- ఓటింగ్ పట్ల నిర్లిప్తత
- డబ్బుకు ప్రాధాన్యత పెరగడం
- కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితం
- వెలవెలబోయిన పోలింగ్ కేంద్రాలు
- చౌకబారు విమర్శలు, దిగజారుడు రాజకీయాలు
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పోలింగ్ ఉదయం మందకొడిగా ప్రారంభమైనా మధ్యాహ్నానికి కూడా పెద్దగా పుంజుకోలేదు. దీంతో ఓటింగ్ శాతం ఘోరంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్ శాతం తక్కువగా ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రచారం చేశాం, తాయిలాలు పోటీపడి మరీ పంచాం అయినా పోలింగ్ శాతం తగ్గడంతో నేతలు దిగాలు చెందుతున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సెలవు ప్రకటించినా పెద్దగా ప్రయోజనం లేదనిపిస్తోంది. హాలిడేని ఎంజాయ్ చేస్తున్నారే తప్ప ఓటు వేయడానికి రావడంలేదని పలువురు విమర్శిస్తున్నారు.
ఓటర్లు లేక బోసిపోయిన పోలింగ్ కేంద్రాలు
కొన్ని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సిబ్బంది ఖాళీగా కూర్చునట్లు తెలుస్తోంది. ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. మధ్యాహ్నం దాటినా ఓటు వేసేందుకు జనం ఇళ్లనుంచి బయటకు వచ్చిన దాఖలాలు కనిపించడంలేదు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన నాయకులు ఓటర్లను బూత్ వద్దకు రప్పించలేకపోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు ప్రధాన పార్టీల దిగజారుడు రాజకీయాల వల్లే ఓటర్లు రాజకీయాలంటే అసహ్యించుకునేలా తయారయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో ఉంటున్నా ఓట్లు గల్లంతు కావడం, ప్రతి ఎన్నికలకూ ఓటరుగా నమోదు చేసుకోవడం ప్రహసనంగా మారుతోంది.
ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఓటు వేయడానికి బద్దకించినట్లు తెలుస్తోంది. పోలింగ్ సందర్భంగా ఇచ్చిన హాలిడేని ఎంజాయ్ చేయడానికి బంధువుల ఊళ్లు వెళ్ళినట్లు తెలుస్తోంది. నాలుగు రోజులు వరుస సెలవులు రావడం కూడా ఓటింగ్ శాతం పడిపోవడానికి బలమైన కారణంగా కనిపిస్తోంది.
Also Read: జీహెచ్ఎంసీలో మందకొడిగా పోలింగ్
కరోనాతో తగ్గిన ఓటింగ్ శాతం
కరోనా కారణంగా కొంత ఓటింగ్ శాతం తగ్గినట్లు అధికారులు అంచనావేస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్ కేంద్రాలలో శానిటైజర్లు ఏర్పాటు చేశారు. అయినా క్యూ లైన్ లో నించుని ఓటేయడానికి ముందుకు రావడం లేదు.
కాలం చేసిన వారికి రాజకీయాలు అంటగట్టడం
ఎన్నికల పట్ల హైదరబాదీల నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోంది. అధికార విపక్షాల ప్రచార హోరు ఓటరును సంతృప్తి పరచలేకపోయింది. ఎపుడో ఈ లోకాన్ని వీడిన పీవీ, ఎన్టీఆర్ ల చుట్టూ జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారం సాగడం, పైగా వీరిద్దరికి సంబంధం లేని పార్టీలు వీరిని రాజకీయాల్లోకి లాగడం సాటి తెలుగువాడు జీర్ణించుకోలేకపోయాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హేమా హేమీల వాగ్ధానాలు ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి. ముఖ్యంగా వరద ముంపుకు గురై నానా ఇబ్బందులు పడినపుడు సకాలంలో వచ్చి ఆదుకున్నవారెవరూ లేరని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన పార్టీలు అభివృద్ధిని మరిచి దూషణలకు దిగడంతో ఓటరు నీరుగారిపోయాడు. ఆదివారం వచ్చిందంటే కరోనాను కూడా లెక్క చేయకుండా చికెన్ సెంటర్లు, ఫిష్ మార్కెట్ల దగ్గర గుమిగూడే జనం ఓటింగ్ పట్ల తీవ్ర విముఖత చూపడం ఏంటని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు కాబట్టి ఓటు వేసినా వేయకున్నా ఒకటే అనే అభిప్రాయానికి నగర ఓటరు వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: మొద్దుబారిన `వజ్రాయుధం`
ఓటుకు నోటు
ప్రజాభిప్రాయానికి విలువ లేకపోవడం, అదే సమయంలో డబ్బుకు ప్రాథాన్యత పెరగడం కూడా సగటు ఓటరు ఓటు వేయకపోవడానికి కారణంగా తెలుస్తోంది. తాను ఓటు వేసిన వ్యక్తి విజయం సాధించాక వ్యాపారం కోసమే, ఇతర రాజకీయ ప్రయోజనాల కోసమే తాను వ్యతిరేకించే పార్టీలో చేరితే ఇక తన ఓటుకు విలువెక్కడదని ఓటరు ప్రశ్నించుకుంటున్నాడు. గ్రేటర్ ఎన్నికల్లో మత విద్వేషాలు జరుగుతాయని పక్కా సమాచారం తమ వద్ద ఉందని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం కూడా ఓటింగ్ శాతం పడిపోవడానికి కారణంగా తెలుస్తోంది. ప్రాణాలను పణంగా పెట్టి ఓటు వేయాల్సిన అవసరం ఏముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికార, విపక్షాలపై విశ్వాసం సన్నగిల్లటం కూడా ఓటింగ్ శాతం తగ్గటానికి కారణంగా చెప్పుకోవచ్చు.
Also Read: జీహెఛ్ఎంసీ పోలింగ్ ప్రక్రియ ఇలా