భౌగోళికంగా ప్రకాశం జిల్లాలో పుట్టి, అదే జిల్లాలో ప్రవహించి సాగర సంగమం అయ్యే గుండ్లకమ్మ నది జిల్లా ప్రజానీకానికి గుండెకాయలాంటిది. గిద్దలూరుసమీపాన ‘దిగువమెట్ట’ నల్లవుల అడవుల్లో, ఎతైన కొండచరియల్లో ‘గుండ్ల బ్రమ్మేశ్వరం’ వద్ద అవతరించి, ఏడు వరుస జలపాతాలు (గుండాలు)గా మారి, కంబం చెరువులో కలిసి, మార్కాపురం, అద్దంకి మీదుగా 280 కి.మీ పొడవునా ప్రవహించి, ఒంగోలు సమీపాన గుండాయి పాలెం (ఉలుచి) వద్ద బంగాళాఖాతంలో కలిసే ఈ నదీమ తల్లి ముచ్చటగా మూడు సంస్కృతులకు ఆనవాలు.
ఆంధ్ర ప్రాంత సంస్కృతిని ప్రతిబింపజేసే గుంటూరు, నెల్లూరు జిల్లాలు, రాయలసీమ సంస్కృతికి పుట్టినిల్లయిన కర్నూలు-కడప జిల్లాలు, తెలంగాణ తీరుతెన్నులను తలపింపజేసే మహబూబ్ నగర్ జిల్లాలు సరిహద్దులుగా వున్నందు వల్ల వాటి సాంస్కృతిక ప్రభావం ప్రకాశం జిల్లాపై ఎంతైనా వుంది. 1970/72వ సంవత్సరంలో ఒంగోలు కేంద్రంగా ఏర్పడ్డ ప్రకాశం జిల్లా, గత 52 ఏళ్లుగా భిన్న మనస్తత్వాల భావోద్వేగంతో విభిన్న సంస్కృతుల సమ్మేళనానికి లోనుకాకపోవటం ఒక విధంగా చెప్పాలంటే జిల్లా సమన్వయానికి, సమగ్రాభివృద్ధికి నోచుకోలేదు. ఈ మధ్యనే జరిగిన జిల్లా పునర్విభజన ఈ ప్రక్రియను దారి మళ్ళించిందనే చెప్పక తప్పదు.
నది పొడవునా నడవాలన్నది నా స్వప్నం
నేను ప్రకాశం జిల్లా కల్టెర్‌గా వున్న రోజుల్లో, ఈ నది పుట్టిన చోటనుండి సముద్రంలో కలిసే వరుకు నీటితో పాటే నడక సాగించాలన్న కోరిక బలంగా వుండేది. వీలు చిక్కనప్పుడల్లా. గుండ్లకమ్మ నదీ పరీవాహక ప్రాంతాల్లో ప్రయాణించటం నాకెంతో ఆనందాన్నిచ్చేది. ఒకే తూరి మూడు జిల్లాల కలెక్టరుగా మురిసి పోవటం నా వంతు.
ప్రకాశం జిల్లాలో చిన్న తరహా నదులు, వాగులు, చెరువులు, వంకలు విస్తరించి వున్నాయి. పెద్ద నదులు లేవు. గుండ్లకమ్మ, మసి, మన్నేరు, పాలేరు నదులు ముఖ్యనదులు. రాళ్లవాగు, తీగతేరు, కండ్లేరు, దువ్వలేరు, గుండ్లకమ్మ ఉపనదులు. కొండలకు ఆవల (వెలుపలవున్న మరి, మన్నెరు, పాలేర్లు , ‘వెలిగొండలు’గా ప్రశస్తి. గిద్దలూరు ప్రాంతంలో నల్లమల కొండలకు ఆవల (వెలి) వున్న మసి, మన్నేరు, పాలేర్లు ‘వెలుగొండ’గా ప్రశస్తి. గిద్దలూరుప్రాంతంలో నల్లమల కొండలు, కనిగిరి, పొదిలి, కొండేపి, కందుకూరు ప్రాంతాల్లోని కొండకోనల్ని వెలికొండలని, ఒంగోలు, అద్దంకి కొండల్ని చీమకుర్తి కొండలని పిలుస్తారు స్థానికంగా. నల్లమల కొండలు, వెలికొండలు కర్నూలు, కడప జిల్లా నుండి ప్రకాశం జిల్లాను వేరు చేస్తాయి.
