రామాయణమ్ – 124
‘‘లోకపావనీ సీతాదేవిని వెదుకగ పావని బయలుదేరినాడు. పరుగుపరుగున అతనికి ఎదురేగి నీ శిఖరములపై కాసేపు విశ్రమించునట్లు ఆయనను వేడుకొనుము.
ఇక్ష్వాకుల కార్యార్ధియై ఆయన ప్రయాణిస్తున్నాడు. ఆ ఇక్ష్వాకులు నాకు ఆప్తులు. కాన ఓ మైనాకమా త్వరగా లేచి ఆయనకు ఆతిధ్యమిమ్ము’’ అని సముద్రుడు ప్రేరేపింపగా, మైనాకుడు సముద్రమునుండి మెల్లగ తన బంగరు శిఖరాలను సముద్ర తలము పైన ఉన్నతముగా కనపడునట్లుగా పెంచినాడు.
Also read:దిగ్గున లేచి సముద్రంపైన ప్రయాణం ప్రారంభించిన హనుమ
‘ఏమిది? ఇప్పటి వరకు నా దృష్టిపథములో లేనిది ఇప్పుడు ఎక్కడనుండి పుట్టుకొచ్చినది. ఇది ఏదో విఘ్నము కాబోలు’ అని శిఖరములు తొలగచేయుటకు గాను తన ఎదురు రొమ్ముతో తాడించినాడు పవనపుత్ర హనుమంతుడు. ఆ తాడనముయొక్క వేగమునకు తల్లడిల్లిన మైనాకుడు ఆ బలమును చూసి సంతసించినాడు.
‘‘ఓ హనుమా, నీ తండ్రి నాకు ఆప్తుడు. నీవు వెళ్ళునది చాలాదూరము. ఇప్పటికే ఎంతోదూరము పయనించినావు. అలసట తీరువరకు నాపై కాసేపు విశ్రమించవయ్యా’’ అని అడిగిన మైనాకుని మాటలకు సంతసించి హనుమంతుడు ‘‘ఇప్పుడు కాదులే. నేను అతిముఖ్యమైన కార్యము మీద వెళ్ళుచున్నాను. మధ్యలో ఎక్కడా ఆగనని ప్రతిజ్ఞ చేసినాను. చల్లని నీ మాటలే నాకు ఆతిథ్యము. ఇంతకన్నా వేరే ఎందులకు?’’ అని వినయముగా పలికి దూసుకుపోయాడు హనుమ అనే రామబాణము ( రామబాణము ఎక్కడా ఆగదు కదా!).
Also read: లంక ప్రయాణానికి సిద్ధమైన హనుమ
హనుమంతుడి ఆ రెండవ కార్యమును చూసి దేవతలు, సిద్ధులు, మహర్షులు అందరూ ప్రశంసించిరి.
…
‘అడుగో అక్కడ రామబాణంలాగా దూసుకుపోతున్నాడే అతడే హనుమ. రామకార్యార్ధియై రావణలంకకు బయలుదేరాడు. అది క్రూర రాక్షసుల నిలయము. శత్రుదుర్నిరీక్షుడైన రావణాసురుని పట్టణము. అతని బుద్ధి, బలము నీవు పరీక్షింపవలే’ అని నాగమాతయైన సురసను పిలిచి హనుమను పరీక్షించే కార్యము అప్పగించినారు దేవతలు….
(సు – మంచి, రస — ఆనందమునిచ్చునది).
ఆవిడ వెంటనే కార్య రంగములోనికి దూకినది. రూపము మార్చి భయంకరమైన రాక్షసి రూపం ధరించింది.
ఆకాశంలో రామధనుర్విముక్తశరములాగా దూసుకుపోతున్నాడు హనుమ. సరిగ్గా సముద్రమధ్యములో ఉన్నాడు.
అప్పుడు !
‘‘ఓరోరీ వానరా, నన్ను తప్పించుకొని ఎచటకురా నీ పయనం? ఈ పూటకు నీవే నా ఆహారం’’ అంటూ సురస చేసిన వికృత వికటాట్టహాసం హనుమ చెవిని చేరింది. అటుఇటు చూశాడు.
ఆయనకు వికృత వేషధారిణి అయిన సురస కనిపించింది.
Also read: హనుమ పుట్టుపూర్వోత్తరాలు వెల్లడించిన జాంబవంతుడు
‘‘ఓరీ! బ్రహ్మదేవుడు నిన్ను నాకు ఆహారముగా ఇచ్చినాడురా. ఆయన వరమును కాదని నీవెచ్చటికీ వెళ్ళలేవు. అక్కడే ఆగు. నిన్ను మ్రింగి వేస్తాను’’ అని గర్జించింది సురస!
ఆమెకు చేతులు జోడించి నమస్కరిస్తూ, ‘‘అమ్మా, నేను రామకార్యార్ధినై లంకకు వెళుతున్నాను. ఇది రాముని రాజ్యము. నీవు కూడా రామరాజ్యనివాసివేగాన ఆయనకు నీవు కూడా సహాయము చేయవలెను. నీకు అట్లు అంగీకారము కాని ఎడల సీతాదేవి జాడ రామునికి తెలిపి ఆ పిదప నీకు ఆహారముగా మరల వత్తును. ఇప్పటికి నన్ను పోనిమ్ము’’ అని ప్రార్ధించాడు హనుమ.
ప్రార్ధించి ముందుకు సాగబోయేసరికి ఆయన గమనానికి అడ్డు తగిలి ‘నీవు నా ముఖమునందు ప్రవేశించనిదే వెళ్ళలేవు’ అని పలుకుతూ ఆయనను మ్రింగటానికి తన నోరు తెరిచింది.
తన మాటలు ఆలకించక అడ్డు తగిలి నోరు తెరిచిన సురసను చూసి కోపించి ‘సరే ఎంత పెద్దగా నీ నోరు చాపెదవో నేనూ చూచెదను. ఇక చాపు.’
Also read: సంపాతి వృత్తాంతం
అని పదియోజనముల పొడవు అంతే వెడల్పు గా తన దేహాన్ని పెంచాడు. అప్పుడు సురస తన నోరు ఇరువది యోజనములు వెడల్పు యుండునట్లు చేసింది. అప్పుడు స్వామి తన దేహాన్ని ముప్పది యోజనములు పెంచగా నాగమాత తన ముఖము నలుబది యోజనములు తెరిచింది. ఒకరికొకరు పోటీలు పడి ఒకరు శరీరాన్ని ఇంకొకరు నోటినీ పెంచుకుంటూ పోసాగారు. ఇంతలో చటుక్కున తన దేహ పరిమాణాన్ని అంగుష్ఠమాత్రము చేసి మెరుపువంటి వేగముతో ఆవిడ నోటిలో దూరి బయటకు వచ్చాడు హనుమ.
‘‘దాక్షాయణీ, నీకు నమస్కారము. నీ వరము ఇప్పడు సత్యమైనది కదా! ఇప్పుడిక సెలవిమ్ము. సీతాదేవిని వెదుకగా పోయి రావలె’’ అని అంటున్న హనుమను చూసి తన నిజరూపము ధరించి ‘‘నాయనా, విజయోస్తు వెళ్ళిరా’’ అని దీవించింది సురస!
ఇతరులెవ్వరూ చేయజాలని ఈ మూడవ కార్యమును చూసి దేవతలు బాగున్నది, బాగున్నది అని ప్రశంసించినారు.
Also read: వానరులకు సీతమ్మ జాడ చెప్పిన సంపాతి
వూటుకూరు జానకిరామారావు