హార్థిక్ పాండ్యా అద్భుత ఆల్ రౌండ్ ప్రదర్శన
- పేలవంగా ఆడి ఓడిన రాజస్థాన్ రాయల్స్
- బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లోనూ రాణించిన హార్థిక్ పాండ్యా
గుజరాత్ టైటన్స్ తొలిసారిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ను గెలుచుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ పై సునాయాసంగా విజయం సాధించి టాటా ఐపీఎల్ ట్రాఫీని కైవసం చేసుకున్నారు.
అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఆదివారం రాత్రి టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదటి బ్యాట్ చేయాలని నిర్ణయించుకున్నది. ఓపెనర్స్ ఇద్దరూ కొంత సేపు ఆడి పరుగులు చేశారు కానీ తర్వాత వచ్చినవారు కుప్పకూలిపోయారు. మొత్తం ఇరవై ఓవర్లలో 130 పరుగులు చేశారు. గుజరాత్ టైటన్స్ గెలవాలంటే 131 పరుగులు చేయాలి. ఆ లక్ష్యాన్ని అవలీలగా ఏడు వికెట్లు చేతిలో ఉండగానే, 11 బంతుల ఇంకా వేయవలసి ఉండగానే సాధించారు. శుబమన్ గిల్ అజేయంగా 45 పరుగులు చేయగా, డేవిడ్ మిల్లర్ పందొమ్మిది బంతులలో 32 పరుగులు సాధించి గుజరాత్ టైటన్స్ అద్భుత విజయానికి తోడ్పడ్డాడు. గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా బౌలింగ్ లో మెరుపులు మెరిపించి రాజస్థాన్ రాయల్ స్కోరును 130కే పరిమితం చేశాడు. పాండ్యా 17 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. సాయి కిశోర్ కూడా రెండు వికెట్లు తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కూడా బాగానే చేశాడు. 30 బంతులలో 34 పరుగులు సాధించాడు.
రాజస్థాన్ రాయల్స్ తరఫున జోస్ బట్లర్ యథావిధిగా బాగానే అడాడు. 39 బుంతులలో 39 పరుగులు చేశాడు. భారత్ గర్వించదగిన బ్యాటర్లూ, కెప్టెన్లూ అయిన ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగడం విశేషం. రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబయ్ ఇండియన్స్ అయిదు విడతల టైటిల్ గెలుచుకున్నది. ఎంఎస్ ధోనీ నాయకత్వం చైన్నై సూపర్ కింగ్స్ నాలుగు విడతల టైటిల్ గెలుచుకున్నారు. ధోనీ పది ఫైనల్స్ లో ఆడగా, రోహిత్ ఏడు ఫైనల్స్ లోనూ, విరాట్ కోహ్లీ మూడు ఫైనల్స్ లోనూ ఆడారు. ఈ ముగ్గురిలో ఒక్కరు కూడా ఈ సారి ఫైనల్ జరగడం విచిత్రం.
ఈ సంవత్సరం ఐపీఎల్ సిరీస్ ప్రారంభం కావడానికి ముందు ఫైనల్ లో గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ ఆడతారని ఎవ్వరూ ఊహించి ఉండరు. టేబిల్ చివరిలో ముంబయ్ ఇండియన్స్ ఉంటారని కూడా అనూహ్యం. రెండు మాసాల కిందట ప్రీమియర్ లీగ్ పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి ముగ్గురు హీరోలూ –ధోనీ, కోహ్లీ, శర్మ – చతికిల పడగా గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా రాణించాయి. మొదటి రెండు స్థానాలలోనూ ఈ రెండు జట్లే నిలిచాయి. ఫైనల్ లో ఈ రెండు జట్లూ అడడంలో అసాధారణమేమీ లేదు.
ఐపీఎల్ సిరీస్ లో ఇంతవరకూ అద్భుతంగా రాణించిన ముంబయ్ ఇండియన్స్ మొదలే నాకౌంట్ అయిపోగా, మొట్టమొదట రంగంలోకి దిగిన గుజరాత్ టైటన్స్ టైటిల్ గెలుచుకోవడం విశేషం. ‘క్రికెట్ ఈజ్ ఏ గేమ్ గ్లోరియస్ అన్ సర్టెనిటీస్’ (క్రికెట్ ఆట అద్భుతమైన అనూహ్యాలతో కూడుకున్నది) అన్న మాట అక్షరాలా నిజమని నిరూపించారు గుజరాత్ టైటన్స్.