Thursday, November 21, 2024

అశోకవన విధ్వసం ప్రారంభించిన హనుమ

రామాయణమ్ – 147

‘‘ఇంక నేను ఒక్క మాసము మించి జీవించను. ఇది సత్యము. పాపాత్ముడైన రావణుని బారినుండి నన్ను వెంటనే రక్షించవలెను. హనుమా,  ఇదుగో  చూడామణి! దీనిని రామచంద్రునకు ఇమ్ము అని ఇచ్చి అందరినీ కుశలమడిగినట్లుగా చెప్పము’’ అంది సీతామాత. హనుమంతుడు ఆ చూడామణిని గ్రహించి తన వేలికి తొడుగుకొనెను.

‘‘‘హనుమా, ఈ చూడామణిని చూడగనే రాముడు నన్నూ, నా తల్లినీ, దశరధమహారాజునూ మువ్వురినీ స్మరించును’’ అని పలికిన సీతమ్మకు నమస్కరించి ఇక తిరిగి పయనమై పోవుటకు బయలుదేరెను.

Also read:  సీతమ్మను ఓదార్చిన హనుమ

‘‘ఓ హనుమా, రామలక్ష్మణులు ఇరువురికీ మంత్రిసమేతుడైన సుగ్రీవునకూ  ఇతర వానరులకూ నేను వారి కుశలమడిగినట్లుగా తెలుపుము. మహాబాహువైన రామచంద్రుడు నన్ను ఈ దుఃఖసముద్రమునుండి ఉద్ధరించు ఉపాయము చేయుము. నాకు ఒక సందేహము. వానరభల్లూక సైన్యములు ఈ మహా సముద్రమును దాటగలవా?’’

సీతమ్మ సందేహాన్ని విన్న హనుమ స్వామి, ‘‘అమ్మా, మహాబలశాలురైన కోట్లకొలది వానరులు సుగ్రీవుని ఆజ్ఞకు కట్టుబడి సముద్రము దాట కృతనిశ్చయముతో ఉన్నారు. వారందరూ నా కంటేగొప్ప బలసంపన్నులు. నీవు చింతించవలదు. ఇటువంటి అల్ప కార్యములకు రాజులు వారి వద్దనున్న శ్రేష్ఠులను పంపరుగదా! నేను అతి సామాన్యుడైన వానరుడను తల్లీ’’ అని ఆమెకు నమ్మకము కలిగించినాడు.( ఇదీ హనుమ స్వామి గొప్పదనం).

Also read: రాముని ససైన్యముగా తోడ్కొని రమ్ము, హనుమకు సీతమ్మ పురమాయింపు

‘‘అమ్మా, శ్రీరాముడు లక్ష్మణసమేతుడై వానరవీరులందరితోనూ కలసి అతి త్వరగా ఇచటకు వచ్చి శత్రువులను నశింపచేసి నీ శోకము రూపుమాపగలడు. రామ కోదండము శత్రుమూకలను ఎప్పుడు చీల్చి చెండాడవలెనా అని తొందర పడుచున్నది.’’

హనుమ మాటలకు సంతసించిన సీతమ్మ, ‘‘నాయనా, ఇచట ఎక్కడైనా కాసేపు విశ్రాంతి తీసుకొని రేపు బయలు దేరుమయ్యా’’ అని ఆదర పూర్వకముగా పలికెను.

(ఒక మనిషి రేపో మాపో పోయేటట్లు ఉన్నాడు ,కానీ డాక్టరుగారు మాత్రం ఏం ఫరవాలేదులే you will be alright తగ్గిపోతుంది అని చెప్పి ధైర్యవచనాలు పలుకుతారు. ఎందుకు? రోగికి ముందు మానసిక ధైర్యం ఎప్పుడూ కలిగించాలి ఇది positive thinking అంటే!

Also read: హనుమ సూచనను సున్నితంగా తిరస్కరించిన సీతమ్మ

అలాగే స్వామి తాను మొదట లంకలో అడుగు పెట్టినప్పుడు మొదట, ‘‘వామ్మో, ఇంత పెద్ద సముద్రాన్ని నేను, సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు, ఇంకొక నలుగురైదుగురు తప్ప దాటలేమే! ఏంటి పరిస్థితి? అని చింతపడి సరే దాని సంగతి తరువాత, ముందు జరగవలసిన పని ఏమిటి?’’ అని ఆలోచించి మొదలుపెట్టారు.

