గుడిపాటి వెంకట చలం (1894-1979) గురించి అందరూ మెచ్చుకునే విషయం ఆయన రచనా శిల్పం. కాని ఆయన సాహిత్యం గురించి చాలా మంది మాట్లాడరు. కొంతమంది దాన్ని ‘బూతు సాహిత్యం’ అనేశారు. కాని ఆయన వచన రచనకు కావ్య గౌరవమిచ్చి తన “వైతాళికులు”లొ చోటిచ్చారు ముద్దుకృష్ణ. దేవులపల్లి కృష్ణ శాస్త్రి, శ్రీశ్రీ, విశ్వనాధ సత్యనారాయణ లాంటి వారి సరసన సమున్నత స్థానమిచ్చారు. ఆ గౌరవార్హులు గుడిపాటి వెంకట చలం.
Also read: చర్యా పదాలు – ఒక పరిశీలన
చలం ఎక్కువగా నవలలు, కథలు రాశారు. ఆయన అభిమాన కథా వస్తువు స్త్రీ. బ్రహ్మసమాజపు ప్రభావంతో కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావులు బాల్య వివాహాలు, సతీ సహగమనం, కన్యాశుల్కం లాంటి సాంఘిక దురాచారాలను వ్యతిరేకిస్తూ, విధవా వివాహాలను ప్రోత్సహిస్తూ రచనలు చేసారు. ఈ నేపధ్యంలో సంసారిక జీవనంలో స్త్రీ అనుభవిస్తున్న బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మొదటి స్త్రీ స్వాతంత్ర్య పిపాసి చలం. సంప్రదాయం పేరున, కుల, మత ఆచారాల పేరున స్త్రీని వంటింటి కుందేలును చేసి దాసిగా వాడుకున్న సమాజం మీద యుద్ధం ప్రకటించిన విప్లవ యోధుడు చలం. ఆలోచనలు, అభిమానం, రాగ విరాగాలు మగవారిలాగానే స్త్రీలకూ ఉంటాయనే విషయాన్ని ప్రస్ఫుటీకరిస్తూ సాగుతాయి ఈయన రచనలు. చలం స్త్రీ తనకు స్వాతంత్ర్యం కావాలని చెప్పదు. ఇవ్వమని మగవారిని అడగదు. తనే స్వతంత్రిస్తుంది. మగవారెలా తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తించేవారో అలాగే తను కూడా ప్రవర్తించి చూపిస్తుంది. బహుభార్యత్వం, ‘ఉంచుకోవడం’, వేశ్యా లోలత్వం మగటిమి లక్షణాలుగా, గౌరవాన్ని ఇనుమడింపజేసే విషయాలుగా భావించే నాటి పురుషాధిక్య సమాజానికి, స్త్రీ స్వతంత్రించి అలా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో చూపిస్తారు చలం నాయికలు. మగవాడు చేస్తే హుందాతనం, అదే ఆడది చేస్తే వ్యభిచారం అనే విషయాన్ని ఖండించడమే ఈ నాయికల సృష్టిలో చలం ఉద్దేశ్యం.
Also read: ఆధునిక తెలుగు కవిత్వ పోకడలు
ఆంగ్ల సాహిత్యంలో ‘అధివాస్తవికత’ (Surrealism) అనే ప్రక్రియను ఉపయోగించారు TS ఇలియట్ లాంటి కవులు. ఒక వస్తువును భూతద్దంలో పెద్దది చేసి చూపించినట్లుగా సమాజంలోని కొన్ని వాస్తవాలను ఎక్కువచేసి చూపించడమే అధివాస్తవికత. స్తబ్దుగా ఉండి, ఉన్న విషయాన్ని పట్టించుకోని సమాజాన్ని తట్టి లేపడానికి ఉపయోగపడుతుంది ఈ ప్రక్రియ. శ్రీశ్రీ దీనిని విస్తృతంగా ఉపయోగించారు. “పతితులార, భ్రష్టులార, బాధాసర్ప దష్టులార” అని ఆయన అన్నప్పుడు సమాజంలో అందరూ పతితులు, భ్రష్టులు, బాధాసర్ప దష్టులు కారు. కొంతమంది అలాంటి వారున్నారని సమాజం మొత్తాన్ని మేలుకొలపడానికి అందరూ అలాగే ఉన్నట్లుగా ఆయన రాశారు.
