Saturday, December 21, 2024

భరతుడినీ, సైన్యాన్నీ చూసి గుహుడికి గుబులు

రామాయణమ్ 48   

శ్రీ రాముని మరల అయోధ్యకు రప్పించి పట్టాభిషిక్తుడిని చేయటమే! అని మనసులో దృఢపరచుకొన్న భరతునికి ‘‘వశిష్ఠుల వారు రాజసభలో ఉన్నారు. మిమ్ములను రమ్మనమని అన్నారు’’ అనే కబురు వచ్చింది.

రాజసభాప్రాంగణంలో సకలసంభారాలతో సిద్ధంగా ఉన్నారు మహర్షి. భరతుని చూడగనే “నాయనా! నీతండ్రీ ,అన్నగారు ఇచ్చిన ఈ రాజ్యాన్ని స్వీకరించి ధర్మబద్ధంగా పరిపాలన సాగించు” అని  పలికి భరతుడి ఆమోదం కోసం ఎదురు చూశారు.

Also read: రాముణ్ణి వనవాసం మాన్పించి అయోధ్యకు తీసుకురావాలని భరతుడి నిర్ణయం

 ఆ మాట వినగానే  భరతుడు కనుల నీరునింపుకొని దోసిలి ఒగ్గి “మహాత్మా రాముని రాజ్యమిది! ఇక్ష్వాకులలో ధర్మము తప్పి నడిచినవారు ఎవరైనా ఉన్నారా! ధర్మాత్ముడైన దశరథుడికి పుట్టినవాడు చేయవలసిన పనేనా ఇది! దశరథుడి కొడుకు ఇంకొకరి సొత్తును అపహరిస్తాడా?

నేను, ఈ రాజ్యము రాముడిసొత్తు. మాలో పెద్దవాడు  ,దిలీప , నహుషులతో సమానుడూ అయిన రామునకే ఈ రాజ్యముపై అధికారము. వేరెవ్వరికీలేదు.

Also read: భరతుడి వ్యథ, కౌశల్య సమక్షంలో ప్రమాణాలు

‘‘నా తల్లి చేసిన పాపకార్యము నేనెన్నటికీ అంగీకరించను. రాముడిని అనుసరించటమే నాకు తెలిసినది. ఏ కారణము చేతనైనా అన్నగారిని తీసుకొని రానట్లయితే నేనుకూడా లక్ష్మణునిలా అడవిలో ఉండిపోతాను. మార్గములు ఏర్పరచేవారు, రక్షించేవారు, తదితరులంతా నాచేత ముందుగనే పంపబడినారు’’ అని పలికి సుమంత్రునివైపు తిరిగి, వెంటనే రామునివద్దకు బయలుదేరడానికి కావలసిన ఏర్పాట్లు చేయమని, సైన్యంతో సహా  సిద్ధం కావాలని ఆదేశించాడు.

భరతుడి ఆజ్ఞ విని సుమంత్రుడు ఉత్తమాశ్వాలు పూన్చిన రధం సిద్ధం చేసి ఉంచాడు.

పిమ్మట ప్రాతఃకాలమునందే లేచి శ్రేష్ఠమైన రధమెక్కి బయలుదేరాడు భరతుడు. ఆయన వెంట అయోధ్యలోని అధికారగణమంతా బయలుదేరింది. చతురంగ బలాలు కదిలాయి. అయోధ్య అంతా కదిలింది. అందరి మనసులో ఒకటే లక్ష్యం. రాముడిని త్వరగా చూడాలని. మనసుతో సమానంగా పరిగెత్తాలని కోరిక.

Also read: తండ్రి, సోదరుల గురించి తల్లిని ప్రశ్నించిన భరతుడు

అలా ప్రయాణం చేస్తూ గంగ ఒడ్డుకు చేరుకున్నారంతా.

ఇంత సైన్యము గంగ ఒడ్డుకు ఎందుకు వచ్చింది? కారణమేమై ఉంటుంది?  అనుమానం వచ్చింది గుహుడికి.

ఆ రధము మీద కనపడే ధ్వజాన్ని బట్టి చూస్తే ఇది భరతుడి సేనావాహిని అని తేటతెల్లమవుతున్నది.

భరతుడు ఇప్పుడెందుకు వచ్చినాడు ? ఇక్కడున్న పల్లెలోని జనులను బంధించటానికి రాలేదుకదా! మనలను చంపటానికి కాదుకదా! లేక రాజ్యాన్ని పూర్తిగా నిష్కంటకం చేసుకోవాలనే ఉద్దేశంతో రాముని చంపివేయటానికి కాదుకదా!

‘‘రాముడు నాకు ప్రభువే కాదు, నాకు మిత్రుడు కూడా. ఆయన ప్రయోజనం కాపాడటానికి అందరూ సన్నద్ధం కండి’’ అని సేనను ఆజ్ఞాపించాడు.

Also read: భరతుడి పీడకల

‘‘ఐదువందల నావలలో ఒక్కొక్క దానిపై నూర్గురు యోధులు కవచధారులై సిద్ధంగా ఉండండి’’ అని ఆదేశాలు ఇచ్చాడు.

