గుజరాతీ దళిత రచయిత అమృత్ లాల్ మక్వానా
11 జులై 2016న ఒక చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచినందుకు నలుగురు దళితులను పట్టపగలు బహిరంగంగా కొట్టి ఊరేగించారు. ఈ ఘటన గుజరాత్ లోని ఊనాలో జరిగింది. ‘‘గోరక్షణ’’ పేరుతో దళితులను అత్యంత క్రూరంగా హింసించడంతో గుజరాత్ రాష్ట్రమంతటా నిరసనలు పెల్లుబికాయి. గో సంరక్షణ – చేసేవారికి జంతువిలువలు తప్ప, మానవీయ విలువలతో పనిలేనట్లుంది. 31 జులై 2016న అహ్మదాద్ లో దళిత మహా సమ్మేళనం జరిగింది. వేలాది మంది దళితులు పాల్గొని, ‘‘ఇకముందు చనిపోయిన పశువుల శరీరాలను తొలగించరాదని, పాకీ పని చేయరాదని’’ దళితులంతా ప్రతినబూనారు. ఊనాలో పాశవిక దాడికి గురయినవారికి న్యాయం జరగాలని ‘ఊనా దళిత అత్యాచార లడత్ సమితి’ డిమాండ్ చేసింది. ఈ సమితికి మేవాని అనే యువ అడ్వొకేట్ కన్వీనర్ గా ఉన్నారు. ఆయన దళితుల కేసుల్ని ఎన్నో కోర్టుల్లో ఒక్క చేత్తో లాక్కొస్తున్నారు.
ఈ సమితికి ప్రగతిశీల సంఘాల పూర్తి మద్దతు లభించింది. సబర్మతిలోని అచర్ బస్ డిపో దగ్గర ప్రారంభమైన ఊరేగింపు గ్రామాల గుండా నాలుగు వందల కి.మీ. పొడవునా సాగి మహోధృత రూపం దాల్చింది. కనీవినీ ఎరగని రీతిలో ఊనా దళిత పోరాటం రూపుదిద్దుకుంది. 2017లో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, బిజెపి ప్రభుత్వానికి ఒక తీవ్రమైన హెచ్చరిక చేయాలని దళిత ఫోరం నిశ్చయించుకుంది. ఇప్పటిదాకా చేస్తూ వచ్చిన వృత్తి మానేస్తున్నామని వారు బాహాటంగా ప్రకటించారు. జీవనభృతికోసం తమకు ఇతర వృత్తుల్లో, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రతిచోటా దళితులకు రక్షణ కల్పించడం తమ వల్ల కావడం లేదని ప్రత్యక్షంగా ఒక డీఎస్పీ స్థాయి అధికారి మీడియాకు చెప్పారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఊహించుకోవచ్చు. దళితులు మార్షియల్ఆర్ట్స్ నేర్చుకుని తమను తాము రక్షించుకునేందుకు ప్రభుత్వమే తగిన సహాయం చేయాలని ఆయన సూచించారు కూడా! పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్నవారే ఈ దళితహింసను భరించలేకపోతున్నారన్నది వాస్తవం! ప్రధాని మోదీ స్వంత రాష్ట్రంలోనే ఉద్యమాలు ఊపందుకోవడం…లోగడ ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ‘గుజరాత్ అల్లర్లు’ జనం మరచిపోలేదనిపిస్తోంది. ఆయన గంభీరోపన్యాసాలు దేశంలోని అసంతృప్తి సెగల్ని చల్లార్చలేకపోతున్నాయి. అందుకే ఇప్పుడక్కడ దళితుల ముస్లింల ఐక్యత వర్థిల్లాలన్న నినాదాలు నింగినంటుతున్నాయి.
