- వింత వ్యాధికి సీసం, నికెల్ లోహాలు కారణం
- ప్రభుత్వానికి మంగళగిరి ఎయిమ్స్ వైద్యుల నివేదిక
- అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచన
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుతో పాటు పరిసర ప్రాంత గ్రామాలను కలవరపరుస్తున్న వింత వ్యాధికి సీసం కారణమని ఎయిమ్స్ నిపుణుల బృందం ప్రాథమికంగా నిర్థారించింది. అయితే ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. బాధితులతో జిల్లా ఆసుపత్రి పడకలు నిండిపోవడంతో సమీపంలోని వైద్య కళాశాలకు తరలిస్తున్నారు. ఆసుపత్రిలో చేరినవారు మెల్ల మెల్లగా కోలుకుంటుంటే కొత్త బాధితులు ఆసుపత్రికి పోటెత్తుతున్నారు. తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య 5 వందలకు చేరినట్లు అధికారులు తెలిపారు.
తీవ్ర అస్వస్థతో బాధపడుతున్న వారిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ, గుంటూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఎక్కువ మంది చిన్న పిల్లలు ఉన్నట్లు సమాచారం. రోగుల బ్లడ్ శాంపిల్స్ పరీక్షించిన వైద్యులు సీసం, నికెల్ లోహాల అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు ఎయిమ్స్ నిర్వహించిన వైద్య పరీక్షల్లో తేలింది. త్రాగునీరు, పాల లాంటి ఆహారపదార్దాల ద్వారా రోగుల శరీరంలోకి చేరి ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు బ్లడ్ శాంపిళ్లను ఢిల్లీ ఎయిమ్స్ నిపుణులకు పంపనున్నారు