రామాయణమ్ – 142
మహాబాహువు, మహా ఉరస్కుడు, కంబుగ్రీవుడు(శంఖాకారపు కంఠము). దుందుభి ధ్వని ఆయన కంఠధ్వని, శ్యామసుందరుడు, వక్షస్థలము, ముంజేయి, పిడికిలి ఈ మూడూ స్థిరముగా ఉంటాయి! కనుకొనలు, గోళ్ళు, అరచేతులు, అరికాళ్ళు ఎర్రన…ఎనిమిది అడుగులు ఎత్తుకలవాడు. ఆయన సింగము వలె, పెద్దపులివలే, ఏనుగువలే, వృషభేశ్వరుని వలే ఠీవిగా నడుచును. ఆయన పెదవులు, గడ్డము, ముక్కు వీటి అందము వర్ణనాతీతము.. ఆయన బాహువులు, వ్రేళ్ళు, పిక్కలు తీర్చిదిద్దినట్లుగా యుండును. ఆయన పొట్టపై మూడు ముడతలున్నవి. తలపై మూడు సుళ్ళు ఉన్నవి.
Also read: రాముడి గుణగణాలను వర్ణించిన హనుమ
తేజస్సు, కీర్తి, సంపద ఈ మూడింటి చేత లోకములందంతటా వ్యాపించినాడు సకలశుభలక్షణ శోభితుడు. శత్రుభీకరుడు. పరసుందరీ పరాజ్ఞ్నముఖుడు..
అన్నవలెనే అన్ని శుభలక్షణాలు కలిగియున్నవాడు లక్ష్మణుడు… అన్న శ్యామమోహనుడు. తమ్ముడు సువర్ణవర్ణుడు.
అని ఇంకా చెప్పసాగెను హనుమస్వామి.
Also read: సీతమ్మతో హనుమ సంభాషణ
(ఏకనాధరామాయణంలో రాముడిని ఇలా వర్ణించారు…
జీవ శివులనే అధరములుగా కలవాడు. నుదుటి మీద సత్, చిత్, ఆనందము అనే మూడు రేఖలున్నాయట. శంఖాకారముతో ఉండే కంఠమే ఓంకారము. భక్తి, భావార్ధమనే మొలనూలు కట్టికొన్నాడు. నిత్యమైన శబ్దబ్రహ్మం మన నోటితో ఉచ్చరించి, చెవులతో వినే లౌకిక శబ్దంగా పరిణమించడంలో నాలుగుదశలు చెప్పారు. అవి 1.పరా, 2. పశ్యంతీ, 3.మధ్యమా, 4. వైఖరీ. వీటిని …ఆయన పాదాలకున్న కడియాలు నాల్గు మణులతో పోల్చాడు…వాటి నాదమే పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ..అట.)
అమ్మా, నీవు కనపడక, నిన్ను వెతుకుతూ పురుషసింహాలు అయిన రామలక్ష్మణులు ఇద్దరూ ఋష్యమూక పర్వతప్రాంతం చేరుకున్నారు. అక్కడ వారికి వానర శ్రేష్ఠుడు సుగ్రీవునితో స్నేహము కుదిరింది. నీవు రావణునిచే కొనిపోబడుతున్నప్పుడు జారవిడిచిన నగల మూట భద్రముగా రామచంద్రునకు చూపితిమమ్మా!
Also read: సీతమ్మ కంటబడిన హనుమ
అవి చూసిన రాముడు వాటిని తన ఒడిలో ఉంచుకొని పరిపరివిధములుగా విలపించినాడు. మాటిమాటికి వాటివంకే చూస్తూ కన్నీరు పెట్టుకున్నాడు తల్లీ!
పూజ్యురాలా! నీవు కనపడక నిత్యమూ ప్రజ్వరిల్లే అగ్నిపర్వతము వలే ఉన్నాడు.
అందాలు చిందే వనపర్వత శ్రేణులు, కంటికి విందు చేసే పక్షితతులు, తరులు, విరులు, గిరులు ఏవీ కూడా ఆయనను సంతోషపెట్టలేక పోతున్నాయి ఆనందమన్న ఏమో రాముడు మరచి చాలా కాలమయినది తల్లీ!
ఆయన డెందము నీవు
ఆయన ఆనందము నీవు
ఆయన జీవన మకరందము నీవు!
నీవు లేక ఆయనకు సుఖమెక్కడిది తల్లీ!
అంత బాధలో ఉన్నప్పటికీ స్నేహధర్మము ననుసరించి రాముడు సుగ్రీవుని కొరకు ఆతని అన్నయైన వాలిని సంహరించి రాజ్యమును, ఆతని భార్యను తిరిగి అతనికి సమకూర్చి పెట్టెను.
Also read: రాక్షస స్త్రీల మానసిక హింస, త్రిజట కల
సుగ్రీవుడు నిన్ను వెదుకు నిమిత్తమై భూమండలమందు అణువణువు గాలించ సమర్ధులైన వానర వీరులను సమస్తదిక్కులకు పంపి ఒక నెల గడువొసంగెను.
యువరాజు అంగదుడి నాయకత్వాన మా జట్టు దక్షిణ దిక్కునకు బయలుదేరినది….
Also read: సీతను దారికి తేవాలని రాక్షసస్త్రీలను ఆదేశించిన రావణుడు
వూటుకూరు జానకిరామారావు