కార్తవీరార్జనుడు వేట
పూర్వం కార్తవీరార్జునుడు అనే రాజు వేట కోసం నల్లమల అడవుల్లోకి వస్తాడు. దాహం తీర్చుకోడానికి ఎక్కడ వెదికినా నీరు దొరకుదు. చివరికి సురభేశ్వరి కోనలో తపస్సు చేసుకుంటున్న జమదగ్ని ఋషి ఆశ్రమానికి వస్తాడు. ఋషి తన కోసం దాచుకున్న రెండు కుండల నీళ్లని రాజుకిచ్చి, తను తిరిగి చూడకుండా వెళ్లమంటాడు. దారిలో ముని మాటలు ఉల్లంఘించి కావడి క్రిందపెట్టటంతో రెండు కుండలు పలిగిపోయి, ఆ నీళ్లు రెండు కాలువలుగా ప్రవహిస్తాయి.ఆ ప్రదేశమే గుండ్ల బ్రహ్మేశ్వరం. వీటిలో పెద్ద కాలువ గుండ్రాళ్ల మీద ప్రవహించినందున దానిపేరు ‘గుండ్రాళ్ల కమ్మ’ అని, రెండవ చిన్న కాలువ జమ్ముపొదల మధ్యగా ప్రవహించినందువల్ల దానిపేరు ‘జంపలేరు’ అని పిలుస్తారు. మరోనీటి కాలువ ‘సాగిలేరు’ కూడా ఈ ప్రదేశంలోనిదే. కట్టుకథ కంచికి చేరినా, ఈ కాలువలు ఈ ప్రాంతాన్ని కనువిందు చేస్తాయి.
‘నెమిలిగుండం’ వద్ద జలపాతంగా మారి, కంబం చెరువులో కలుస్తుంది గుండ్లకమ్మ. దారిలో ఏడుగుండాలు (సరస్సులు)గా ఏరుపారి ప్రకృతి మనోహర దృశ్యంగా కనువిందు చేస్తుంది గుండ్లకమ్మ. ఈ గుండాల దగ్గర ప్రతి సవత్సరం ఉత్సవాలు, జాతర్లు జరుగుతాయి. ఈ ప్రాంతపు ఆచార, వ్యవహారాలకు, సాంస్కృతిక వైభవానికి ప్రతిబింబాలు ఈ వేడుకలు. ప్రక్కనే వెలసిన ‘రంగస్వామి’ ఆలయం స్థానికుల సర్వస్వం. మరీ ముఖ్యంగా చెంచు(జాతు)లకు ఆరాధ్యదైవం. శనివారం ఒక్కరోజే భక్తులు వెళ్లి పూజలు చేసేది.క్రూరమృగాల భయం.
150 సంవత్సరాల చరిత్ర
దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవళం 1946లో స్థానికులు ఇచ్చిన చందాలతో పునర్మించనైనది. పూర్వం మయూరి మహర్షి తపస్సు చేసినచోటు. ఆ మహర్షి చెంచుల ఆరాధ్యదైవం. నెమలి పింఛాలు ధరించి పండుగ దినాల్లో చెంచులు భిక్షకులగా అవతారం ఎత్తుతారు భక్తిశ్రద్ధలతో.
రంగస్వామి మహిమలు కోకొల్లలు. చుట్టుపక్క ప్రాంతాల్లో దొంగతనం జరిగితే, అనుమానించబడిన వ్యక్తిని ఈ ఆలయం వద్దకు తీసుకొస్తారు. వాడు దొంగ అయితే, తేనెటీగలు కుట్టి చంపేస్తాయి. దొంగకాకపోతే ఏమీ చేయవవన్నది భక్తుల విశ్వాసం.
తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద చెరువు కంబం చెరువు. గుండ్లకమ్మ ప్రవాహంతో పునీతమైన ఈ చెరువులో ఉత్తరాన జంపలేరు, దక్షిణాన సాగిలేరు కలిసి, ఈ ప్రాంత రైతులకు వరప్రదాయినిగా ప్రసిద్ధి. కంబం చెరువు సుమారు 10 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది. చెరువు మధ్యలో చిన్న కొండలు.
విజయనగర రాజుల కాలంలో రెండు కొండల్ని కలుపుతూ ఓ ఆనకట్ట. దీన్నే ‘వరదరాజమ్మ’ కట్ట అంటారు స్థానికులు. కృష్ణదేవరాయల రాణుల్లో ఒక్కరైన వరదరాజమ్మ దీని నిర్మాణానికి ఎంతో ధన సహాయం చేసిందని ప్రజల నమ్మకం. అందుకే ఆమె పేరున చిన్న ఆలయం చెరువు కట్టపై దర్శనమిస్తుంది ఈనాటికీ. ఒకనాటి రాత్రి రాయలవారు పడక గదిలో వుండగా తన భార్య అయిన వరదరాజమ్మ మొ లలో ఒక చురకత్తిని చూశాడట. ఆమె తనను హత్య చేయడానికి ఆ కత్తిని మొలలో దోపుకుందని భ్రమపడి రాణిని దేశ బహిష్కరణ చేశాడట. వాస్తవానికి వరదరాజమమ్మ వంశాచారం ప్రకారం కొన్ని ప్రత్యేక దినాల్లో కత్తిని ధరించే ఆచారం ఉందట. నిజం తెలసుకున్న రాయలు ఆమెకు పెద్ద ఎత్తున ధనమిచ్చి ఆమె చేతనే కంబం చెరువు కట్టించాడని నమ్మిక. కానీ దీనికి ఏ విధమైన చారిత్రక ఆధారాలు లభించలేదు.
ఇసుక దిబ్బలు ఇబ్బడిదిబ్బడి
కంబం చెరువు అలుగు నుండి బయటపడ్డ గుండ్లుకమ్మ, చింతలపాలెం, ఔరంగాబాద్ గ్రామాల మీదుగా ‘లంజకోట’అనే గ్రామం వద్ద గులకబాటలో ప్రవహిస్తుంది. నదికి రెండు వైపులా వున్న గ్రామాల్లో ఇసుక దిబ్బలు ఎక్కువ. వీటికి మరో పేరు లంజ దిబ్బలు.సభ్య సమాజం లో ఈపేర్లు కొంత ఎబ్బెట్టుగా ఉంటాయి. ఏ ప్రియురాలి కోసమో ప్రియుడు కట్టించిన కోట అయి ఉంటుంది. ఈ పరిసరాల్లో పాడుబడ్డ బౌద్ధారామాలు కూడా వుండేవట.
ఇదే క్రమంలో చందవరం గ్రామ పరిసర ప్రాంతాల్లో గుండ్లకమ్మనదీలోయ వంపు తిరుగుతుంది. వినుకొండ వరకు ఉత్తర-తూర్పు దిశలో ప్రవహించే నది సౌత్-ఈస్ట్ దిశకు మారుతుంది. ఈ ప్రదేశం దాదాపు 20 కిలోమీటర్ల పొడవున విశాలంగా విస్తరించి వుంటుంది. ఈ పరిసర ప్రాంతాల్లో పురాతనమైన మెగాలిథిక్ బరియల్స్ (రాకాసిగూళ్లు) పురాతత్వ తవ్వకాల్లో వెలుగులోకి వచ్చాయి. ఈ రాళ్లగుట్టలు పూర్వీకుల సమాధులై వుండవచ్చు. పిరమిడ్‌ఆకారం లో ఉండే ఈ సమాధులు మన పూర్వీకులు ఎంతో ఎత్తుగా, లోతుగా వుండేవారని కొలతలు స్పష్టం చేస్తాయి.. తమకు ఎప్పుడైనా ఒళ్లు నొప్పులు, చెవిపోటు వస్తే రాకాసి గూళ్లనుకాళ్లతో తొక్కితే నయం అవుతుందని ఇక్కడివాళ్ల నమ్మకం.
నదీతీరం వెంబడి ఐనవోలుగ్రామం సమీపంలో వున్న రైల్వే బ్రిడ్జి వద్దగుండ్లకమ్మ రైల్వే స్టేషన్. నదిలో రాతిగుట్టలు ఏర్పడి ప్రకృతి అందాల్ని ఇనుమడిరపజేస్తాయి. ఈ ప్రాంతాన్ని ‘అనేశ్వరం’ మెట్ట అని కూడా అంటారు. ఈ ప్రదేశంలో పూజలు చేస్తే, యువతులు త్వరగా రజస్వల అవుతారని, నదీమతల్లి ఆశీర్వాదంతో పెళ్ళిల్లు త్వరగా అవుతాయని నమ్మకం.
గోకినకొండ, బొగ్గుల కొండ తీరం వెంబడి నది ప్రవహించి ఒకచోట పెద్దగుళాయి తిరగటం, పక్కనే శింగరకొండ ప్రత్యక్షమవుతుంది.
గుండ్లకమ్మ నది సరిహద్దులుగా అద్దంకి, చందలూరు, పంగ్గలూరు, నిడమనూరు గ్రామాల్ని రెడ్డిరాజుల ఏలుబడిలో అద్దంకి,అమ్మనాబ్రోలుసీమలుగా వ్యవహరించబడేవి. కవిత్రయంలో ఒకరైన ఎర్రాప్రగడ ఇక్కడివాడే అంటారు. గుండ్లకమ్మని గూర్చిన వర్ణనలు ఖచ్చితంగా ఆయన కవిత్వంలో వుండితీరాలి.
