Thursday, November 7, 2024

లంకలో హనుమ సీతాన్వేషణ

రామాయణమ్128

మరలమరల వెదకాలి. సీతమ్మ కనపడాలి. ఇదే పట్టుదల హనుమకు.

ఇల్లిల్లు వెదికాడు కనపడలేదు సీతమ్మ.

ఇక రాజాంతఃపురము,రాజముఖ్యుల నివాసాలు వెదకాలి అని అనుకున్నాడాయన.

రావణ భవన సముదాయము వైపు అడుగులు వేశాడు. రావణ అంతఃపురము అంతా అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడుతూ బంగారు, వెండితో చేయబడిన ద్వారములు, కిటికీలు చిత్రవిచిత్రములై సుందరముగా ఉండి ఆశ్చర్యముగా కనపడ్డాయి వాయునందనుడికి.

Also read: లంకా నగరిలో సీతమ్మకోసం హనుమ అన్వేషణ

భయంకరాకారముగల యోధులు కావలి కాస్తున్నారు.

మొదటగా రాజముఖ్యుల ఇళ్ళు కనపడ్డాయి ఆయనకు ..

ప్రహస్త, మహాపార్శ్వ, కుంభకర్ణ,విభీషణ,మహోదర, విరూపాక్ష, విద్యుజ్జిహ్వ, విద్యున్మాలి, వజ్రదంష్ట్ర, శుక, సారణ, ఇంద్రజిత్, జంబుమాలి, సుమాలి, రశ్మికేతు, సూర్యశత్రు, సూర్యకేతు, వజ్రకాయ, ఘన, విఘన, శఠ, వికట…..ఇంకా ఎందరో రాక్షస ప్రముఖుల ఇళ్ళకు  ఒకదాని మీద నుండి మరొకదాని మీదకు దూకుతూ వెళ్ళాడు.

 ప్రతి ఇంట్లో అణువణువూ గాలించాడు. కణకణము శోధించాడు. అయినా కానరాలేదు సీతమ్మ!

ఇక మిగిలింది రావణ నివాసభవనము !

అది ధగధ్ధగాయమానంగా స్వర్ణకాంతులు వెదజల్లుతూ శత్రుభయంకరులైన రాక్షసవీరుల రక్షణలో చతురంగబలాలు కావలి కాస్తున్నటువంటి భవనము.

Also read: లంకిణితో హనుమ ఘర్షణ

ఆ భవనములోని గృహములన్నీ వైఢూర్యమణులు పొదిగిన బంగారు కిటికీలు అమర్చబడియున్నవి. ఎటు చూసినా విశాలమైన శాలలు, మయుడు మనస్సుపెట్టి నిర్మించిన భవనసముదాయములవి!  భూలోకములో అటువంటివి మరి ఎచటనూ కానరావు. ప్రతి గృహము అందముగా తీర్చిదిద్దబడి అతిలోక సౌందర్యశోభతో అలరారుతున్నవి.

అక్కడ ప్రతి అంగుళము వెదికాడు. ఎక్కడా సీతమ్మ జాడలేదు!

ఆ భవన సముదాయములో ఒకచోట  స్త్రీలు నివసించే ప్రదేశానికి చేరుకున్నాడు హనుమ.

Also read: సముద్రాన్ని లంఘించిన హనుమ

ఓయ్ హనుమా!

 ఇటురా ! ఇటురా!

 ఏవోఏవో సుగంధాలు!

 మధురమధుర పదార్ధాలమీదుగా వస్తున్నవి

అటు వైపుగా  తనను పిలుస్తున్నట్లు అనిపించింది ఆంజనేయుడికి !

అటుగా వెళ్ళాడాయన!

 భక్ష్య, భోజ్య, పానశాలలు కనపడ్డాయి ఆయనకు.

అటునుండి రావణ శయనమందిరాన్ని చేరుకున్నాడు.

Also read: సరస నోటిలోదూరి బయటకు వచ్చిన హనుమ

ఆ భవనము చూడగనే

ఆహా!

స్వర్గమనిన ఇదియే!

దేవలోక మిదియే!

తపస్సుకు పరమ సిద్ధి ఇదియే!

అప్సరసలన వీరే! దేవకాంతలన్న వీరే! అని అనుకొంటూ

నిరుపమాన సౌందర్యం తో ప్రకాశిస్తూ శయనిస్తున్న రావణాసురుడి భార్యలను చూశాడు హనుమ!

వారందరూ రావణుని పరాక్రమమును, సౌందర్యమును మెచ్చి ఆయన వెంట వచ్చిన వారే!

పరుని భార్యకానీ, ఇంకొకడిని కామించి ఈయన వశముచేసుకొన్న స్త్రీగానీ,

బలవంతముగా ఎత్తుకొచ్చిన ఆడుదిగానీ ఒక్కతిలేదు!

వారు రాజర్షి, విప్ర, దైత్య, గంధర్వ జాతులకు చెందిన స్త్రీలు!

అందరూ ఆయన ను వలచి వరించి వచ్చిన వారే!

(ఆయనకు పోగాలము దాపురించినందువల్లనే బహుశా సీతామాతను ఎత్తుకొచ్చి ఉంటాడు)

వారంతా వివిధ వస్త్రాలంకారభూషితలై గాఢ నిద్రాపరవశులై ఉన్నారు.

క్రమంగా ముందుకు సాగుతున్నాడు హనుమంతుడు…రావణుడు శయనించిన ప్రాంతానికి చేరుకొన్నాడు …

భయంకరమైన మహాసర్పము కొట్టే బుసల వలే ఉచ్ఛ్వాసనిశ్వాసములు పెట్టుచున్న ఒక మహాపురుషుని చూసి ఒక్కసారిగా గతుక్కుమన్నాడు హనుమ!

కొంచెము దూరముగా తొలగి ఒక గట్టుమీదకు ఎక్కి రావణుని పరీక్షగా చూడటం మొదలు పెట్టాడు.

Also read: దిగ్గున లేచి సముద్రంపైన ప్రయాణం ప్రారంభించిన హనుమ

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles