రామాయణమ్ – 151
అటూ ఇటూ చూశాడు మహాబలి
ఎనభైవేల మంది రావణకింకరులు హనుమను బంధించాలన్న సమరోత్సాహంతో వచ్చారు.
చూశాడు వారిని హనుమ. ఒక పెద్ద పరిఘ కోటగోడల కున్నది ఊడబీకాడు. అది పట్టుకొని గగనానికి రయ్యిన ఎగిరాడు. శూల, ముద్గర ధారులై ఆయన వెంట ఎగిరారు కింకరులు. గిర్రున పరిఘను తిప్పి అందరినీ చావ మోదాడు స్వామి. పిట్టలు రాసినట్లు రాలి నేలపై వారంతా పడిపోయారు. అంతే. అంతా క్షణాల్లో జరిగిపోయింది.
Also read: హనుమపై రాక్షసమూక దాడి
చావగా మిగిలిన వాడు ఒకడు బ్రతుకు జీవుడా అంటూ రావణ సముఖానికి వెళ్ళి నివేదించాడు. వెళ్ళిన వారు వెళ్ళినట్లు అటునుంచి అటే యమపురికి పయనమై పోయిన వైనాన్ని రావణుడు విన్నాడు.
కనుల వెంట నిప్పుకణాలు రాలుతున్నాయి రావణునకు!
ప్రహస్త కుమారుడు జంబుమాలిని ఆజ్ఞాపించి హనుమపైకి పంపాడు.
వాడు వస్తూవస్తూనే నిశిత శరాలు హనుమ పైకి గుప్పించి వేశాడు.
బాణానికి బాణానికి మధ్య చిత్రవిచిత్ర రీతులలో రయ్యిన దూసుకుంటూ వెళుతూ దెబ్బలు తగలకుండా కాసుకుంటూ తిరుగుతున్న స్వామిపైకి గురిచూసి కొట్టాడు ప్రహస్తుడు.
ఆ బాణపుదెబ్బకు మారుతి ముఖము నుండి రక్తము చిమ్మి విరిసిన ఎర్రతామరవలే చూపరులకు కనపడింది.
Also read: విధ్వంసమైన అశోకవనం, భీతిల్లిన రాక్షసగణం
విపరీతమైన కోపముతో అతివేగముగా మరియొక పరిఘను ఊడబెరికి గిర్రున తిప్పి విసరగా మరుక్షణములో జంబుమాలి లేడు. వాని గుర్రములు లేవు. వాని రధములేదు …… ఒకపెద్ద మాంసపు ముద్ద పేరుకొని …నేలపై అతుక్కొని కనబడెను…
మరల మరల జయఘోషలు చేయుచూ, సింహగర్జనలు చేసుకుంటూ ఇంకా ఎవరు వస్తారా అని నిరీక్షిస్తూ కోట గోడపై కూర్చుని జబ్బలు చరువసాగాడు అంజనాసుతుడు మహాబలి ఆంజనేయుడు.
………………..
రావణుడు కోపోద్రిక్తుడైనాడు. కన్నులు. వెంటనే ప్రక్కనే వున్న ఏడుగురు మంత్రికుమారులను ఆదేశించాడు.
ఎలాగైనా ఆ వానరుని పీచమడచమని.
Also read: అశోకవన విధ్వసం ప్రారంభించిన హనుమ
యవ్వన గర్వముతో మహా ఉత్సాహముగా బయలుదేరిన వారిని చూసి వారి తల్లులు కంటనీరు పెట్టుకున్నారు ఇక అవే తమ పిల్లలను చూసే ఆఖరి చూపులని.
వారు వెళ్ళడము, వెంటనే వార్త తిరిగి రావడము జరిగినది వారు ఘోరమైన మరణము పాలైనారని.
అప్పటికి మనస్సులో దిగులు పుట్టింది రావణునికి. వీడెవడో మహా భూతము వలె ఉన్నాడు.
నాకు మైంద, ద్వివిద, నల, నీల, సుగ్రీవ, వాలి లాంటి వానర యోధులు తెలుసు కాని వారెవరికీ తమ కాయాన్నిఇంత భయంకరముగా కావలసిన విధముగా పెంచి ఉపసంహరించే శక్తులు లేవు.
నిశ్చయముగా వీడెవడో మన శత్రువులు సృష్టించిన భూతమై ఉంటాడు కాబట్టి వీడితో జాగ్రత్త సుమా అని తను పంపే సేనానాయకులు ఐదుగురినీ హెచ్చరించి మరీ పంపాడు.
పంపినంత సేపు పట్టలేదు వారు శవాలై తిరిగి రావడానికి.
ఇక లాభము లేదనుకొన్నాడు లంకాధీశుడు. తన కుమారుడైన అక్షునికేసి తనకన్నులు తిప్పాడు.
తండ్రి కనుసైగలు చూసి ఒక్కసారిగా భగ్గుమని లేచే అగ్నిజ్వాలలాగా పైకి లేచాడు.
ఉత్తమమైన గుర్రములు ఎనిమిది పూన్చబడి యుండి స్వర్ణశోభితమైన రధాన్ని ఎక్కి బయలుదేరాడు ఆ మహా వానరాన్ని ఎదుర్కొనడానికి.
Also read: సీతమ్మను ఓదార్చిన హనుమ
వూటుకూరు జానకిరామారావు