రామాయణమ్ – 143
మేమందరము పలు విధాలుగా వెతుకుతూ దారితప్పి వింధ్యపర్వతము వద్దకు చేరగా పలు దినములు గడచిపోయినవి.
కార్యసాధనలో విఫలురమయినామన్న బాధ ఒక ప్రక్క, మరొకప్రక్క గడువుదాటిన పిమ్మట తిరిగి వెళ్ళినచో సుగ్రీవుడు విధించు కఠినదండన మా మనస్సును నిలకడగా ఉండనీయక వేధింప ప్రారంభించినవి.
వేరే దారి ఏదీ కనపడక ప్రాణత్యాగమే శరణ్యమని నిశ్చయించుకొని ప్రాయోపవేశమునకు సిద్ధపడుతూ నిన్ను అపహరించినదాదిగా జరిగిన సంఘటనలను మాలో మేము ఏకరువు పెట్టుకొనుచుంటిమి. ప్రసంగ వశమున జటాయువు ప్రస్తావన రాగా అది విని ఒక గొప్ప ముదుసలి గృధ్రరాజు అటకు ఏతెంచెను.
Also read: సుగ్రీవాజ్ఞ గురించి సీతకు చెప్పిన హనుమ
ఆయన ఎవరో కాదు జటాయువు సోదరుడు సంపాతి.
ఆవేశముగా మమ్ము ప్రశ్నించాడు సంపాతి. నా తమ్ముడిని ఎవ్వరు ఎక్కడ చంపి వేసినారు? ఏ కారణము వలన అట్లు జరిగినదని మమ్ము ప్రశ్నించగా మేము ఆయనకు జరిగిన విషయమును ఎరుక పరచితిమి.
అంత సంపాతి నీ యొక్క జాడను మాకు తెలియ చెప్పెను. నీవు బందీవై రావణుని గృహములో ఉన్నావని చెప్పినాడు. తన దృష్టికి నీవు కనపడినావని కూడా మాకు తెలిపినాడు.
నీ జాడ తెలిసిన మాకు పోయిన ప్రాణములు తిరిగివచ్చినట్లాయెను.
నీ జాడ కనుగొనుట కొరకు నేను నూరుయోజనముల పొడవు గల సముద్రమును లంఘించి దుమికి లంకా పురి చేరినాను.
Also read: రాముడి గుణగణాలను వర్ణించిన హనుమ
రావణలంకలో రాత్రిపూట ప్రవేశించి అంతటా వెతుకుతూ ఇచటికి చేరి దుఃఖసాగరములో మునిగియున్న నిన్ను కనుగొన్నాను తల్లీ!
ఓ పరమపావనీ!
ఓ దోషరహితా!
ఓ పుణ్యచరితా!
సీతామాతా!
అన్నివిషయములు నీకు ఎరుక పరచితినమ్మా!
Also read: సీతమ్మతో హనుమ సంభాషణ
నేను రావణుడను కాను. రామునిబంటును హనుమంతుడు నాపేరు.
కేసరీ, అంజనాదేవి నా తల్లితండ్రులు. వారికి వాయుదేవుని వరప్రసాదము వలన నేను జన్మించితిని.
నా ఇష్టము వచ్చిన రూపములు ధరించగల శక్తి నాకున్నదమ్మా!
అమ్మా, నా అదృష్టము బాగున్నది. సముద్రలంఘనము వ్యర్ధము కాలేదు.
Also read: సీతమ్మ కంటబడిన హనుమ
నిన్ను కనుగొంటినన్న కీర్తిపొందగలవాడను.
ఈ విధముగా మాటలాడిన హనుమ పలుకులను విశ్వసించి ఆతడు శ్రీరామదూతయే అని సీతమ్మ తెలుసుకొన్నదాయెను.
…
ఆనందము ఆర్ణవమై, రాహువు విడిచిన చంద్రబింబమువలే సీతమ్మ ముఖము ప్రకాశించసాగింది.
ఆమెకు నమ్మకము కలిగింది,
ఆతడు రాముని దూతయేనని,
తన ప్రాణనాధుడు,తన హృదయవిహారి అయిన రాముని సందేశమేదో హనుమ తెచ్చినాడని మనస్సులో సంతోషము మొగ్గలు తొడిగి ఆమె ముఖపద్మము సహస్రదళ వికసిత కమలమయ్యింది.
‘‘అమ్మా సీతమ్మా, ఇదుగో రాముని ఆనవాలు. ఆయన అంగుళీయకము’’ అని హనుమ స్వామి సీతమ్మకు శ్రీరాముని ఉంగరము ఈయగా తన ప్రియవిభుని కరస్పర్శ పొందినట్లయి శరీరము పులకెలెత్తి కన్నుల వెంట ఆనందబాష్పములు జలజలరాలి సిగ్గులమొగ్గయిన సీతమ్మ తల్లి బాహ్య ప్రపంచ స్పృహను కోల్పోయి అంతరంగమందు రామపరిష్వంగ మధురోహలు ముప్పిరిగొనగా చేతనావస్థను కోల్పోయినదాయెను.
మనస్సు రామమయము,
ప్రపంచము రామమయము. రమణి సీత ఊహలు రామమయము.
జగమే రామమయమయ్యి అశోకవనము ఆమెకు రమణీయముగా కనపడెను.
‘‘అమ్మా సీతమ్మా’’ అన్న పిలుపుతో తేరుకొని హనుమను బహుథా ప్రశంసించసాగింది సీతామాత.
Also read: రాక్షస స్త్రీల మానసిక హింస, త్రిజట కల
వూటుకూరు జానకిరామారావు