చలంకూడా అదే అధివాస్తవికతను వాడి తన రచనలద్వారా సమాజాన్ని మేలుకొలిపి స్త్రీకి సమున్నత స్థానం కల్పించే ప్రయత్నం చేశారు. దీన్ని అర్థం చేసుకోలేనివాళ్ళు చలం విశృంఖలత్వాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా, సామాజిక కట్టుబాట్లను కాదంటున్న అసాంఘీక శక్తిగా, స్త్రీ స్వాతంత్ర్యం పేరిట వివాహ వ్యవస్థను నాశనం చెయ్యడానికి పూనుకున్న అరాచకవాది (anarchist) గా ముద్ర వేశారు. వివాహ వ్యవస్థలో చోటుచేసుకున్న బానిసత్వాన్ని రూపుమాపడానికి అధివాస్తవికతను ఉపయోగించి స్త్రీ స్వతంత్రిస్తే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లుగా చూపి మగ జాతిని సంస్కరించడం, ఆడజాతికి తగిన గౌరవం లభించేటట్లు చెయ్యడమే చలం లక్ష్యం. అధివాస్తవికతను కమ్మూనిస్ట్ సిద్ధాంత ప్రచారానికి ఉపయోగించిన శ్రీశ్రీని ‘యుగకర్త’గా అందల మెక్కించి అదే అధివాస్తవికతను ఉపయోగించి జన్నాన్ని సంస్కారవంతులుగా, స్త్రీలకూ తగిన గౌరవమిచ్చే జాతిగా మార్చే ప్రయత్నం చేసిన చలాన్ని ఆంద్ర దేశం వదలి అరుణాచలం చేరేదాకా తరిమి కొట్టాం. పదివేలమంది చలం లాంటివాళ్ళు చెప్పినా వివాహ వ్యవస్థను సమాజం వదులుకోదన్న విషయం తెలియని మూర్కుడు కాడు చలం అనే విషయాన్ని మనం గుర్తుంచుకుంటే చలం రచనలపై ఆవరించిన నల్ల మేఘాలు తొలగిపోతాయి. ఆయనది బూతు కాదు, మన సామాజిక జీవన సంస్కరణ అన్న విషయం తేట తెల్లమవుతుంది. “బ్రాహ్మణీకం” నవలలో “తినాలంటే వంటా, తిరగాలంటే కట్టూ, మాట్లాడాలంటే భాషా, బతకాలంటే నీతీ” అవసరం అంటాడు చలం.
Also read: కవిత్వమంటే……
ఆంగ్ల సాహిత్యంలో సోమర్సెట్ మామ్ నవలలు, కథలు ప్రసిద్ధం. ఆయన నవల “కేక్స్ అండ్ ఏల్” లో నాయిక రోజీ. తల్లి తన బిడ్డలను ఏ విధంగా లాలిస్తుందో అదేవిధంగా తనను కోరుకున్న వారితో తన ప్రేమను, శరీరాన్ని పంచుకుంటుంది. నీతి, అవినీతి అన్న ద్వైతాలకు అతీతంగా ఉంటుంది ఆమె ప్రేమ. “ది రైన్” అనే మామ్ కథలో ఒక వేశ్య విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే తనను సంస్కరించాలని ప్రయత్నిస్తాడు ఒక మతాచార్యుడు. ఆమె అంతరాత్మను జాగృతం చేసి తన తప్పును తెలుసుకునేట్లు చేసి చివరకు ఆమె ఆకర్షణను తట్టుకోలేక ఆమెతో ‘తప్పు’ చేస్తాడు. చెప్పొచ్చిన విషయ ఏమిటంటే నీతి, అవినీతి అనే విషయాలతోపాటు అంతకన్నా ఉన్నత విషయాలున్నాయని మనకు తెలియచేస్తాడు రచయిత. మామ్ రచించిన ఈ నవల, ఈ కథ ప్రపంచ వ్యాప్తంగా గౌరవం పొందాయి.