“రాముడి విషయంలో భరతుడికి ఏ విధమైన దుష్టబుద్ధిలేదని తేలిన తరువాతనే అతని సేన గంగను సుఖంగా దాటగలుగుతుంది”అని పలికి అందరినీ సిద్ధం చేసి తాను మాత్రం భరతుడికి మత్స్యమాంసములు, తేనె పట్టుకొని వినయంగా ఎదురు వెళ్ళాడు.

సుమంత్రుడు ఆతనిని చూపి భరతునితో ‘‘ఈయన పేరు గుహుడు. నీ అన్నకు ప్రాణస్నేహితుడు. ఆయనను నీవుకలిసి మాట్లాడితే రాముని ఆచూకీ మనకు తెలుస్తుంది’’ అని చెప్పాడు.

అప్పుడు భరతుడు శీఘ్రంగా గుహుని తనవద్దకు తీసుకురమ్మన్నాడు.

గుహుడు వినయంగా భరతుడితో ‘‘మేమంతా నీకు లొంగి ఉండేవారము. ఇది నీదాసుని గృహము. దీనిలో నీ ఇచ్ఛానుసారము నివసింపుము’’ అని కోరినాడు.

‘‘నీకు నీసైన్యమునకు సరిపడునంత దుంపలు, పండ్లు, పచ్చిమాంసము, ఎండుమాంసము ఉన్నది! నీ సైన్యము సుఖముగా నేటిరాత్రికి భుజించి, విశ్రమించి రేపు బయలుదేరవచ్చును’’ అని వినయంగా పలికాడు గుహుడు.

Also read: దశరథ మహారాజు అస్తమయం

‘‘నా రాముని మిత్రుడా! ఇంత సేనకు నీవు ఒక్కడవే ఆతిధ్య మివ్వాలనుకొనే నీ మనస్సు ఎంతగొప్పది. మాకు ఒకటే కోరిక. ఈ గంగ దాటి భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాలి. మేమంతా సుఖంగా గంగదాటే మార్గం చూపించు’’ అని భరతుడు కోరాడు.

‘‘అదెంత పని మేమంతా నీ వెంట వచ్చి దాటించగలము. కానీ నాకొక సందేహమున్నది. ఇంత సేనతో నీవెందుకు బయలుదేరావు? రామునికి కీడు తలపెట్టే ఉద్దేశ్యమేమీ లేదుకదా!’’

అతని మాటలు విన్న భరతుడు, ‘‘రాముడికి కీడు తలపెట్టే దుష్కాలము ఎన్నడునూ రాకుండు గాక!  రాముడు నాకు తండ్రివంటి వాడు! (భ్రాతా! జ్యేష్టః పితృసమో). వనములో నివసిస్తున్న రాముని వెనుకకు తీసుకొని వచ్చుటకే వెళుతున్నాను. గుహుడా! మరొక విధముగా తలపకుము. ఇది సత్యము!.

భరతుడి మాటలువిన్న గుహుడి ముఖం వికసించింది.

‘‘ఆహా! అప్రయత్నముగా లభించిన రాజ్యలక్ష్మిని తృణప్రాయంగా విడిచిపెట్టే నీవంటివాడు నాకీ లోకంలో ఎవ్వరూ కనపడలేదు. నీ కీర్తి లోకంలో శాశ్వతంగా వ్యాపించగలదు’’ అని ప్రశంసించాడు

ఇంతలో రాత్రి అయ్యింది. అందరూ విశ్రమించారు.

రాముడి గురించిన ఆలోచనలతో భరతుడికి దుఃఖము చుట్టుముట్టింది. ఆ దుఃఖము  కార్చిచ్చయి కాల్చి వేయసాగింది. అన్ని అవయవాలనుండీ ధారాపాతంగా చెమట కారటం మొదలుపెట్టింది.

 ఆయన దుఃఖమే ఒక మహా పర్వతము. ఆలోచనలే ఆ పర్వతమందలి శిలలు. ఆయన నిట్టూర్పులు ధాతువులు. ఆయన దైన్యమే ఆపర్వతమందలి వృక్ష సముదాయము. ఆయనకు కలిగే శోకము,ఆయాసము ,మనస్తాపము దాని శిఖరములు. ఆయనకు కలిగిన మోహము అనంతమైన జంతుసముదాయము. ఆయనకు కలిగిన సంతాపము దానిమీదున్న వెదురుపొదలు.

ఏమి చేయాలో తోచటం లేదు భరతుడికి . నిదురరాదు. కనులు మూత పడటం లేదు.

దుఃఖము. దుఃఖము ఒకటే దుఃఖము.

మనశ్శాంతి కరవై అల్లల్లాడిపోతున్న భరతుడిని గుహుడు ఆ రాత్రి అంతా ఓదారుస్తునే ఉన్నాడు.

NB

చుట్టూ అష్టదిగ్బంధము చేసి వచ్చాడు గుహుడు.

రాముడికి హాని జరుగుతుందేమో అని ఏ మాత్రం అనుమానం కలిగినా భరతుడి సేన అంగుళంకూడా ముందుకు కదలలేదు.

అందుకే “రామస్య ఆత్మ సమో సఖా” అని గుహుడి గురించి మహర్షి వ్రాసినది.

Also read: దశరథుడిపై కౌసల్య హృదయవేదనాభరిత వాగ్బాణాలు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles