హైదరాబాద్ : మహాకవి గురజాడ అప్పారావు ఎన్నో ఏళ్ళ క్రితం స్థాపించిన “ప్రకాశిక” పత్రిక సరికొత్త రూపంలో మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఈ ఆవిష్కరణ సభ అంతర్జాలంలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ మహాకవి వర్ధంతి సందర్బంగా గురజాడ ఫౌండేషన్ (అమెరికా) ఈ బృహత్ కార్యక్రమం చేపట్టింది. మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ ఈ పత్రికను ఆవిష్కరించారు. గురజాడపై ఇంకా విస్తృతంగా పరిశోధనలు చేపట్టాలని ఆయన నిర్వాహకులకు సూచించారు.
ప్రముఖ సంపాదకులు తెలకపల్లి రవి కీలక ఉపన్యాసం చేశారు. ఆ మహాకవి విభిన్న రూపాలను, విరాట్ స్వరూపాన్ని యువత కూడా అందిపుచ్చుకోవాలని, ప్రతి తరానికి గురజాడ చేరాలని తన భావాలను పంచుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు పూర్వ శాఖాధిపతి ఆచార్య కోలవెన్ను మలయవాసిని సభాధ్యక్షత వహించారు. ప్రకాశిక పత్రిక పాత ప్రతులను వెతికి పట్టుకొని జాతికి అందించాలని, కొన్ని ప్రతులైనా దొరికే అవకాశముందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పత్రిక గురించి వివిధ వ్యాసాలలో వచ్చిన అంశాలను పంచుకున్నారు.
సాహిత్యవేత్తలు విహారి, భవానీదేవి గురజాడలోని వివిధ కోణాలను ఆవిష్కరించారు.గురజాడలోని నిత్య ఆధునికతను గుర్తుచేసుకోవాలని సీనియర్ పాత్రికేయుడు, కవి అప్పరసు కృష్ణారావు తెలిపారు. ఈ పత్రికను గురజాడ స్థాపించినట్లుగా, ఆయనే సంపాదకుడుగా వ్యవహరించినట్లుగా గురజాడ మునిమనుమడు రవీంద్రుడు వివరించారు. ఈ పత్రిక ప్రధాన సంపాదకుడు డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ, నిర్వాహక సంపాదకురాలు గురజాడ అరుణ పత్రిక స్థాపన వెనుక ఉన్న సంకల్పం, భవిష్యత్తు ప్రణాళికలు వివరించారు. సుప్రసిధ్ధ ప్రయోక్త, సాహిత్యవేత్త ఓలేటి పార్వతీశం అనుసంధానకర్తగా ఈ కార్యక్రమాన్ని తన వాగ్వైఖరితో ఆద్యంతం అద్భుతంగా నడిపించారు. డాక్టర్ ఏ.గోపాలరావు, డాక్టర్ సిమ్మన్న, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, మాశర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
My maternal grand father Sri Gurazada Sitapati Rao Garu and Mahakavi Gurazada Apparao Garu are cousins from their paternal side # Both of them worked for Vijayanagara Samsthanam at one point of time # My grand father was a BA of good old days # In our childhood days we used to hear that my grand father was like the character Soujanya Rao in some ways in the great play Kanyasulkam #