కాని “మైదానం”, “ఆమీనా”, “అరుణ”, “శశిరేఖ” లాంటి తన రచనలన్నిటిలో మామ్ రాసిన ఇలాంటి విషయాలే రాసినా చలాన్ని మన తెలుగువాళ్ళు వెలివేయడం ఆలోచించవలసిన విషయం. అరుణ అంటుంది: “మగవాడు ధీరుడు, బలశాలి. అట్లా నా కోసం బాధపడుతో, ప్రాధేయపడితే భరించలేను. పరమ అసహ్యం నాకు వాళ్ళని చూస్తే. కాని వాళ్ళనించి ఎదో గొప్పగా ఈ పాడు శరీరాన్ని దాచుకుంటే నా మీద మరింత అసహ్యం”. మనిషికి సంబంధిచిన అన్ని బంధాలకు మూలం ఇష్టం. దాన్ని తల్లిదండ్రుల విషయంలో ‘వాత్సల్యం’ అని, బంధువులతో ‘ఆప్యాయత’ అని, సహోదరుల మధ్య ‘అబిమానం’ అని. ప్రేయసీ ప్రియుల మంధ్య ‘ప్రేమ’ అని వేరే వేరే పేర్లతో పిలుస్తున్నాం. ప్రేమలేని జీవితం విరాగులు మాత్రమే భరించగలరు. ఈ ప్రేమకు కొన్ని హద్దులు ఏర్పరిచింది సమాజం, మనoదరి బాగుకోసం. కాని హద్దులను ఏర్పరచిన ఉద్దేశాలను మరచి గుడ్డిగా వాటిని ఆమలు చేసినపుడు తిరుగుబాటు వస్తుంది. ఉదాహరణకు ‘శశిరేఖ’ అనే నవలలో శశిరేఖను, ఆమె హద్దుల్లేని ప్రేమను కోరుకున్న సుందర రావు ఆమె తనకు దక్కగానే తనమీద ఆధార పడిన విషయాన్ని గమనించి ఆమెకు హద్దులేర్పాటు చేస్తాడు. క్రూరంగా ప్రవర్తిస్తాడు. ఆమె తనను ఎంత ఇష్టపడ్డా వదలి వెళ్ళేంత విరక్తి కలిగిస్తాడు. “బ్రాహ్మణీకం” నవలలోకూడా బిడ్డ చావు బ్రతుకుల్లో ఉంటే పట్టించుకోని భర్తను, లేని ప్రేమ నటించి, రతి కార్యానికి పురికొలిపి అప్పుడు మందులకోసం డబ్బులు అడుగుతుంది సుందరమ్మ. పని కానిచ్చి డబ్బులివ్వకుండా వెళ్ళిన భర్తను చూసి వేశ్యలా ప్రవర్తిoచాల్సివచ్చిన తన బ్రతుకును అసహ్యించుకుంటుంది సుందరమ్మ. స్త్రీ దాస్యానికి ఇది పరాకాష్ట. “అరుణ” నవలలో చలం అంటాడు: “గుణం. ఏమిటా గుణం? దెబ్బలకి దడిసి వంట వండే గుణం, గతిలేక దిక్కులేక ఇంటి దూలాన్ని పట్టుకుని వేలాడే గుణం, నగలు చీరలు మోసే గాడిద గుణం” అంటాడు. అలాగే శశిరేఖను కూతురిలా ఆదరించిన నవజీవనదాసు చివరకు ఆమెను కోరుకుంటాడు, ‘ది రైన్’ కధలోలా. మనం కల్పించుకున్న కట్టుబాట్లకంటే ప్రేమ ఎంత బలమైనదో నిరూపిస్తాయి ఈ అనుబంధాలు. చివర శశిరేఖ చనిపోయినపుడు దేవతలు వచ్చి ఆవిడను స్వర్గానికి తీసుకు వెళుతూ “ఈమె ఈ లోకంలో ఉండదగింది కాదు. ……… ఎక్కడ ప్రేమకు నీతి, దుర్నీతి అన్నవి లేవో అట్టి లోకానికి వస్తుందీమె” అంటారు. సమాజానికి ఎదురీదిన చలం నాయికలు పద్మావతి (“దైవమిచ్చిన భార్య”), సుందరమ్మ (“బ్రాహ్మణీకం”), అరుణ లాంటి వారు నవలల చివరన చనిపోతారు. ఈ ముగింపు కూడా మనల్ని అలోచింప జేయడానికే. ఎంత సహజ ప్రేమను కోరుకుంటామో, దానికి వ్యతిరేకంగా ఎన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటామో వాటి మధ్య సంఘర్షణ ఎలా జీవితాలను బలి తీసుకుంటుందో చూపిస్తాడు చలం.
Also read: కొంతమంది సమకాలీన భారతీయ ఆంగ్లకవుల కవితల పర్యావలోకనం
బాల గంగాధర తిలక్ తన కవిత్వంలో “ఓ దేవా రక్షించు నా దేశాన్ని పవిత్రులనుండి, పతివ్రతలనుండి” అంటారు. ఈ భావం వెనుక చలం లేడనగలమా? చలం ప్రభావానికి ఇది ఓ మచ్చు తునక.
ఆడదాన్ని అణచివేస్తే తిరగబడినపుడు ఎలా ఉంటుందో చూపిస్తుంది చలం స్త్రీ. ఆ భయంతోనైనా స్త్రీని బాగా చూసుకుంటారని అధివాస్తవికతను వాడి సమాజాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేశాడు చలం. మన సంసారిక జీవనం తప్పనిసరి తద్దినం కాక ప్రేమ మాధుర్యంతో నిండాలన్నదే చలం సందేశం.
Also read: “ఆర్ధిక ప్రగతి – విద్య”