Sunday, December 22, 2024

అంగదుడికి హనుమ మందలింపు

రామాయణమ్ 118

సుగ్రీవుడు ఇచ్చిన మాసము గడువు ఎప్పుడోఅయిపొయింది. పనిచేసుకుని రాకుండా ఇచ్చిన సమయముమీరి తిరిగివెళితే మరణ దండనకు గురికావలసి వస్తుంది.

అసలే సుగ్రీవుడు చండ శాసనుడు.

Also read: స్వయంప్రభ సందర్శనము

అంగదుడికి మరీ భయమెక్కువ అయ్యింది. తన తండ్రిని చంపించిన సుగ్రీవుడంటే అతనికి లోపల ఎంతో భయము. అది ఇప్పుడు బహిర్గతమయ్యింది. అందరూ దిగులుగా కూర్చొని ఉన్నారు. సీతాదేవి జాడ తెలియరాలేదు. సుగ్రీవుడిచ్చిన గడువు తీరిపోయింది.

వారందరినీ ఉద్దేశించి అంగదుడు ఇలా అంటున్నాడు, ” మనకు ఎలాగూ చావు తప్పదు. సుగ్రీవుడిచేతిలో చిత్రహింసలకు గురి అయ్యి చావడము కంటే  మనమందరమూ ఇక్కడే ప్రాయోపవేశము చేద్దాము. అసలే తీక్ష్ణ స్వభావి.ఆపై రాజు. ఇక ఆయనకు పట్టపగ్గాలుండవు. నన్ను యువరాజుగా ఆయన అభిషేకించలేదు. రామునికి భయపడి ఆపని చేశాడు. ఈ చిన్న తప్పు చాలు ఆయన నన్ను చంపివేయడానికి. ఈ కారణము చూపి శత్రు శేషము లేకుండా చేసుకుంటాడు. నేను పడే నరక యాతన కిష్కింధలో అందరూ చూచుట ఎందుకు? ఇచటనే ప్రాయోపవేశము చేయగలవాడను”  అని అన్నాడు.

Also read: హనుమపైనే అన్ని ఆశలు

యువరాజు మాటలు విని తక్కిన వానరులు దీనులై, “మనము అపరాధము చేసి ప్రభువు వద్దకు వెళ్ళుట మంచిది కాదు. మనకు మరణము తధ్యము. దానిని తప్పుకోనుటకు మార్గము ఆలోచించవలెను” అని పలుకగా హనుమంతుడు ఆ మాటలు విని ,” ఈ అంగదుడు సుగ్రీవునికి వ్యతిరేకముగా వానరులను పురికొల్పుతున్నాడు’’ అని తలచి ఆ వానరులలో వారిలో వారికి భేదము కల్పించి అంగదునితో, “యువరాజా  నీ వెంట వచ్చుటకు ఎవ్వరూ సిద్దముగా లేరు. నేను గానీ, ఈ జాంబవంతుడుగానీ, సుహోత్రుడుగానీ, నీలుడుగానీ నీతో వచ్చుటకు  సిద్దముగా లేము. మమ్ములను నీవు ఏ విధముగా కూడా సుగ్రీవుని నుండి  విడదీయ లేవు’’ అని స్పష్టముగా తెలియజేసెను.

బలవంతుడు దుర్బలునితో విరోధము చేసి ఒకచోట ఉండ వచ్చును, కానీ దుర్బలుడు బలవంతునితో విరోధము పెట్టుకోన్నచో తనను తాను రక్షించుకొనుట చాలాకష్టము. తారుడు చెప్పినట్లుగా నీవు మరల బిలములో దూరి బ్రతుక గలనని అనుకుంటున్నావేమో! లక్ష్మణుని వాడినారాచములకు ఆ బిలమును చీల్చి నీ ప్రాణములు తీయుట చాలా చిన్న పని. ఆకుదోప్పను బద్దలు కొట్టినట్లుగా బిలమును బద్దలు కొట్టగలవవి.

Also read: వానర వీరులకు దిశానిర్దేశం చేసిన సుగ్రీవుడు, హనుమకు తన గుర్తుగా ఉంగరం ఇచ్చిన రాముడు

నీవు బిలములో ప్రవేశించగానే ఈ వానరులందరూ నిన్ను విడిచి పెట్టగలరు వారికి భార్యా బిడ్డలన్న మక్కువ ఎక్కువ. ఎవరూ తోడులేక ఒంటరివాడవై ఆకు కదలికలకు కూడా గుండె దడ పుట్టుచూ చెట్టుపుట్టల పట్టుకొని తిరుగగలవాడవు.

‘‘నీవు మాతో కలసి ఉండి తిరిగి వెళ్లి వినయముగా సుగ్రీవుని సమీపించినచో నిన్ను రాజ్య సింహాసనము మీద ప్రతిష్టించగల ధర్మమూర్తి సుగ్రీవుడు. అతనికి  నీతల్లికి ప్రియము చేయవలెనను కోరిక ఎక్కువ. కావున నీకు హాని తలపెట్టడు. పైగాఅతనికి వేరొక సంతానము కూడా లేదు. కావున ఓయీ అంగదుడా! మనము తిరిగి వెళ్ళెదము’’ అని హనుమంతుడు దండోపాయమును, భేదోపాయమును చాలా సమర్దవంతముగా అంగదుని విషయములో మరియు అతని అనుచరుల విషయములో ప్రయోగించెను.

ఆయన మాటలు విన్న అంగదుడు, ‘‘సుగ్రీవునిలో పరిశుద్ధత్వము,ఋజుత్వము ఎండమావిలో నీరు వంటివి. అతడు అధర్మ వర్తనుడు. అన్న జీవించియుండగా ధర్మానుసారము తల్లి వంటిది అయిన వదిన గారిని పట్టమహిషిగా స్వీకరించాడు. నా తండ్రి దుందుభి తో యుద్ధము చేయుచూ బిలద్వారమున ఈయనను కాపు ఉంచినది దేనికి? ఒక వేళ దుందుభి బయటకు వచ్చినచో ఈయన అతనితో యుద్ధము చేయ వలననే కదా? మరి అలాంటిది అచటనుండి తొలగిపోయినవాడు ఎట్లు ధర్మము తెలిసిన వాడగును?  కామముతో కళ్ళు మూసుకొని పోయి ఉపకారము చేసిన రాముని కూడా ఎవరు మరచి పోయినారో అతడు ధర్మమూర్తి ఎట్లగును?

Also read: ఆకాశం నుంచి రాముడి ఎదుట దిగిన వానర సైన్యం

అతడు లక్ష్మణ క్రోధాగ్నికి భయపడి మనలను సీతాన్వేషణకు పంపెను కానీ నిజముగా ఆయనకు ఆ ఉద్దేశ్యము లేదు. శఠుడు, క్రూరుడు అయిన అతను  నన్ను రహస్యముగా బంధించి చంపివేయును. కావున మీరంతా నా యందు దయ ఉంచి ప్రాయోపవేశమునకు నాకు అనుమతినిండు. నేను కిష్కింధకు వచ్చి హీనమైన చావు చావదలుచుకోలేదు’’ అని పలికి భూమిపై దర్భలు పరచుకొని అంగదుడు శయనించెను

NB

ఇక్కడ హనుమంతుని స్వామి భక్తి, అంగదుడి వైరము స్పష్టముగా కనపడతాయి మనకు.

అంగదుడిని పూర్తిగా చదివేశాడు హనుమ. అతనిలో ఎనిమిది అంగములు గల బుద్ది, నాలుగు బలములు, పద్నాలుగు గుణములు ఉన్నాయని అర్ధము చేసుకున్నాడు. వానరులలో నెమ్మదిగా సుగ్రీవుడి మీద వ్యతిరేకత పెంచుతున్నాడని గ్రహించాడు. దానిని ఆదిలోనే తుంచి వేశాడు.

.

బుద్ది యొక్క ఎనిమిది అంగములు ఇవి …. శుశ్రూష, వినుట, గ్రహించుట, ధారణము, ఊహ, అపోహ, విషయజ్ఞానము, యధార్ధజ్ఞానము ,…..ఇన్ని రకాలుగా బుద్ది ఉంటుంది.

నాలుగు బలములు ఇవి:

సామ దాన భేద దందోపాయముల వలన కలిగిన బలములు. లేదా, బాహుబల, మనోబల, ఉపాయబల, బంధుబలములు.

Also read: రామునికి సుగ్రీవుని పాదాభివందనం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles