Thursday, November 7, 2024

రావణుడికి హనుమ ధర్మబోధ

రామాయణమ్ 155

నేను ఇంద్రుడి గూఢచారిని కాను!

విష్ణువు దూతనూ కాను.

నేను వానరుడను.

 వనచరుడను.

Also read: రావణుడి ఎదుట నిలిచిన వాయునందనుడు

రాజదర్శనము లభించవలెనన్న కోరికతో మాత్రమే వనభంగము చేసినాను.

ఆత్మరక్షణ కొరకు మాత్రమే రాక్షసులను సంహరించినాను.

ఏ అస్త్రములు నన్ను బంధించలేవు. కేవలము రాజదర్శన కాంక్షవలన మాత్రమే నేను కట్టుబడినాను.

అని  రాక్షసేశ్వరుని చూసిపలుకుతూ హనుమంతుడు …

మహారాజా, నేను శ్రీరామచంద్రుని కార్యము నిమిత్తమై నీ వద్దకు వచ్చితిని. ఆయన దూతను నేను.

సోదరుడైన సుగ్రీవుడు నీ కుశలమడిగి తన సందేశము నీకు చెప్పమనినాడు.

Also read: బ్రహ్మాస్త్రానికి బద్ధుడైన వాయుసుతుడు

పరమ ధర్మమూర్తి రామచంద్రుడు తన భార్యతో దండకారణ్యములో నుండగా ఒక రోజు ఆయనకు తన భార్య కనుపించలేదు

తమ్మునితో కూడి తన భార్యను వెతుకుతూ ఋష్యమూకము చేరినాడు. అక్కడ సుగ్రీవునితో ఆయనకు సఖ్యమేర్పడినది. వాలిని సంహరించి సుగ్రీవుని దుఃఖము పోగొట్టి ఆయనను రాజ్యాభిషిక్తుని గావించినాడు రామచంద్రుడు.

నీవెరుగుదువు కదా వాలిని.

Also read: రావణ సుతుడు అక్షకుమారుడి వధ

అట్టి వాలిని ఒక్కబాణముతోనే నేలకూల్చినాడు రాముడు.

రాముడి కొరకై సుగ్రీవుడు తన వానర సైన్యమునంతా సన్నద్ధము చేసినాడు. వానర వీరులందరినీ నలుదెసలా పంపినాడు సీతాదేవి జాడ తెలుసుకొని రమ్మని.

నేను వాయుపుత్రుడను హనుమంతుడను. దక్షిణదిక్కుగా సీతమ్మను వెతుకుతూ వచ్చి ఇట లంకలో అశోకవనములో ఆమె జాడ కనుగొంటిని…..ఇంకా ఇలా అంటున్నాడు హనుమస్వామి.

(ప్రశ్నించినది ప్రహస్తుడు కానీ వాడి వైపు కూడ చూడకుండ  రావణుడికే సరాసరి చెప్పడంమొదలు పెట్టారు స్వామి.

అంతటి వాలికే ఒక్కబాణం సరిపోయింది, నీ గతి ఏమిటో ఆలోచించుకో అని బెదిరించడం కూడా అయ్యింది….రామదాసుడిని నేనే ఏ అస్త్రా‌నికీ కట్టు బడను, ఇక నా రాముడి శక్తి నీకేం తెలుస్తుంది?

ఇదీ స్వామి సంభాషణా చాతుర్యం!)

Also read: అనేకమంది రాక్షస యోధులను యమసదనానికి పంపిన హనుమ

రాక్షసేశ్వరా! నీవు చేసిన పని అధర్మము, అక్రమము. నీ వంటిబుద్ధిమంతులైన వారు ఇటువంటిపనులలో తలదూర్చరు.

రామబాణానికి అడ్డులేదు. లక్ష్మణశరానికి ఎదురు లేదు.

రామకోపాగ్నిలో పడి శలభంలాగా మాడి మసి అయిపోకు!

రామునికి కోపము తెప్పించిన తరువాత కూడా సుఖముగా గుండెమీద చేయి వేసుకునినిద్రించగలవాడు ముల్లోకాలలో  ఇంతవరకు ఎవడూ పుట్టలేదు. ఇక ముందు ఎవడూ పుట్టడు.

నీకు హితము చేకూర్చేదీ, మరియు ధర్మబద్ధమైన మాట నేనొకటి చెపుతాను విను.

నేను ఇక్కడికి వచ్చి సీతమ్మను చూసినాను. ఆ మహాసాధ్విని ఆవిడ భర్తకు అప్పగించు.

అసంభవమూ, అతిదుర్లభమూ అయిన కార్యాన్ని నేను సాధించాను. ఇక మిగతా విషయాలు రామచంద్రుడు చూసుకుంటాడు.

సీతమ్మ అంటే ఏవిటో అనుకుంటున్నావు. బంధించి తీసుకు వచ్చాను కదా అని సంబరపడుతున్నావు.

కానీ అయిదు తలల ఆడత్రాచుపాము అన్నసంగతి గ్రహించలేకున్నావు.

నీ తపస్సును, నీ ధర్మాన్నీ వ్యర్ధము చేసుకుంటున్నావు.

తపస్సు చేసి చావులేకుండా వరం పొందానని సంతోషిస్తున్నావేమో!

సుగ్రీవుడు …అసురుడు కాడు, అమరుడు కాడు ,దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నర, కింపురుషు, పన్నగ, ఉరగులలో ఎవడూ కాడు! ఆయన వానరుడు! అతడి నుండి నీవు ప్రాణాలు ఎలా కాపాడుకుంటావు?

అధర్మాన్ని నాశనం చేయడానికి ధర్మమే తగిన మార్గాలను వెతుక్కుంటుంది.

నీవు ఆచరించిన ధర్మాలకు మాత్రమే ఇప్పటివరకూ ప్రతిఫలం పొందావు ….ఇక ముందు నీ అధర్మానికి ప్రతిఫలం పొందుతావు!…..

అని అంటూ ఇంకా కొనసాగిస్తున్నాడు పవనసుతుడు..

Also read: హనుమపై రాక్షసమూక దాడి

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles