యుద్ధానికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి. బ్రహ్మదేవుడిచ్చిన వరమున్నది తనకు. అయినా తాను బద్ధుడు కాక తప్పదు. తనను బ్రహ్మదేవుడు, మహేంద్రుడు, వాయుదేవుడు సదా రక్షించుచునే యుందురు కావున తనకు వచ్చిన నష్టమేమీలేదు. అదీగాక రావణ సముఖమునకు వెళ్ళి అతనితో మాట్లాడి వెళ్ళవలెను. కావున వీరు నన్ను పట్టుకొనినచో పట్టుకొననిమ్ము’’ అని ఆలోంచించి నిశ్చయించుకున్నాడు మహానుభావుడైన హనుమంతుడు.
అంతే!
మరుక్షణములోనే బ్రహ్మాస్త్రము ఆయనను బంధించినది. కదలలేక నేలపై అచేతనముగా పడిపోయాడు అనిలసుతుడు.
రాక్షసుల ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఆ మహాకపిని సమీపించి ఆయనను తాళ్ళతో బంధించారు….అది చూసి వెంటనే ఇంద్రజిత్తు ‘‘అయ్యో, ఎంత మూర్ఖులు వీళ్ళు. బ్రహ్మాస్త్రబద్ధుడిని తాడుతో కట్టిన ఎడల ఆ అస్త్రము తక్షణమే బంధవిముక్తుడిని చేస్తుంది కదా అని ఎంతో విచారించాడు.
కానీ హనుమ స్వామి ఆలోచన వేరుగా యున్నది. రావణుని వద్దకు వెళ్ళ వలెననే ఆలోచనలోయున్న ఆయన ఇవేవీ గమనించలేదు.
రావణ సభామంటపమున ఆయన ముందు బంధించబడియున్న హనుమంతుడిని ప్రవేశపెట్టారు రాక్షసభటులు.
అమిత తేజస్సుతో బలముతో ప్రకాశించు రావణుని ఆంజనేయుడు నిర్భయముగా తలెత్తి తేరిపార చూశాడు.
Also read: విధ్వంసమైన అశోకవనం, భీతిల్లిన రాక్షసగణం
వూటుకూరు జానకిరామారావు