రామాయణమ్ – 147
‘‘నేనూ, రాఘవుడూ మందాకినిలో జలక్రీడలాడి హాయిగా విహరించి ఒక చోట విశ్రాంతి తీసుకొంటున్నాము. అప్పుడు ఒక కాకి నా వద్దకు వచ్చి నన్ను పొడవటానికి ప్రయత్నించటము నేను దానిని ఒక మట్టిపెళ్ళతీసుకొని దూరముగా తరమటము జరిగినది. అది మాటిమాటికి అలా వస్తూ ఉండగా తరమటము నా వంతు అయినది. నా అవస్థ చూసి రాఘవుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ నన్ను కవ్వించటమూ నేను ఉడుక్కొనుటమూ ఒక వేడుకగా కొంత సమయము సాగినది.
అలసిన నేను రాఘవుని ఒడిలో తల ఉంచుకొని నిదురపోయి సేదతీరినాను. నేను మేలుకొన్నపిమ్మట రామచంద్రుడు నా ఒడిలో నిదురించసాగాడు. గాఢనిద్రలో ఉన్నరాముని చూస్తూ అలాగే కాలం గడుపుతున్న నాకు హఠాత్తుగా నా వక్షస్థలము మీద ఎవరో పొడిచినట్లయి చూడగా అది ఇంతకు మునుపు నేను తరిమిన కాకి.
Also read: రాముని ససైన్యముగా తోడ్కొని రమ్ము, హనుమకు సీతమ్మ పురమాయింపు
మాంసము మీద ఆసక్తితో అది నన్ను ముక్కుతో వక్షోభాగము మీద పొడవసాగింది. రాఘవుడికి నిద్రాభంగము కలిగించుట ఇష్టములేని నేను ఆ బాధను అలాగే భరించసాగాను. కానీ దాని ఆగడము మితిమీరిపోయి నాకు తీవ్రమైన గాయము చేయగా రుధిరధార వెచ్చగా రాముని ఫాలభాగము మీద పడి ఆయనకు నిద్రాభంగము కలిగించినది. మేలుకున్న రాముడు నాకు అయినగాయము, కారుతున్న రక్తము చూసి క్రోధముతో రుద్రుడైనాడు.
‘‘ఎవడు రా వాడు? నా సీతకు గాయము చేసి, అయిదు తలల మహానాగునితో ఆటలాడ సంకల్పించినవాడు? అని అటునిటు చూడగా ఈ ఆకతాయి కాకి కనపడినది. వాడు ఇంద్రుడి కొడుకట!
‘‘ఆ కాకిని శిక్షించవలెనని సంకల్పించిన రామచంద్రుడు ప్రక్కనున్న దర్భను తీసి బ్రహ్మాస్త్రమును అభిమంత్రించి దాని పైకి ప్రయోగించినాడు. బ్రహ్మస్త్రమైన ఆ దర్భ వాని ప్రాణములు తీయుటకు గాను వానిని వెంబడించింది. ఆ కాకి ముల్లోకములు తిరిగి రక్షించువాడు కానరాక మరల రామునే శరణుజొచ్చినది.
Also read: హనుమ సూచనను సున్నితంగా తిరస్కరించిన సీతమ్మ
‘‘శరణాగత రక్షకుడు, కరుణార్ద్రహృదయుడు అయిన ఆ దాశరధి బ్రహ్మాస్త్రము వ్యర్ధము కారాదు కావున ఆ కాకి కన్ను మాత్రము పెకిలించి వేసి దానికి ప్రాణభిక్ష పెట్టెను. అది రామునకు ప్రణమిల్లి బ్రతుకుజీవుడా అంటూ తన తావునకు ఎగిరి పోయెను…..అంటూ సీతమ్మ, హనుమంతునకు తమ కధ చెప్పి….ఇంకా….
‘‘ఓ రామా ! నాకు ఒక చిన్నగాయము అయినందుకే అంతకోపించి కాకిమీదనే బ్రహ్మాస్త్రము ప్రయోగించినావు కదా! ఏల ఇపుడు నన్ను అపహరించుకుపోయిన వాని మీద అంత దయ. ఇప్పటికే నీవు వచ్చి వానిని కడతేర్చినన్ను తీసుకొని పోవలసినది కాదా? సర్వలోక నాధుడవైన నీవు నా ప్రాణనాధుడవయి ఉండి కూడా అనాధలాగ అయిపోతినికదా!
‘‘సర్వశ్రేష్ఠ ధనుర్ధారివే! సకలశస్త్రాస్త్ర పారంగతుడవే! భండన భీముడవే. ఏల ఈ ఉపేక్ష? రాక్షసులమీద ఇంత దయ? నీ అస్త్రములు సకల దుష్టరాక్షస సంహార కారకములు. నీ ధనుష్ఠంకారమే వారి గుండెలు బద్దలు చేయునుకదా. ఏల రావు? నీవేల రావు? ఆ రామానుజుడైనా అన్నగారి ఆజ్ఞతీసుకొని నన్ను రక్షించుటకు రాడేమి?
Also read: రామలక్ష్మణుల యోగక్షేమములు అడిగి తెలుసుకున్న సీత
‘‘లేదు, లేదు. నేనే ఏదో పాపము చేసియున్నాను. సందేహము లేదు’’ సీతమ్మ కన్నీరు కాల్వలై ప్రవహిస్తూ దీనముగా మాట్లాడటము చూసిన హనుమ ,….
‘‘అమ్మా, రాముని స్థితి నీ స్థితి ఒకటేనమ్మా! సత్యము మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను రాముడు ఏ భోగము అనుభవించుటలేదు.
ఎప్పుడూ ఆయనకు నీపైనే ధ్యాస. నీ పేరే ఆయన శ్వాస. ఆయన హృదయము కరిగి కన్నీరై ఏరులై పారుచూ కడు దయనీయమైన స్థితిలో నిన్నేపలవరించుచున్నాడు. ఆయన పరిస్థితి చూసి లక్ష్మణస్వామి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడమ్మా!
ఓ అమ్మా, దోషరహితా! నా భాగ్య వశమున నీవు నా కంట బడితివి. ఇక విలపించవలదమ్మా. అన్ని కష్టములు అతి త్వరలో కడ తేరగలవు…..
Also read: రాముడిచ్చిన అంగుళీయకము సీతమ్మకు సమర్పించిన హనుమ
వూటుకూరు జానకిరామారావు