రామాయణమ్ – 129
అతడు లంకేశ్వరుడు!
నారీజనము చుట్టూ పవ్వళించియుండగా తానొక ఉన్నతమైన శయ్యపై నిద్రావస్థలో ఉన్నవాడు.
నల్లని మినుములను రాశిపోసిన ఎట్లుండునో ఆ విధమైన వర్ణములో ఉన్నాడు.
బాగా నీరుపట్టిన మేఘమువలే పడుకొనిఉన్నాడు.
Also read: లంకలో హనుమ సీతాన్వేషణ
చెవులకుండలములుధగద్ధగాయమానంగా మెరుస్తున్నాయి! ఎర్రటి రక్తవర్ణ నేత్రములు కలిగి దీర్ఘమైన బాహువులతో ఉన్నాడు. సువాసనాభరితమైన ఎర్రటి చందనాన్ని ఒడలంతా పులుముకొని యున్నాడు. వంటినిండా దివ్యాభరణములు ధరించిఉన్నాడు. ఎర్రనైన సాయంసంధ్యలో ఒక నల్లని మేఘము మెరుపులతో మెరుస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలాగ ప్రకాశిస్తున్నాడు.
స్వర్ణభుజకీర్తులు ధరించి తన రెండు భుజములను బాగా చాచిపడుకొనియుండగా ఆ భుజములు రెండూ మందరపర్వతమును పట్టుకొన్న రెండు అయిదుతలల పాముల వలే ఉన్నవి.
ఆరెండు బాహువులమీద, ఇంద్రుడితో యుద్ధము చేసినప్పుడు ఐరావతము దంతములతో కుమ్మినప్పుడు కలిగి మానిపోయిన గాయములు కనపడుతున్నాయి.
Also read: లంకా నగరిలో సీతమ్మకోసం హనుమ అన్వేషణ
ఆయన వక్షస్థలము మీద చక్రాయుధ ప్రహారము వలన కలిగిన దెబ్బలు, ఇంద్రుడి వజ్రాయుధ ప్రహారము వలన ఏర్పడిన గాట్లు ఆయన వీరత్వానికి గుర్తులుగా శోభిస్తున్నాయి.
అక్కడ ఒక అందమైన శయ్యపై పవ్వళించిన ఒక అతిలోక సౌందర్య రాశి అయిన స్త్రీ మూర్తిని చూశాడు హనుమ….ఆమె దేహ కాంతి ఆ భవనమునే అలంకరిచునట్లుగా ఉన్నది. ఆవిడ రావణునకు అత్యంత ప్రియురాలైన పట్టమహిషి! ఆ అంతఃపురానికి అధిపతి మండోదరీదేవి!
కనుగొంటి, కనుగొంటి రాఘవుని ఇల్లాలు రమణి సీతను కనుగొంటి అని ఆనందించాడు.
ఎదుట నిదురించు రమణీయ రూప లావణ్యవతి రామసతి సీతయే!! ఆమె కాక మరి ఇంక ఎవరీమె?
ఆహా ఏమి నా భాగ్యము!
ఏమి నా అదృష్టము!
అంటూ ఎదుట ఉన్న స్తంభాలను ఎక్కి దూకాడు. తోకకు ముద్దులు పెట్టి దానిని అటుఇటు ఊపి ఆడించి, ఝాడించి ఆడి, పాడి అటుఇటు పరుగులు పెట్టి ఆనందంలో తలమునకలయ్యాడు మారుతి.
Also read: లంకిణితో హనుమ ఘర్షణ
కాసేపటికి బుర్రగిర్రున తిరిగి సరిఅయిన స్థానానికి వచ్చింది. ఏమిటి నేను చేసిన పని? ఏమిటి ఈ విపరీత ప్రవర్తన!
రామసతి. రమణి సీత. రాముని విడిచి మరియొకనితో రమించునా? వాడు సాక్షాత్తూ దేవతలకు అధిపతియే అయినా వాని దరిచేరదు! ఎంత పాడు ఊహ! ఈవిడ రావణుని ఇల్లాలు మండోదరీదేవి!
అని అనుకొంటూ అందరినీ వివరంగా చూసుకుంటూ ముందుకు సాగాడు హనుమస్వామి!
Also read: సముద్రాన్ని లంఘించిన హనుమ
వలువలు విడిచి వేసినదొకతి
సగమువలువలున్నది ఇంకొకతి
ప్రియుని కౌగిలి అనుకొని మరియొకతి
ఇందరు, ఇన్ని అవస్థలలో ఉండగా చూడగూడని విధముగా,
చూడగూడని సమయములో
చూడగూడని స్థితిలో
పరభార్యలను ఇంత పరిశీలినగా చూసినానే..
ఇది నాకు ధర్మలోపము కలిగించును కదా!
ఇది పాపకృత్యము కాదా?
అనే ఊహ మరల కలిగింది మారుతికి.
మరల తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. ‘‘ఒక స్త్రీని కనుగొనవలెనన్న స్త్రీలమధ్యలోనే కదా వెతుకవలసినది. స్త్రీ తప్పిపోయినదని లేళ్ళగుంపులో వెదుకలేముకదా! అయిననూ నా మనస్సున ఎట్టి వికారము జనియించలేదు. పరిశుద్ధమైన మనస్సుతో ఇతర ఊహలు లేక సీతాదేవి కొరకు మాత్రమే వెదకితిని కదా నాకు ధర్మలోపముఏమీ సంభవించదు’’ అని సమాధానపడ్డాడు ఆంజనేయుడు.
ఇంత మందిని వెదకి నప్పటికీ సీతాదేవి కానరాలేదు.
Also read: సరస నోటిలోదూరి బయటకు వచ్చిన హనుమ
వూటుకూరు జానకిరామారావు