ఈ నేపథ్యంలోంచి అమృత్ లాల్ మక్వానా అనే గుజరాతీ రచయిత రాష్ట్ర స్థాయిలో తనకు లభించిన గౌరవాన్ని వెనక్కు పంపి, అవార్డు వాపస్ చేసినవారిలో చేరిపోయారు. 2012-13 సంవత్సరంలో తన రచన ‘ఖరపత్ ను లోక్ సాహిత్య’కు గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ‘దాసీ జీవనశ్రేష్ఠ దళిత సాహిత్య కృతి’ అనే సాహిత్య అవార్డునూ, దానితో లభించిన రూ.25 వేల మొత్తాన్నీ అహ్మదాబాదు జిల్లా కలెక్టర్ కు సమర్పించారు. దానితో పాటు గుజరాత్ (అప్పటి) ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ కు రాసిన ఒక ఉత్తరం కూడా ఆయన అందజేశారు. అందులో తన ఆవేదనను తెలియజేస్తూ, దళితులను హింసించడం ఆపాలని విన్నవించుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి దళితులంటే సానుభూతి లేదని, ప్రభుత్వం అండదండలున్నవారు పనిగట్టుకొని దళితులను హింసిస్తున్నారనీ ఆయన నిరసన తెలియజేశారు. దేశంలో హిందూత్వ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహిస్తున్నందుకు నిరసనగా 2015లో దేశంలోని లబ్దప్రతిష్టులయిన సాహితీవేత్తలు, శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, నాటక-సినీ కళాకారులు తమ తమ అకాడెమీ అవార్డులు- పద్మ అవార్డులూ వాపస్ చేసిన దానికి – అమృత్ లాల్ మక్వానా చర్య కొనసాగింపుగా ఉంది. ఈయన కాంగ్రెస్ వాది.
అమృత్ లాల్ మక్వానా గుజరాతీ సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ తీసుకుని, గుజరాత్ విద్యాపీఠ్ నుంచి బి.ఇడి డిగ్రీ తీసుకున్నారు. గుజరాత్ విద్యాపీఠ్ మహాత్మాగాంధీ నెలకొల్పిన విశ్వివిద్యాలయం. మక్వానా మూడు పుస్తకాలు ప్రకటించారు. ఒక కథా సంపుటి, దళిత జానపద గీతాల సంపుటి మరొకటి, దళితుల సంఘర్షణ ఆధారంగా మరో పుస్తకం ప్రకటించారు. ఇందులో దళిత జానపద గీతాల సంపుటికే ఆయనకు గుజరాత్ రాష్ట్ర పురస్కారం లభించింది. ప్రస్తుతం అమృత్ లాల్ మక్వానా సురేందరనగర్ జిల్లా లోని వాధ్ వాన్ ట్టణంలో ఉంటూ, అక్కడి ఒక విద్యాసంస్థలో కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు. దేశంలో ఏలినవారి అసహనం, ఏలినవారి అండదండలున్నవారి అసహనం విపరీతంగా పెరిగిపోతోంది. నిజమే! ఫలితంగా 2015లో ఎంతోమంది సాహితీస్రష్టలు సాహిత్య అకాడెమీ అవార్డులతో పాటు ఇతర అవార్డుల్ని ప్రభుత్వానికి తిప్పి పంపిన విషయం తనకు తెలుసునని, అయితే తను మాత్రం తన కళ్లెదుట రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న మారణకాండకు నిరసనగానే అవార్డు వాపస్ చేస్తున్నట్లు మక్వానా ప్రకటించారు.
గిర్ సోమనాథ్ జిల్లాలో మోటాసమాదియాల గ్రామంలో దళితులపై జరిగిన హింస ఎంతో దురదృష్టకరం. అలాంటి చర్యలే గుజరాత్ అంతటా క్రమం తప్పకుండా జరగుతూ ఉంటే మనసు ఉడికిపోదా? పదహారు మందిని అరెస్ట్ చేశారు. యాభైమందిని నిర్దాక్షిణ్యంగా చచ్చేట్లు కొట్టారు. అధికారంలో ఉన్నవారు ఏళ్లకేళ్ళుగా దళితుల్ని హింసిస్తున్నారని చెప్పడానికి ఎన్నెన్నో ఉదాహరణలున్నాయని…అన్నారు రచయిత అమృత్ లాల్. కొన్నేళ్ళ క్రితం సురేంద్రనగర్ జిల్లాలో తంగద్ టౌన్ లో జరిగిన పోలీస్ ఫైరింగ్ లో ముగ్గురు దళిత యువకులు చనిపోయారు. చనిపోయినవారి కుటుంబ సభ్యులు తమకు న్యాయం జరుగుతుందేమోనని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు రచయిత అమృత్ లాల్ మక్వానా వెలిబుచ్చిన ఆవేదనలో ఎంతో వాస్తవముందనిపిస్తుంది.
