నిత్యావసర వస్తువుల ధరలు చూసి కొనేట్లులేదు…తినేట్లులేదని తరచూ వింటున్నదే. జనం కూడా పెరుగుతున్నధరలతో రాజీ పడక తప్పనిస్థితి. ముఖ్యంగా కాయగూరల విషయంలో సర్దుకుపోక తప్పనిస్థితి. అయితే రానురాను ఆ ఓపిక నశిస్తుందంటున్నారు.
దిగుబడి కొరత కారణంగా ధరలు పెరగడం మామూలు కాగా ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నమైనది. అదే ఇంధన ప్రభావం. ప్రకృతి వైపరీత్యాలు, ఇతరత్రా కారణాల వల్ల దిగుబడి తగ్గి గిరాకీ పెరగడం ఒక పద్ధతి అయితే, కాస్తోకూస్తో పండినది వినియోగదారులకు చేరడంలోరవాణారుసుం భారం పడుతోంది. ఇటీవల మాసలలో భారీవర్షాల కారణంగా రెండు నెలల క్రితం (డిసెంబర్)లో తగ్గిన ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. అందుకు ఇంధన ధరల పెంపు ప్రధాన కారణంగా చెబుతున్నారు.
సుంకాలే.. భారం.. భారం
పన్నులు తగ్గించేందుకు ప్రభుత్వాలు ఏ మాత్రం సుముఖంగా లేనందున పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతూ రవాణా ఖర్చుల భారం వినియోగదారులకు బదలీ అవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరంభంలో కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోలుపై రూ.11 ఎక్సైజ్ సుంకం పెంచడంతో అది రూ. 32.98కి, డీజిల్ పై రూ. 31.83కు చేరింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్, ఇతర సుంకాలు భారీగా వడ్డించడంతో ఆకాశమే హద్దన్నట్లుగా పెట్రోధరలు దూసుకుపోతున్నాయి. పెట్రోలు ధరలకంటే డీజిల్ ధరల పెంపు నిత్యావసరవస్తువుల రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అలా వినియోగదారులు చెల్లిస్తున్న దానిలో కొంతైనా రైతులకు చేరుతుందా? అంటే అదీ లేదు.
Also Read : గందరగోళం సృష్టిస్తున్న ధర్మాన వ్యాఖ్యలు
పన్నులు తగ్గించేది లేదు
అంతర్జాతీయంగా ముడి ఇంధనం ధరలు తగ్గడమో లేదా స్థిరంగా ఉంటున్నా, దేశంలో ఇంధన ధరలు పెరగడం ఏమిటని వినియోగదారుల సంఘాలు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నా సమాధానం ఉండదు. ఇంధనంపై పన్నులు తగ్గించే ప్రసక్తి లేదని కూడా ప్రభుత్వం స్పష్టంచేయడంతో ఆ ప్రభావం సహజంగా నిత్యావసర వస్తువులపై పడుతోంది. ఇతర నిత్యావసర వస్తులను అటుంచి కూరగాయాల విషయాన్నే చూస్తే, ఇంధన ధరలు, రవాణా చార్జీలతో పాటు చిల్లర అమ్మకాలలో ధరలు 30 నుంచి 50 శాతం వరకు పెరిగాయి. టోకు వ్యాపారులు రవాణా ఖర్చును తమపై మోపుతుండగా, దానిని భరించేందుకు తాము వినియోగదారులపై వేయకతప్పడంలేదని, తమకు వచ్చే లాభం నామమాత్రమేనని చిల్లర వర్తకులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాలలోని అన్ని చోట్ల ఇంచుమించు ఇదే పరిస్థితి కాగా,హైదరాబాధ్ విషయానికి వస్తే, దాదాపు 40 శాతం కాయగూరలు పొరుగు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంటాయి. ప్రధానంగా అనంతపురం, బెల్గాం, బస్వ కల్యాణ్,సోలాపూర్,నాగపూర్ తది తర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం దిగుమతి పరిణామం తగ్గిందంటున్నారు. ఉదాహరణకు, కర్ణాటక నుంచి హైదరాబాద్ కు 25 టన్నుల సరకు తేవడానికి రూ.40 వేల అయ్యేది. గత కొన్ని రోజులుగా ఇంధనం రేట్ల పెంపు పేరుతో `మధ్యవర్తులు` అదనంగా రూ. 10 వేలకు పైగా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. సరకు దిగుబడిపై దాని ప్రభావం పడుతోంది. తక్కువ సరకు తెప్పించడం వల్ల ఎక్కువ ధరకు అమ్మవలసి వస్తోంది. గిరాకీకి, సరఫరాకు లంగర్ కుదరడం లేదు. ఉల్లి, బెండ, కాలీఫ్లవర్, పచ్చిమిర్చి, వంకాయ, దొండ లాంటివి ధరలు గత నెలలో ఇదే సమయం కంటే రెట్టింపు అయ్యాయి.
Also Read : వందేళ్ల చింతామణికి ‘నూరేళ్లు’
అసలే కోవిడ్ కష్టాలు, ఆపైన…
కోవిడ్-19 కారణంగా సుమారు ఏడాది పాటు కష్టనష్టాలు ఎదుర్కొంటున్న తమకు రవాణ ఖర్చుల పేరిట అదనపు బాదుడు భారంగా పరిణమించిందని వినియోగదారులు వాపోతున్నారు.ముఖ్యంగా దిగువ మధ్యతరగతి, అసంఘటిత రంగ కార్మికులు,పేదలు బాగా ఇబ్బందిపడుతున్నారు.
వంటనూనెలపై సుంకం మోత
మరోవంక, కూరగాయేతర నిత్యావసర విషయానికి వస్తే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టీ పెట్టకుండానే వంటనూనెలపై మరింత సుంకం భారం పడింది. లీటర్ పామాయిల్ కు రూ. 4 పెరిగి నెల రోజుల్లోనే సుంకం రూ 14 కు చేరింది. దీని ప్రభావం చిల్లర ధరలపై పడింది. గృహ వినియోగదారుల నుంచి హోటళ్లు,ఇతర తినుబండారాల వ్యాపారులు పామాయిల్ ఎక్కువగా వాడుతుంటారు.ఈ పెరుగదల వల్ల తినుబండారాల వ్యాపారులు పదార్థాల ధరలు పెంచడమో, లేదా నాణ్యతను పాటించకపోవడమో చేసే పరిస్థితి ఉత్పన్నమవుతుందని, అదే సమయంలో కల్తీకి ఆస్కారం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read : జానపద పరిశోధకరాజు `బిరుదురాజు`