సీతమ్మ ఈ సముద్రాన్ని దాటి మీరు రాగలరా అని అడిగితే, ‘‘నేను చాలా చిన్నవాడినమ్మా. ఇలాంటి వెతికే పనులకు అతి తక్కువ స్థాయి వ్యక్తులను కదా రాజు పంపేది. మా సుగ్రీవులవారివద్ద నాకంటే గొప్పవారు కోట్లమంది ఉన్నారు. నీకేం ఫరవాలేదు’’ అని చెప్పటం ఉంది చూశారూ ! అదీ హనుమస్వామి అంటే!)

((విద్య ,బలము,,వేగము,ఇంద్రియనిగ్రహము,వినయము ,సేవానిరతి ! ఇన్ని కలగలిస్తే స్వామిహనుమ!)

బీడుభూమిలో వర్షము కురియగనే మొలకలు వచ్చునట్లు నీ మాటలు నా హృదయములో ఆనందమును మొలకలెత్తించినవి. రామచంద్రునకు…..కాకిమీద ప్రయోగించిన దర్భ నా ఆనవాలుగా చెప్పుము. చూడామణిని నా ఆనవాలుగా చూపుము. నుదుట దిద్దవలసిన తిలకమును గండస్థలముపై దిద్దిన సంగతి నా ఆనవాలుగా చెప్పుము. ఓ రామా, నీవు వస్తావన్న ఆశ నాలో పెనుధైర్యము పుట్టించినది. ఓ రామా, ఆ ధైర్యమే ఈ రక్కసి మూకలు పెట్టే చిక్కులు భరించునట్లుగా చేయుచున్నది’’ అని పలుకుచున్న సీతమ్మ వద్ద సెలవు తీసుకొని హనుమంతుడు ఆ ప్రదేశము నుండి కొంచెము దూరముగా వెళ్ళి ఆలోచించ సాగెను.

Also read: మలక్ష్మణుల యోగక్షేమములు అడిగి తెలుసుకున్న సీత

సీతమ్మను చూసినాను. ఇంక కొంచెము పని మాత్రమే మిగిలి ఉన్నది. అనివార్యము యుద్ధము. మరి అందుకు సిద్ధము కావలెనన్న రాక్షస రాజు బలమెంతో, ఆయుధసంపత్తి ఏ పాటిదో తెలుసుకొని వెళితే అది లాభదాయకము. ఈ రాక్షసులను నెమ్మదిగా సామముతో అడిగి ఆ విషయము తెలుసుకొనలేము! స్వర్ణలంకా వాసులైయుండి సకల ఐశ్వర్యములతో తులతూగుతూ సకల భోగాలతో ఆనందము అనుభవించు వారికి దానము మనమేమి ఇచ్చి లోబర్చుకొనగలము? ఆ మార్గము వీరి ఎడ సఫలము కాదు.

ఒక మహాబలవంతుడైన రాజుక్రింద యుండు వారికి ఒకరికొకరికి మధ్య భేదము పెట్టి వివరాలు తెలుసుకొనుట అసలుకే సాధ్యముకాదు.

ఇక బలప్రదర్శన మాత్రమే సరి అయిన మార్గము.

రాజుకు కోపము తెప్పించు పని ఏదైనా చేసి వారి సేనలతో యుద్ధము చేసిన గాని మనకు అన్ని విషయములు అవగతము కావు.

మరి రావణునికి కోపమెట్లు తెప్పించవలెను?

అతనికి అత్యంత ప్రియమైనదానిని ఏదైనా పాడు చేయవలెను

అటువంటిది ఏది? …ఇదుగో అత్యంత శోభతో అలరారుతున్న ఈ అశోకవనమే! కావున దీనిని ధ్వంసము చేసెదను ….అని నిశ్చయించుకొని హనుమంతుడు అశోకవనిని ధ్వంసము చేయ మొదలిడెను.

NB

అశోక వనాన్ని ఎందుకు పాడు చేయవలసి వచ్చినది? ఊరికే కాదు ఇదుగో ఇంత ఆలోచన ఉన్నది . strategic thinking…

ఒక పని అయినవెంటనే తరువాత పని ఏమిటి ? అని నిర్ణయించుకొని కొనసాగించేవాడే కార్యసాధకుడు. ALWAYS DEFINE NEXT MOVE ..ఇది నిరంతరం పని చేసే వారి లక్షణం!

ఇది కూడా స్వామిని చూసి నేర్చుకోవాలి.

Also read: రాముడిచ్చిన అంగుళీయకము సీతమ్మకు సమర్పించిన హనుమ

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles