వారు నాకు అత్యంత ఆత్మీయులు, పితృతుల్యులు. వారింట్లో అనేకసార్లు కలిసి సినిమా రంగానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకున్నాను. ఆ మధ్య పొత్తూరి వెంకటేశ్వరరావుగారు – నేను ఒకసారి కలిసి వెళ్ళాము. మరోమారు, ఎన్టీఆర్ గురించి
కొన్ని విశేషాలను తెలుసుకోవడం కోసం కె రామచంద్రమూర్తిగారు – నేను కలిసివచ్చాము. అదే వారిని చివరిసారిగా కలవడం.
ఎంతటి జ్ఞానమో! అంతటి ఆత్మగౌరవం, అంతే మంచితనం వున్న మహానుభావుడు. మాట కొంత కరకుగా ఉన్నా… మనసు వెన్న. తెలుగు -ఇంగ్లిష్ఉభయ భాషల్లోనూరచనా వ్యాసంగం నెరపిన గొప్ప పాత్రికేయుడు. వారి సినిమా సమీక్షలు నిర్మొహమాటంగా ఉండేవి.
అవి చదివి సినిమాలకు వెళ్లినవారిలో నేనూ ఒకడిని.
‘హనుమాన్ చాలీసా’ ఎమ్మెస్ రామారావుగారికి
( తెలుగుసినిమా తొలి ప్లే బ్యాక్ సింగర్ కూడా ) ఒకదశలో శ్రీహరిగారు ఎంతో అండగా నిలుచున్నారు. శ్రీహరిగారిని సుదీర్ఘమైన ఇంటర్వ్యూ చేద్దామనుకున్నాను. ఎందుకో అది కుదరలేదు. శ్రీహరిగారికి సంగీతంపై ఉండే జ్ఞానం కూడా చాలా గొప్పది. అనేకమంది సినిమావారి భాగోతాలన్నీ తెలిసిన జ్ఞాని. పాలగుమ్మి విశ్వనాథంగారి ఆత్మకథకు అక్షరాలను అందించారు. ఇలాంటివి ఎన్నెన్నో చేశారు. సినిమాతోపాటు వర్తమాన రాజకీయ,సామాజిక పరిణామాలపై ‘హరివిల్లు’ శీర్షికతో చేసిన
వ్యంగ్య రచనలు ఆయన నిశిత పరిశీలనకు దర్పణంలా నిలుస్తాయి.
ఇటువంటి పాత్రికేయులు ఎప్పుడో ఒకసారి జన్మిస్తారు.
సినిమా పాత్రికేయంలో ఇంకా అరుదుగా ఉంటారు.
గుడిపూడివారికి సాటి గుడిపూడివారే!
సినిమా జర్నలిస్టు ప్రభు అక్షరాంజలి
గుడిపూడి శ్రీహరి గారి మరణంతో తెలుగు ఫిలిం జర్నలిజంలో ఒక శకం ముగిసింది . గొప్ప సంస్కార సంపన్నులు, మేధావి వర్గానికి చెందిన పాత్రికేయ ప్రముఖులు శ్రీహరి గారు . నేను ఫిలిం జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన కొత్తలో ఆయన నుండి పొందిన ప్రోత్సాహాన్ని, ఆయన చూపించిన ఆదరణను ఎప్పటికీ మర్చిపోలేను . పాత్రికేయ వృత్తిలోకి ఒక జూనియర్ వచ్చాడు అంటే అతని భుజం తట్టి ప్రోత్సహించవలసిన బాధ్యత సీనియర్స్ మీద ఉంటుంది అనే సంస్కారయుతమైన ఆలోచన విధానాన్ని నేను ఆయన ద్వారానే అలపరుచుకున్నాను. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా శ్రీ హరి గారు , ప్రధాన కార్యదర్శిగా నేను ఉన్న రోజుల్లో ప్రతిష్టాత్మకంగా మేము నిర్వహించిన రజతోత్సవ వేడుకలు అసోసియేషన్ చరిత్రలో గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోయాయి. కేవలం సినీ పాత్రికేయుడు గానే కాకుండా పొలిటికల్ జర్నలిజంలో కూడా శ్రీహరి గారికి గొప్ప గుర్తింపు ఉంది. భేషజాలు లేని ఆయన వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి ఆదర్శం .ఆయన రివ్యూలు చదివి సినిమాలు చూసిన జనరేషన్ లో నేను ఒకడిని. ఫిలిం జర్నలిజంలో ఒక తరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన శ్రీహరి గారి మరణం ఫిలిం జర్నలిస్టిక్ ఫ్రెటర్నిటి మొత్తానికి తీరని లోటు. ఆయన ఆత్మ శాంతిని ఆకాంక్షిస్తూ… అశ్రునయనాలతో అంజలి ఘటిస్తూ….ప్రభు
(గుడిపూడి శ్రీహరి సోమవారం రాత్రి హైదరాబాద్ లో తన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. ఈనాడు గ్రూప్ లో చాలాకాలం పని చేశారు. ద హిందూలో ఇంగ్లీషులో సినిమా సమీక్షలు రాసేవారు.)