అద్దడు, అంకి కలిపితే అద్దంకి
అద్దడు, అంకి అనే యువ జంట వలన ఈ ఊరికి అద్దంకి అని పేరొచ్చిందంటారు. ఆనాటి చరిత్రకు ఆనవాలుగా వున్న కోటపైప చాలాకాలం క్రిందటే ఇళ్ళు కట్టుకున్నారు. రాణిగారి సత్రం ఊరి మధ్యలో వుంటుంది. బ్రిటీషు రాణి కట్టించారట. ప్రభుత్వ పశువుల ఆస్పత్రి నడుస్తుందిపుడు. వినాయక మందిరం అతి ప్రాచీన కట్టడం. దీన్ని వేయి స్తంభాల గుడి అని కూడా అంటారు. వేయిస్తంభాలు లేవు అని వాదించేవాళ్లు గాడిదల కడుపున పుడతారని ఒక శాసనం వుండేదట. వాస్తవానికి ఎక్కువ స్తంభాలు లేవు ఇక్కడ.
నదీ ప్రవాహం మణికేసరం కొండ వద్ద పెద్ద మలుపు తిరుగుతుండటం విశేషం. సుందరమైన క్డొండ మీద చిన్న ఆయలం. ఇది యాత్రా స్థలం కూడా. ఊళ్ల్నోఉన్న సంపన్న గృహస్థులు మానికలతో ధనాన్ని ఇచ్చి ఈ ఆలయాన్ని నిర్మాణం కావించుట వల్ల ఈ ఊరికిమణికేసరం అని పేరొచ్చింది.
అనమనలూరు గ్రామం నదికి కొద్ది ఎడంగా ఉంటుంది. ఈ ఊరు ఒకప్పుడు గుండ్లకమ్మ ఒడ్డునే వుండేది. ఒక మునీశ్వరుడి శాపం వల్ల అక్కడ నుండి ఉత్తరానికి జరపడింది మూడుసార్లు. పూర్వం ఒక మునీశ్వరుడు నది ఒడ్డునతపస్సు చేసుకుంటూ వుండేవాడు. అన్నం వండుకోడానికి పొయ్యి కనిపించక అక్కడే వున్న ఒక చెట్టు మొదలులో మూడు రాళ్ళురాజేసి అన్నం ఉడికేలోపు స్నానానికి వెళ్లాడట. ఇంతలో ఆ చెట్టు స్వతదారడుచెట్టు తగలబడిపోతుందని అన్నపు గిన్నెను తన్నేస్తే, అన్నం కాస్తా మట్టిపాలైందట. కోపోద్రిక్తుడైన ముని గ్రామస్థుల్ని మీరు వండుకున్న అన్నం పాత్రల్లోకి ఇసుక వస్తుందని శపించాడట. ఆ రోజు నుండి గ్రామంలోని ఇండ్లలో ఉడుకుతన్న అన్నంలో చారెడు ఇసుక రావటం మొదలయిందట. ఈ ఉపద్రవం నుండి బయటపడటానికి నివాసాలు ఎగువన ఉన్న ప్రస్తుత గ్రామంలోకి మార్చారట. ఆ విధంగా శాప విముక్తులు అయ్యారట గ్రామస్తులు. వాస్తవానికి కొండకు తూర్పువైపు గ్రామం ఉండటంతో, పడమట గాలిఇసుక రేణువులు గ్రామమంతా పడేవట. అందుకే నదులకు ఉత్తరాన ఉన్న గ్రామాల్లో ఇసుక మేటలు సహజం. ఇలాంటి భౌగోళిక వైఫరత్యాల వల్ల అలాంటి గ్రామాల్ని విడిచి వేరే దగ్గర ఇళ్లు కట్టుకుంటారు.
యల్లంపల్లి వద్ద గుండ్లకమ్మ బ్రిడ్జివుంది. దాన్ని దాటుకుంటూ పోతే కరువదిరైలు వంతెన. ఉలిచి గ్రామం చెంతనే నది మీద ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ పధకాలు, చేపల చెరువులు ఎన్నో అగుపడతాయి. గుండాయిపాలెం సమీపాన సముద్రపు అలల ఘోష. రేవులో నాటు పడవలు, పల్లెకార్లసందడి.
ఇలా చెప్పుకుంటూపోతే, గుండ్లకమ్మ నదీమ తల్లి సంస్కృతి, వైభవం తనివి తీరా ఆస్వాదించదగ్గ మధురానుభూతి. గుండ్ల బ్రహ్మేశ్వరంలో పుట్టిన తీపినీరు ఉప్పునీరుగా రూపాంతరం చెందటం ప్రకృతి ధర్మం కాక మరేమిటి?
(రచయిత దాసరి శ్రీనివాసులు గతంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ గా పనిచేశారు)
Very Very historical and heart touching story.
As Thurimella and Giddalur or my birth and maternal places , this is very close to my heart, recollecting my childhood memories.
….NAMSTHE….