ఇతర సంస్కృతులు, ఇతర ఆలోచనా ధోరణులు ఉండకూడదు – అన్న అసహన విధానం మంచిది కాదు. దేశం ఇప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇతర మతస్థుల విశ్వాసాల్ని, ఆహారపుటలవాట్లను పరోక్షంగానో, ప్రత్యక్షంగానో దెబ్బతీయడం నిరంకుశత్వమే. ముఖ్యంగా ఆలోచనాపరులైన రచయితల్ని హత్య చేయడమంత కిరాతకత్వం మరొకటి ఉండదు. పాఠ్యాంశాల్ని మార్చేసి, వాస్తవాల్ని మరుగుపరిచి, భావిభారత పౌరుల్ని ఎలా తయారు చేయాలనుకుంటున్నారు? ఈ దేశంలో ఏరాజకీయ పార్టీకైనా అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. వారికి ఆ హక్కుంది. ఇలా అధికారంలోకి వచ్చిన ప్రతివారూ అన్నింటినీ తమకు అనుగుణంగా మార్చుకుంటూ పోతే ‘‘భిన్నత్వంలో ఏకత్వం’’ ఎక్కడుంటుందీ? ఇప్పుడు అధికారంలో ఉన్నవారు తమకు కావాల్సిన ఏకత్వం కోసం ప్రయత్నిస్తే, ఆ తరువాత వచ్చేవారు, వారు కావాలనుకున్న ఏకత్వంకోసం వారు తాపత్రయ పడతారు కదా? దేశంలోని వైవిధ్యం దెబ్బతిని, అస్థిత్వాన్ని పోగొట్టుకోదా? పైగా మనది ప్రజాస్వామ్యమని గొప్పలు పోవడమెందుకూ? ఈ అసహన భారతంలో ఈ బలవంతపు, దౌర్జన్యపు ‘ఏకత్వం’ మనల్ని ఎక్కడికి తీసుకుపోతుందీ?
ఏ విషయంలోనైనా, ఏ కారణం వల్లనైనా ప్రజల్లో అసహనం పెరిగితే, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పట్టించుకుని పరిష్కరించాలి. ప్రజల్లో అసహనం ఎందుకు పెరుతోంది? అందుకు మూలకారణాలేమిటీ? అని కనుక్కోవడం ప్రభుత్వాల బాధ్యత! ప్రజాఉద్యమాలు, మేధావులు బిరుదుల్ని వెనక్కి పంపడం, రచయితల అవార్డు వాపసీ వంటి చర్యలు దేశంలలో ఎందుకు చోటు చేసుకుంటున్నాయన్నది సమీక్షించుకుని, తగిన చర్యలు తీసుకోవడం అధికారంలో ఉన్నవారి బాధ్యత! అంతే కాని, కంచె చేను మేసిన విధంగా ప్రజలు అసహనవాదులు, తామే శాంతికాముకులమని…అధికార ప్రతినిధులు తమకు తామే ప్రకటనలు విడుదల చేసుకోవడం విడ్డూరం.
ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రభుత్వాలకే ప్రజల సర్టిఫికేట్ అవసరం అవుతుందన్నది గర్తుపెట్టుకోవాలి!
(దేశంలో చారిత్రాత్మక అవార్డు వాపసీ సంఘటనకు ఐదేళ్ళు.)