కిష్కింధకాండ సమాప్తం, సుందరకాండ ప్రారంభం
రామాయణమ్ – 122
‘‘ఆ విధముగా వజ్రాయుధపు దెబ్బకు నీవు మూర్ఛితుడవు అగుట చూసిన వాయుదేవుడు కృద్ధుడై ముల్లోకములలోనూ తన సంచారము నిలిపివేసెను. వాయువు స్తంభించుటచే మూడులోకములు అల్లలాడిపోయినవి. లోకుల క్షోభ చూసి దేవతలు వాయుదేవుని ప్రార్ధించిరి.
Also read: హనుమ పుట్టుపూర్వోత్తరాలు వెల్లడించిన జాంబవంతుడు
‘‘దేవతలు అందరూ నీకు ఎన్నో వరములనొసగిరి. బ్రహ్మదేవుడు నీకు శస్త్రాస్త్రములచేత చావు లేకుండా అనుగ్రహించెను. దేవేంద్రుడు నీకు స్వచ్ఛందమరణమును ప్రసాదించెను. నీవు కేసరికి క్షేత్రజపుత్రుడవు (ఆయన భార్యకు పుట్టిన వాడవు ) వాయుదేవునకు ఔరస(సాక్షాత్తు)పుత్రుడవు.
‘‘నాయనా నీ సామర్ధ్యము ఏమని చెప్పను! ఇప్పుడు మా ప్రాణములు పోవు స్థితి దాపురించినది. నీవే మమ్ము రక్షించవలెను. శతయోజన విస్తీర్ణముగల సముద్ర లంఘనము నీ వలననే సాధ్యము. నీవే మాకు దిక్కు!’’
జాంబవంతుని మాటలు విని పర్వదినములలో సముద్రము పొంగినట్లు హనుమంతుడు తన కాయము పెంచెను.
Also read: సంపాతి వృత్తాంతం
తేజస్సుతో కూడిన ఆయన ఆకారము అత్యద్భుతముగా నుండెను. వేటాడు సింహము ఎట్లు విజృంభించునో ఆంజనేయుడు అటుల విజృంభించెను.
‘‘వానర వీరులారా, మహామేరువుతో సమాన దేహము కల నేను ఆకాశమును ఆవరించి మ్రింగి వేయువిధముగా ఎగురుచున్నప్పుడు సావధానముగా చూడగలరు. నా గమనమును అనుసరించగలవారు ఆ గరుత్మంతుడు, వాయుదేవుడు మాత్రమే. నేను మీకు ఇదే చెపుతున్నాను- నేను సీతాదేవిని చూడగలను!’’
హనుమంతుని ఉత్సాహము చూసి జాంబవంతుడు ఆయనను
‘‘ఓ కేసరిపుత్రుడా!
ఓ వేగవంతుడా!
ఓ హనుమంతుడా !
మా దుఃఖము బాపుమయ్యా
అనుచూ స్తుతించెను.
Also read: వానరులకు సీతమ్మ జాడ చెప్పిన సంపాతి
మహేంద్రసమ పరాక్రముడైన ఆ వాయునందనుడు తను గమన వేగమును అందుకొనుటకు మహేంద్ర పర్వతము అనువైనదిగా తలచి ఆ పర్వత శిఖరమును అధిరోహించెను.
ఆయన శరీరము మహేంద్ర గిరిపై ఉన్ననూ ఆయన మనస్సు మాత్రము అప్పుడే లంకా నగరికి చేరెను.
(కిష్కింధాకాండము సమాప్తము)
…
తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్శనః ఇయేష పదమన్వేష్టుం చారణా చరితే పథి
అటుపిమ్మట రావణునిచే తీసుకు వెళ్ళబడిన సీతమ్మతల్లి యొక్క స్థానమును వెదుకుటకు శత్రువులను కృశింపచేయువాడు చారణులు అను వారు సంచరించే ఆకాశమార్గమున బయలు దేరెను.
Also read: అంగదుడికి హనుమ మందలింపు
NB.
సుందరకాండ లో మొదటి సర్గలోని ప్రారంభశ్లోకమది.
ఆ శ్లోకానికి పైన చెప్పినది మామూలు అర్ధము.
గుంటూరు శేషేంద్ర శర్మగారు చెప్పిన అర్ధము….
కుండలినీ శక్తికి”చరణం” అను పర్యాయపదము ఉన్నది.
.
ఈ చరణ శబ్దము పై శ్లోకములో చారణ అయినది.
“చారణాచరితేపథి” అనగా కుండలిని చేత అంతటా సంచరింపబడు మార్గము అని అర్థము.
.
మూలాధారమునుండి బయలుదేరిన కుండలినీ శక్తి సుషుమ్నా నాడిని ప్రవేశించి క్రమముగా స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రములను దాటుచూ సహస్రారమును చేరి అందు శివైక్యము చెందును. సంక్షిప్తముగా ఇది కుండలినీ యోగము.
చారణా చరిత పథము అనగా ఈ ఆరు చక్రముల మార్గము.
పై శ్లోకములో హనుమ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు.
శత్రుకర్శనుడు అని మహర్షి వాల్మీకి వ్రాశారు. అనగా శత్రువులను పీడింపచేయువాడు అని అర్ధము!
ఏ శత్రువులు? ..
అరిషడ్వర్గములు …
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు ….వీటిని పీడింపచేయువాడు అనగా జితేంద్రియుడు అని అర్ధము.
మరి ఎవరు జితేంద్రియుడైన ఆ సాధకుడు? అంటే హనుమంతుడు అని జవాబు వస్తుంది.
అనగా హనుమంతుడు యోగి అనియు, సీతమ్మతల్లి కుండలినీ శక్తి అనియూ, హనుమంతుడు కుండలినీ యోగమును అనుష్ఠింపబోవుచున్నాడనియూ …నాందీ ప్రస్తావన …పై శ్లోకము చేసింది.
ఇక సౌందర్యము అంటే అమ్మే! ఆ తల్లే!
ఆమె సౌందర్యనిధి! అందుకే ఇది సుందరకాండ!
సాధకుడైన హనుమ అమ్మను అనగా శ్రీదేవి అయిన సీతమ్మను శ్రీం అను బీజాక్షరముతో గుర్తించునట్లు ఒక శ్లోకమున్నది.
సుందరకాండలోకి ప్రవేశిద్దాం!
Also read: స్వయంప్రభ సందర్శనము
వూటుకూరు జానకిరామారావు