రామాయణమ్ – 141
‘‘అమ్మా, ఏ రాముడు బ్రహ్మాస్త్రమును ఎరుగునో, ఏ రాముడు వేదవేదాంగవేత్తో ఆ రాముడు నీ క్షేమము తెలుసుకొమ్మని నన్ను పంపినాడు. నీ భర్తకు అనుంగు సోదరుడైన లక్ష్మణుడు కూడా శిరస్సు వంచి నీకు అభివాదము చేసినాడు’’ అని హనుమ అన్నాడు.
ఒక్కసారిగా శరీరము గగుర్పొడిచింది సీతమ్మకు తన రాముని క్షేమ సమాచారము చెవిన పడినంతనే.
‘‘అవును నిజము ఇది నిజము. మానవుడు జీవించి ఉన్నట్లయితే నూరు సంవత్సరాలకైనా ఆనందము పొందగలుగుతాడు.ఇది సత్యమే అని నేను నమ్ముతాను’’ అని సీతమ్మ ఆనందాతిశయంతో పలికింది.
Also read: సీతమ్మతో హనుమ సంభాషణ
(ఏష జీవన్తమానందో నరం వర్ష శతాదపి!)
సీతమ్మకు ఇంకా కొంచం దగ్గరకు వచ్చి సంభాషించసాగాడు హనుమస్వామి.
వారిరువురూ ఒకరిపై ఒకరు విశ్వాసము చూపుచూ మాటలాడుకొనుచుండిరి…
మరల ఇంకొంచెం సమీపించాడు ఆంజనేయుడు.
అమ్మకు అనుమానం వచ్చింది. ‘‘ఈతడు దగ్గరదగ్గరగా వస్తున్నాడు, కొంపదీసి ఈ వేషంలో వచ్చిన రావణుడు కాడుగదా! ఏమో, వీడు మాయావి. రావణుడి మాయలు కనిపెట్టటం చాలా కష్టం. జనస్థానములో సన్యాసి వేషములోనే కదా నన్ను వంచించి తీసుకువచ్చినాడు.ఈతడు నిశ్చయముగా రావణుడే అయి ఉండును …
Also read: సీతమ్మ కంటబడిన హనుమ
‘‘ఈ అనుమానం మనస్సులో ప్రవేశించగనే మౌనం పాటించి ఒక్కసారిగా దూరంజరిగి కూర్చున్నది సీతామాత.
‘‘ఛీఛీ, నేను కల్లా కపటములేకుండా వీనికి విషయమంతా చెప్పివేసినాను. నా వలన మరల ఇంకొక తప్పు జరిగినది. వీడు మాయావి రావణుడే. సందేహము లేదు’’ అని అనుకొనుటయే తడవుగా మౌనముగా మారు మాటాడక ముఖము తిప్పి కూర్చున్నది.
మహాబుద్ధిశాలియైన మారుతికి విషయము అర్ధము అయ్యి ఏమి చేయుటకు పాలుపోక మౌనముగా నమస్కరించి మిన్నకుండెను.
ఎప్పుడైతే హనుమ తనకు నమస్కరించి మౌనాన్ని ఆశ్రయించాడో అప్పుడు సీతమ్మ ఆయన వైపు తిరిగి, రావణుడనుకొని,
‘‘రావణా, మాటిమాటికి నన్నిట్లు హింసించుట నీకు న్యాయమా? ఉపవాసముతో కృశించి నీరసించి దీనముగా యున్న నన్ను అధికముగా బాధించుచున్నావు.
Also read: రాక్షస స్త్రీల మానసిక హింస, త్రిజట కల
ఇది మంచిది కాదు’’ …..అని పలికి …
మరల ఆలోచనలో పడి…
‘‘ఒక వేళ నా శంక నిజము కాదేమో. ఏలన ఈతనిని చూడగనే ఏలనో నా మనస్సునకు ఆనందము కలిగినది. ఇతను వినిపించిన రామకధ నా హృదయములో చెప్పనలవి కాని సంతోషమును పుట్టించినది.
‘‘ఓయీ వానరా, నీవు నిజముగా రాముని దూతవైనచో ..నా రాముడెట్లుండును? ఆతని గుణగణములెవ్వి నీవు చెప్పుమోయీ’’ అని అడిగింది సీతమ్మ
సీతమ్మ అడిగినదే తడవుగా రాముని గురించి చెప్పసాగాడు ఆంజనేయస్వామి
‘‘రాముడు సకలగుణాభిరాముడు, నీలమేఘశ్యాముడు, కోదండ రాముడు, కమనీయమూర్తి, రాజీవనేత్రుడు, సమస్తప్రాణకోటి మనస్సులను ఆకర్షించు పెను అయస్కాంతము. సాటిలేని సౌందర్యము. మూర్తీభవించిన శౌర్యము. ఘనీభవించిన బ్రహ్మము. తేజస్సులో సూర్యుడు.యశస్సులో దేవేంద్రుడు. బుద్దిలో బృహస్పతి. ఓర్పులో పృథివి. సమస్తప్రాణికోటినీ, సమస్తధర్మములను రక్షించువాడు. సాధువు, బ్రహచర్యవ్రతదీక్షాపరుడు. ఉపకారి. రాజవిద్యలో వినీతుడు.
Also read: సీతను దారికి తేవాలని రాక్షసస్త్రీలను ఆదేశించిన రావణుడు
‘‘విద్యాశీలి. వినయవంతుడు. శత్రు భయంకరుడు. ధనుర్వేదము కరతలామలకము. యజుర్వేద ధారణము. సామవేదవైదుష్యము గలవాడు. ఋగ్వేదాధ్యయనము చేసినవాడు.
‘‘ఏమని వర్ణించనమ్మా!సకలసద్గుణాలను ఒక చోట ప్రోగుపోస్తే అది దాల్చే రూపము రాముడమ్మా! విశాలమైన భుజములు,దీర్ఘమైన బాహువులు,శంఖము వంటి కంఠము,ఎర్రని నేత్రాంతములు. మంగళాకారుడమ్మా శ్రీరాముడు. ఆయనను గూర్చి వినని వారు లోకములోలేరు….’’ అని రాముని గురించి వర్ణిస్తూ ఉన్నారు హనుమస్వామి….సీతమ్మ వింటూ ఉన్నది.
Also read: ‘నువ్వు గడ్డిపోచతో సమానం’ అని రావణుడికి స్పష్టం చేసిన సీత
వూటుకూరు జానకిరామారావు