భారత విదేశాంగమంత్రి జయశంకర్, జర్మన్ విదేశాంగమొంత్రి అన్నాలేనా బేర్ బాక్
- సకల రంగాలలో పరస్పర సహకారం
- ప్రపంచ దృక్పథంలో ఇరు దేశాల మధ్య భావసామ్యం
జర్మనీ – భారత్ మధ్య బంధాలు మరింత బలోపేతమయ్యే శకునాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్య, ఉద్యోగాలలో మనవారికి మంచి అవకాశాలు ఆ దేశం నుంచి లభించనున్నాయి. ఈ దిశగా ఇరుదేశాల మధ్య కీలకమైన ఒప్పందాలు జరుగనున్నాయి. జర్మనీ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి అన్నా లేనా బేర్ బాక్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్నారు. మన దేశంపై ప్రశంసల జల్లులు కురిపించారు. భారతదేశ భావి ప్రగతిపై అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించారు. భవిష్యత్తులో ప్రపంచంలో భారత్ పాత్ర చాలా ప్రముఖంగా ఉండబోతుందని జోస్యం చెప్పారు. రెండు దేశాల మధ్య ‘ద్వైపాక్షిక మొబిలిటీ అగ్రిమెంట్’ పై ఇరుదేశాలు సంతకాలు చేయనున్నాయని ఆమె వెల్లడించారు. ఈ ఒప్పందం వల్ల జర్మనీ – భారత్ ప్రజల రాకపోకలు మరింత సులువు కానున్నాయి. మరో ఏడాది కాలంలోనే చైనా జనాభాను భారత్ మించబోతోంది. పెద్ద మార్కెట్ కేంద్రంగా మన దేశానికి పెద్ద గుర్తింపు ఉంది. ముఖ్యంగా మానవవనరులు, సహజవనరులు మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి.
Also read: గుజరాత్ పోరులో తుది ఘట్టం
భారత్ పట్ల పెరుగుతున్న ప్రవృద్ధ దేశాల ఆసక్తి
ఈ విషయాలు అభివృద్ధి చెందిన దేశాలన్నింటికీ ఇంతకు ముందే తెలుసు. ఇప్పుడు మరింత తెలుసు కుంటున్నాయి. యూజీసీ నిర్మిస్తున్న మన నూతన విద్యా విధానం పట్ల కూడా పలు దేశాలు ఆకర్షణకు గురవుతున్నాయి. ఇచ్చిపుచ్చుకొనే ధోరణులను ప్రతిబింబించే మన తీరు వారికి ఎంతో నచ్చుతోంది. ఆ దేశాల జాబితాలో జర్మనీ కూడా ఉంది. దీనికి తోడు గత 15 ఏళ్ళలో మన దేశంలో జరిగిన అభివృద్ధి, పేదరిక నిర్మూలనలో సాధించిన ప్రగతి కూడా జర్మనీని ఆకట్టుకుంది. జీ -20 లో భారత్ కొత్తగా చేపట్టిన నాయకత్వంపై కూడా జర్మనీ విశ్వాసాన్ని పెంచుకుంది. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం అంశంలో భారత్ చూపించిన వైఖరికి జర్మనీ ఫిదా అయ్యింది. ఇండో -పసిఫిక్ ప్రాంతంలో 21వ శతాబ్దంలో అంతర్జాతీయ విధానాలపై భారత్ ముద్ర విలక్షణంగా ఉంటుందని జర్మనీ విదేశాంగ శాఖా మంత్రి అన్నా లేనా నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు.శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ను జర్ననీ చూస్తోంది.
Also read: భారత సారథ్యంలో జీ-20 ప్రయాణం
బలమైన ప్రజాస్వామ్య మూలాలు
బలమైన ప్రజాస్వామ్య మూలాలు, సాంస్కృతిక సమైక్యత,భిన్న మతాలు, సామాజిక వర్గాల మధ్య విలసిల్లుతున్న శాంతి, సోషల్ ఇంజనీరింగ్ భారత్ పట్ల జర్మనీకి గౌరవాన్ని పెంచుతున్నాయి. జీ 7-సదస్సులో భాగంగా మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ జర్మనీకి వెళ్లినప్పుడు ఆ దేశం నుంచి అపూర్వమైన స్వాగతం లబించింది. ఇప్పుడు ఆ దేశ విదేశాంగ మంత్రికి కూడా మన దేశంలో గొప్ప ఆత్మీయత ధ్వనించింది. కమ్ముకొస్తున్న ఆర్ధిక మాంద్యం మధ్య ఇబ్బందులను ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో జర్మనీ కూడా ప్రముఖంగా ఉంది. ఐరోపాలోనే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా జర్మనీ వేళ్లూనుకొని వుంది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ఈ దేశంపైన కూడా బలంగా వుంది. ఈ నేపథ్యంలో భారత్ తో జర్మనీకి ఎన్నో అవసరాలు ఉన్నాయి. అందుకే మనతో చెలిమిని పెంచుకుంటోంది. మన రెండు దేశాల మధ్య మొదటి నుంచి కూడా బలమైన సంబంధాలు ఉన్నాయి.
Also read: రాజకీయాలలో పెరిగిపోతున్న నేరస్థులు
భద్రతాసమితి సభ్యత్వం కోరుతున్న ఇరు దేశాలు
వాణిజ్యం, సాంస్కృతికం, సాంకేతికం ఈ మూడు రంగాల్లో ఉభయులకు సహకారం అవసరమైన నేపథ్యమే ఉంది. ‘యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ‘ లో శాశ్వత సభ్యత్వాన్ని రెండు దేశాలు కోరుకుంటున్నాయి. రక్షణ రంగంలోనూ ఇరు దేశాల మధ్య సఖ్యత ఉంది. భాషల పరంగానూ రెండు దేశాల మధ్య ఒప్పందం గతంలోనే ఏర్పడింది. మన కేంద్రీయ విద్యాలయాలలో జర్మనీ, అక్కడ విద్యాలయాల్లో మన సంస్కృతం బోధన, అధ్యాయనాలు జరుగుతున్నాయి. జర్మనీ పండితులు ఎక్కువమంది మన సంస్కృతాన్ని నేర్చుకోవడమే కాక, మన వేదాలను కూడా ఉపాసిస్తున్నారు. కొంతమంది జర్మన్లు అచ్చమైన భారతీయుల్లా అకృతి దాల్చుకున్న దృశ్యాలు మనకు తరచూ కనిపిస్తూ ఉంటాయి. మన కట్టూబొట్టు పట్ల వారు మోజు పెంచుకుంటున్నారు. మొత్తంగా జర్ననీ – ఇండియా మధ్య బలమైన, స్ఫూర్తి దాయకమైన ప్రయాణం జరుగుగాక.
Also read: తెలుగు సాహిత్యానికి అడుగుజాడ గురజాడ