రామాయణమ్ – 188
పిడుగులు పడుతున్నట్లుగా ఆ గర్జనలు నిస్సందేహముగా వానర సైన్యానివే.
ఇప్పటివరకూ శోకసముద్రములో మునిగిన వారు అప్పుడే ఆనందశిఖరాలపై నిలుచొనుటకు గల కారణమేమయి ఉండును?
ఏమి జరిగినది?
రావణుని ఆజ్ఞమేరకు భటులు భవనప్రాకారములపై నిలబడి చూడగా రామలక్ష్మణులిరువురూ రెట్టించిన ఉత్సాహముతో సైన్యము ముందు ఉండి నడిపించుట చూచిరి.
Also read: ఇంద్రజిత్తు నాగాస్త్రం వల్ల మూర్ఛిల్లిన రామలక్ష్మణులు
విషయము అర్ధముకాలేదు రావణునికి.
తిరుగులేని నాగాస్త్రబంధనము ఏల విఫలమైనది? ఇవే బాణములు పూర్వము శత్రువుల ప్రాణములను అపహరించి నాకు విజయము కట్టబెట్టినవి. నేడేల ఇవి నిరుపయోగమైపోయినవి?
తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురి అయి అవధులులేని కోపావేశముతో ధూమ్రాక్షుని పిలిచి యుద్ధమునకు బయలు దేరమని ఆజ్ఞాపించెను.
Also read: ఇరు పక్షాల మధ్య భీకర సమరం
ధూమ్రాక్షుడు గొప్పసేన వెంటరాగా బయలు దేరెను.
అప్పుడు ఆకాశములో క్రూరమైన శకునములు కనపడినవి.
వలయాలు, వలయాలుగా రాబందులు ఆతని రధము చుట్టూ సంచరించినవి. హఠాత్తుగా రక్తములో తడిసిముద్ద అయిన ఒక మానవ దేహము మొండెమువరకు ఉన్నది అతని రధముపై పడెను, రక్తపువర్షము కురిసి ప్రతికూల వాయువులు వీచెను. భూమి కంపించెను ….ఇవి ఏవీ లెక్కచేయక ఆ రాక్షసుడు పశ్చిమద్వారము వైపుగా తన రధమును మళ్ళించెను.
అక్కడ కాపు కాచిన వానర సేనాధిపతి మరెవరోకాదు. హనుమంతుడు!
Also read: అంగద రాయబారము
ధూమ్రాక్షుని ప్రాణములు ధూమమువలె పైకెగసి పోయినవను వార్త చెవినపడగానే రావణుడు కోపముతో కళ్ళెర్రచేసి పళ్ళుపటపటకొరికి వెనువెంటనే వజ్రదంష్ట్రునికి కబురుపెట్టెను. అతనిని రణరంగములోనికి ఉరకమని ఆజ్ఞలు ఇచ్చెను. వాడు పరవళ్ళుతొక్కే మహోత్సాహముతో యుద్ధరంగమున ప్రవేశించి వేలకొలదిగా వానరుల కుత్తుకలు తన కత్తికి ఎర చేసినాడు.
అదిచూసిన అంగదుడు మహోగ్రముగా వజ్రదంష్ట్రునితో తలపడి ద్వంద్వయుద్ధము చేసినాడు. ఇరువురి శరీరములనుండి రక్తము ఏరులైపారినది. ఇంతలో ఉన్నట్టుండి మెరుపు వేగముతో అంగదుడు ఒక గిరి శిఖరమును ఎత్తి వాని తలపై పడవేసెను. వాడు ఈ హఠాత్పరిణామమునకు దిమ్మెరపోయి తేరుకొనలేక దానిక్రిందపడి నలిగి శిరస్సువక్కలై చనిపోయెను.
ఈ వార్త చేరిన వెంటనే బుసలుకొట్టే కోపముతో రావణుడు సేనాధిపతి ప్రహస్తుని పిలిచి వానరసైన్యము మీదికి యుద్ధమునకు పొమ్మని ఆజ్ఞ ఇచ్చెను.
Also read: లంకను చుట్టుముట్టిన రామసైన్యం
వూటుకూరు జానకిరామారావు