• మౌళిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
• 7725 కోట్లతో మూడు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి
• యువతకు మెండుగా ఉపాధి అవకాశాలు
దేశంలో మౌళికరంగంలోని పలు కీలక ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ కు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దీనితో పాటు కర్ణాటకలోని తుమకూరు ఇండస్ట్రియల్ కారిడార్ కు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రతిపాదిత చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో అంతర్భాగంగా ఈ రెండింటిని నిర్మించనున్నట్లు తెలిపింది. కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ అంచనా వ్యయం 2139 కోట్లు కాగా, తుమకూరు అంచనా వ్యయం 1701 కోట్లుగా నిర్ణయించారు. పారిశ్రామిక రంగంలో భారీగా మౌళిక వసతుల కల్పన కోసం మొత్తం 7725 కోట్లు విలువైన ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిద్వారా 2 లక్షల 80 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. వీటితో పాటు గ్రేటర్ నొయిడాలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్, మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ హబ్ లను నిర్మించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
ఇది చదవండి: ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర భూసర్వేకి సీఎం శ్రీకారం
భారీగా ఉపాధి అవకాశాలు:
కృష్ణపట్నం, తుమకూరులను గ్రీన్ ఫీల్డ్ పారిశ్రామిక నగరాలుగా అభివృద్ధి చేయనున్నారు. కృష్ణపట్నం, తుమకూరు పారిశ్రామికీకరణలో భాగంగా యువతకు మెండుగా ఉపాధి అవకాశాలు రానున్నాయి. కృష్ణపట్నం పోర్ట్ తొలిదశతోనే 98 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో 58 వేలమంది ప్రత్యక్ష్యంగా ఉపాధి లభించనుండగా మిగతావారికి పరోక్షంగా ఉపాధి లభించనున్నట్లు అధికారులు తెలిపారు. తుమకూరులో 88500 ఉద్యోగాలు లభించనున్నట్లు తెలుస్తోంది.
ఇది చదవండి: తాడిపత్రి ఆధిపత్య పోరులో సామాన్యులే సమిధలు