రామాయణమ్ – 127
లంకానగర అధిదేవతను ఆ విధంగా పీచమణచివేసి కోటగోడమీద నుండి ద్వారము లేని చోట చూసి ఎడమ పాదము మోపుతూ లంకలో కాలుపెట్టాడు మారుతి.
శత్రువుల శిరస్సుపైన కాలు ఉంచినట్లుగా ఉంచాడు ఎడమపాదాన్ని లంకానగరంలో!
రాత్రిపూట ప్రకాశమానంగా ఉన్న లంకానగర రాజవీధులలో తిరుగుతూ ఒక్కొక్క ఇల్లు పరిశీలనగా చూస్తున్నాడు హనుమ.
Also read: లంకిణితో హనుమ ఘర్షణ
వాస్తుశాస్త్ర సంప్రదాయాలు పాటిస్తూ వారి వారి స్థాయిని బట్టి అందంగా ఇళ్ళు నిర్మాణం చేయబడ్డాయి.
నాలుగు దిక్కుల నాలుగు ద్వారములున్న గృహము “సర్వతోభద్రము “దీనికి పద్మము అని ఇంకొక పేరున్నది.
పడమర వైపు ద్వారం లేకుండా వంకర తిరిగి ఉన్న చతుశ్శాలలు గల గృహము “హయాననము”
దక్షిణ ద్వారము లేని గృహము వర్ధమానము …ఇది సమృద్ధిగా ధనాన్ని ఇస్తుంది.
తూర్పుద్వారము లేనిది “స్వస్తిక” గృహము. ఇది పుత్ర, ధన సంపద నిస్తుంది.
Also read: సముద్రాన్ని లంఘించిన హనుమ
ముందుకు నడుస్తున్న కొద్దీ రకరకాల గృహాసముదాయాలు అందంగా అలంకరింపబడి వైభవ ప్రదర్శన చేస్తున్నట్లుగా ఉన్న అనేక గృహాలు చూశాడు హనుమ.
ఆ లంక కోలాహలంగా ఉంది
కొన్ని చోట్ల మదవతుల మధురగానాలు.
కొన్ని చోట్ల సుందరాంగుల కాలి అందెల చప్పుడులు.
కొన్ని చోట్ల కరకంకణాల కింకిణీధ్వనులు.
కొన్ని చోట్ల మల్లయోధుల జబ్బల చరుపులు. వారి సింహనాదాలు మారుతి చెవికి ఇంపుగా వినబడ్డాయి.
Also read: సరస నోటిలోదూరి బయటకు వచ్చిన హనుమ
వేదఘోష కొన్నిచోట్ల వినపడ్డది.
సైనికుల పదఘట్టనలు కొన్నిచోట్ల.
వందిమాగధుల స్తోత్రపాఠాలు కొన్నిచోట్ల హనుమంతుడికి వినపడ్డాయి.
శిరో ముండనము చేయించుకొన్నవారు కొందరు!
కేశఖండనము లేక జటలు ధరించినవారు మరికొందరు.
ఎద్దుచర్మము కట్టుకొన్నవారు కొందరు.
పీతాంబరధారులింకొందరు కనపడ్డారు.
Also read: దిగ్గున లేచి సముద్రంపైన ప్రయాణం ప్రారంభించిన హనుమ
కొందరు హోమము చేస్తుంటే మరికొందరు మారణహోమము సృష్టించే కూట, ముద్గర, దండ ..అనే ఆయుధాలు ధరించి తిరుగుతున్నారు.
కొందరు గూనివాళ్ళు, కొందరు వికారరూపులు, మరికొందరు సౌందర్యములో జయంతుడిలాంటి వారు రకరకాల వ్యక్తులు కనపడ్డారు హనుమంతునికి లంకానగరములో….అలా చూస్తూ సాగుతున్నాడాయన.
…
ఒక్కొక్కటే వివరంగా చూసుకుంటూ, పరిశీలిస్తూ, పరిశోధిస్తూ సాగుతున్నాడు వాయునందనుడు.
సుందర లంకానగరంలో చక్కటి వాతావరణం చల్లని వెన్నెలలో హాయిగా ఆహ్లాదకరంగా ఉంది.
వేలకొలదీ ఆవుల మధ్యలోని ఆంబోతులా ఠీవిగా ఒకసారి, ధగధగ మెరిసే వెండిపంజరంలో ఉన్న తెల్లటి హంస లా ఒకసారి! ఎత్తైన కొండమీద సమున్నతమైన శిలపై హుందాగా నిలుచున్న సింహంలా ఒకసారి.
.వీరత్వం ఉట్టిపడుతూ గర్వంగా ఏనుగుమీద ఊరేగే వీరుడిలా ఒకసారి. ఒక్కసారి తల ఎత్తి చూడగానే ఇన్ని విధాలుగా కనపడ్డాడు చంద్రుడు హనుమంతుడికి.
ఆ లంకలో!
నచ్చిన ఆహారము స్వీకరించేవారు కొందరు!
నెచ్చెలి పొందుకై తపించేవారు కొందరు!
ఇచ్చకాలు ఆడుకొనే జంటలు కొందరు!
ఒకరినొకరు మచ్చిక చేసుకొనే ప్రయత్నంలో ప్రేయసీప్రియులు మరి కొందరు!
రాగాలాపనలొకచోట
ఉన్మత్తప్రేలాపనలొకచోట
వీరాలాపనలొకచోట
వీణావాదము లొకచోట
జబ్బలు చరిచేవారు కొందరు
రొమ్ములు విరుచుకొంటూ దమ్ముచూపించేవారు కొందరు.
ఎందరో రాక్షసులు!
బుద్ధిజీవులను చూశాడు.
వివిధవిద్యలలో ప్రవీణులను చూశాడు.
వివిధ వృత్తులు చేపట్టిన వారిని చూశాడు.
వికృత వేషధారులనూ చూశాడు.
కొందరు స్త్రీల తళుకులు బంగరుకొండలను తలపిస్తున్నాయి.
కొందరి తావి సంపెంగదండలను మరిపిస్తున్నది.
జవ్వాజిభరిణలలాగ ఉన్న హరిణేక్షణలను చూశాడు ….
ఎందరినో ఎన్నో అవస్థలలో చూశాడు స్వామి …
కానీ సీతమ్మ కానరాలేదు!
Also read: లంక ప్రయాణానికి సిద్ధమైన హనుమ
వూటుకూరు జానకిరామారావు