రామాయణమ్ – 109
లక్ష్మణా! నామనస్సులో దుఃఖభారము అధికముగా ఉన్నది. దానిని దాటే మార్గమేది? వర్షాకాలమా ప్రయాణమునకు అనుకూలము కాదే! దీనిని దాటుటెట్లు? చూడబోతే రావణుడా బలవంతుడైన శత్రువు! ఈ మూడింటినీ దాటుట ఎట్లు?
వర్ష ఋతువులో అందమైన ప్రకృతిని ఆస్వాదించలేక అనుక్షణము సీతాదేవిని గుర్తుకు తెచ్చుకుంటూ పిచ్చివాడవుతున్న అన్నను జాగ్రత్తగా ఓదారుస్తూ వస్తున్నాడు లక్ష్మణుడు!
వారి పరిస్థితి ఇలా ఉంది!
Also read: వాలి దహన సంస్కారం
………….
అక్కడ కిష్కింధలో..
సుగ్రీవుడు ఎంతోకాలానికి లభించిన సుఖాలవ్వటముచేత వాటిలో మునిగి తేలుతున్నాడు. సమయము ఎలా గడిచిపోతున్నదో గమనించే స్పృహలో కూడా లేడు. భార్య రుమ. ఇష్టురాలైన తార. ఇరువురూ లభించారు.
మగువ, మదిర.. ఈ రెండూ అతనిని కట్టిపడవేసినవి. దర్శనము మంత్రులకు కూడా కరువయ్యింది. ఆయనను ఎవరూ సమీపించే సాహసము చేయలేకపోతున్నారు.
ఈ పోకడలన్నీ ఒకరు గమనిస్తూనే వున్నారు. ఆయనే బుద్దిమంతులలో శ్రేష్ఠుడైన హనుమంతుడు.
అప్పటికి వర్షాకాలము గడచిపోవచ్చింది.
మేఘముల మెరుపులు తగ్గిపోయి నిర్మల మైన ఆకాశము
కనపడ జొచ్చింది.
Also read: శోక వివశులైన తార, సుగ్రీవుడు
రాత్రుళ్ళు అంబరాన తెల్లని వెన్నెల పూతలతో కడు రమణీయంగా కనపడుతున్నది.
సుగ్రీవుని సమీపించాడు హనుమంతుడు …
ఇలా పలికాడు!
‘‘నీవు నీ రాజ్యాన్నీ రుమనీ తిరిగి సంపాదించుకున్నావు. గొప్ప యశస్సు నీ స్వంతమైనది. నీవు నీ మిత్రుల కార్యములు సాధించుటమీద దృష్టి నిలపవలె. తగు సమయమును గుర్తించుచూ మిత్రుల విషయములో ఎల్లప్పుడూ బాగుగా ప్రవర్తించువాని రాజ్యము, కీర్తి, ధనము వృద్ది పొందును. రాజా, ఏ రాజుకైతే స్నేహితులు, సైన్యము, ధనాగారము, ప్రభుత్వ శక్తీ – ఈ నాలుగూ సమముగా ఉండునో అతనే గొప్ప రాజ్యమును తన స్వంతము చేసుకోనగలడు.
Also read: తార ఆక్రందన, సుగ్రీవునికి వాలి విజ్ఞాపన
ఎవడు తన మిత్రుని కార్యమును సాధించుటకు ఉత్సాహము చూపడో అతడు సకల అనర్ధములను ఎదుర్కొనవలసి ఉండును!
‘‘అడుగకనే ఎందరికో సహాయము చేసిన ఉదారుడవే! అటువంటిది నీకు రాజ్యము వైభవము అధికారము వచ్చుటకు తన ప్రాణములకు తెగించి సహాయము చేసిన రాముడే వచ్చి అడుగువరకు ఆగుట ఎంత వరకు సమంజసము! రాజా, రాముడు జగదేకవీరుడు. సామాన్యుడుకాదు! ముల్లోకములను నిమేషకాలములో తన అధీనములోనికి తెచ్చుకో గలిగిన సమర్ధత ఉన్న గొప్ప ధనుర్ధారి. ఆయన అనుగ్రహము ఆగ్రహముగా మారక ముందే మేలుకో.
రాముడు ధనుస్సు చేతబూని నిలుచుంటే దేవ, గంధర్వ, యక్ష, మరుద్గణాలేవి ఎదురుగా నిలుచునే సాహసము చేయరు. ఇక రాక్షసులొక లెక్కా? సరి అయిన సమయములో తన కర్తవ్యము గుర్తుచేసిన హనుమంతుని మాటలు విని క్షణమాలస్యము చేయక సుగ్రీవుడు నిర్ణయము చేసెను.
నీలునకు కబురుపెట్టెను.
Also read: రాముడు తనను చంపడం అధర్మం కాదని అంగీకరించిన వాలి
నీలుడు రాగానే ఆయనకు సకల వానరకోటిని పదిహేను దినములలోగా కిష్కింధకు పిలిపించునటుల ఆజ్ఞలు జారీ చేసినాడు. పదహారవ దినమున ఎవరైనా కిష్కింధలో ప్రవేశించినారా వారికి శిరశ్ఛేదమే శిక్ష!
అది సుగ్రీవాజ్ఞ
అంగదునకు, నీలునకు కోటికి పైగా ఉన్న వానరులను సమీకరించు బాధ్యత ఈయబడినది.
ఈ విధముగా ఆజ్ఞలు ఇచ్చి సుగ్రీవుడు గృహమునందు ప్రవేశించెను.
ఆకాశము నిర్మలమైనది! మేఘపు తునక కూడా కానరావడము లేదు. నదులు బురదలేకుండా ఉన్న స్వచ్చమైన జలాలతో నీలవేణులు నడిచినట్లు వయ్యారముగా నడుస్తున్నాయి. సుగ్రీవుడు తన్ను కలియరాడు అదేమి? రాఘవుని మదిలో మెదిలిన ఆలోచన!
Also read: మోదుగువృక్షంలాగా నేలవాలిన వాలి
వూటుకూరు జానకిరామారావు