`యాభయ్ ఏళ్లు దాటుతున్నాయి. సంపాదించింది చాలు. చాలకపోయినా గుళ్లో పురాణ పఠనంతో కాలక్షేపం చేద్దాం. మనకన్నా తక్కువ డబ్బున్నవాళ్లు బతకడంలేదా?`అని సుమారు ఐదు దశాబ్దాల క్రితం `ఆత్మసంతృప్తి` వైరాగ్యంతో నిర్ణయం తీసుకుని చాలా పాటల అవకాశాలు వదులుకున్న గాయకసార్వభౌముడు. తరాతరాలకు సరిపడేంత సంపాదించాలనుకోలేదు, సంపాదించనూ లేదు. గాయక సమ్రాట్ గా మాత్రం చిరకీర్తిని దక్కించుకున్నారు. కొత్త గాయకులను ప్రోత్సహించాలని తహతహలాడారు. `బతికినంతకాలం పాడాలని, పాడినంత కాలమే బతకాలి` అని మాటను నిజం చేసినట్లు, ఇంటికో `ఘంటసాల`ను తయారు చేసి తరలిపోయారు.
ఆ పేరు విన్నా, తలచినా తెలుగు శ్రోతల మనసు పులకరిస్తుంది. పద్యం పరవశిస్తుంది. జానపదాల నుంచి జావళీల దాకా, అల్లరి పాటల నుంచి అష్టపదుల దాకా, లలిత సంగీతం నుంచి శాస్త్రీయ సంగీతం వరకు ఆయన `కంఠ`శాలలో కొలువుతీరాయి. తాను రాసిన గీతాల్లో ఒక్కటైనా ఆయన పాడితే బాగుండుననుకున్న కవులెందరో. `పాత్రికేయుడిగా, వర్ధమాన కవిగా ఘంటసాల గారితో సన్నిహితత్వం ఉన్నా నా ఒక్క గీతం కూడా ఆయన కంఠం నుంచి జాలువారని దురదృష్టవంతుడిని` అని దివంగత వేటూరి సుందరరామమూర్తి అనేవారు. `ఘంటసాల వారు ఉత్తర భారతదేశంలో పుట్టక పోవడం అక్కడి శ్రోతల దురదృష్టం. నాలాంటి గాయకుల అదృష్టం` అని ప్రఖ్యాత గాయకుడు మహ్మద్ రఫీ ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్యచాలు ఆయన`కంఠ`మాధుర్యం, ఔన్నత్యానికి నిదర్శనం.
Also Read : ఏమని వివరింతుమూ…..!!
ప్రజా హృదయాల్లో అపూర్వ స్థానం దక్కించుకొని, వాగ్గేయకారుల్లో త్యాగయ్య, అన్నమయ్యల తర్వాత ఆ స్థాయిలో ఆరాధనోత్సవాలు అందుకుంటున్న లలితసంగీత చక్రవర్తి ఘంటసాల. ఆయన రసహృదయుల సమష్టి సంపద. సహస్రాధికి గీతాలాపన, శతాధిక చిత్రాల సంగీత దర్శకుడిగా శ్రోతల మనసులను రజింపచేసిన ఘంటసాల వారి గురించి చెప్పుకోవడం చర్వితచర్వణమే అవుతుంది. అయినా జయంతి, వర్ధంతుల సందర్భంగా ఆయన ఉన్నతిని, వ్యక్తిత్వాన్ని స్మరించుకోవడం ఓ మధురానుభూతి.
ఆయన కంఠస్వరంతో పాటు ఆయన వ్యక్తిత్వమూ మధురమే. ఈ వ్యాసకర్త, `దాశరథి చలన చిత్రగీతాలు-విమర్శనాత్మక పరిశీలన`అనే అంశంపై పరిశోధనకు సంబంధించి సమాచార సేకరణ సందర్భంగా శ్రీమతి సావిత్రమ్మ, దివంగత రావి కొండలరావు, గొల్లపూడి మారుతీరావు లాంటి ప్రముఖులను కలసినప్పుడు ఘంటసాల వారి వ్యక్తిత్వం ప్రస్తావనకు వచ్చేది.
Also Read : జానపద పరిశోధకరాజు `బిరుదురాజు`
ఆది నుంచీ ఆయన అంతేనట…
ఘంటసాల నేపథ్య గానాన్ని బతుకుతెరువగా తీసుకున్నారు తప్ప సర్వం సహా చక్రవర్తిగా ఏలాలన్నా భావన ఎన్నడూ లేదని ఆయన సహధర్మచారిణి సావిత్రమ్మ గారు సహా ఆయనతో సన్నిహిత సంబంధాలు కలవారి మాటలను బట్టి తెలిసింది. నటించే అవకాశాలు వచ్చినా `నేను పాటలు పాడి బతుకుతున్నాను చాలు. నేను నటిస్తే మరొక నటుడుకి అవకాశం పోతుంది. ఆ నటుడి పొట్టకొట్టకూడదు. వీలైనంత వరకు ఇతరులు బతకడానికి మనవంతు కృషి చేయాలి’ అనే మనస్తత్వంతో అని మృదువుగా తిరస్కరించేవారట. `తానొక్కరే సినీ నేపథ్య రంగాన్ని ఏలాలి`అని ఎన్నడూ అనుకోలేదు. మీరే పాటలన్నీ పాడాలన్న దర్శక నిర్మాతలకు`అన్నీ నేనే పాడితే బాగుండదు బాబూ!` అనినచ్చచెప్పిఇతర గాయకులతో పాడించిన సందర్భాలు ఎన్నెన్నో. స్వీయ సంగీత దర్శకత్వంలో ఇతరులతో పాడించారు. తమిళ, కన్నడ చిత్రాలలో తాను పాడడం వల్ల ఆయా భాషా గాయకులకు అవకాశాలు తగ్గుతాయన్న భావనతో వాటికి పాడనని ప్రతినబూనారని చెబుతారు. నేపథ్యగాయకుడిగా, సంగీత దర్శకుడిగా మంచి స్థాయిలో ఉన్నప్పుడే ఆయనలో చెప్పలేని ఆవేదన, భయం చోటు చేసుకున్నాయని ఆయన శిష్యుడు, సంగీత దర్శకుడు జేవీ రాఘవులు ఒక సందర్భంలో చెప్పారు. `ఈ సినిమా పరిశ్రమలో ఇకపై మనుగడ కష్టం అని, నాటకాలైనా వేసుకొని బతకాలని చాలా వూళ్లలో నాటకాలు వేయడం ప్రారంభించారు. నేనూ వెంటవెళ్లేవాడిని`అని రాఘవుల చెప్పినట్లు నటుడు రావి కొండలరావు ఒక వ్యాసంలో పేర్కొన్నారు. భగవద్గీత గానం ముందూ అదే ఉపేక్ష.
Also Read : వందేళ్ల చింతామణికి ‘నూరేళ్లు’
కలియుగ `గీతా`చార్యుడు
`బతుకు తెరువు కోసం సుమారు మూడు దశాబ్దాల పాటు చలన చిత్ర నేపథ్య గాయకుడిగా కొనసాగాను. కొత్త గాయకులు వస్తున్నారు, రావాలి. సాహిత్యమూ మారిపోతోంది. భగవద్గీత, రామదాసు కీర్తనలు, అష్టపదులు లాంటివి రికార్డు చేస్తూ కాలక్షేపం చేస్తా. అదీగాక జన్మ ఎత్తినందుకు చిరస్థాయిగా ఉండే ఏదో ఒకటి యాలి` అనే సంకల్పం కలిగింది. అదే `భగవద్గీతావరణం`. ఆయన నేపథ్యం గాయకుడిగా జీవితం ఒక ఎత్తయితే, భగవద్గీత గానం మరో ఎత్తు అని ప్రత్యేక చెప్పనవసరంలేదు. `గీతా`గానం కోసం ఆయన పడిన తపన, శ్రమ గురించి వారి అర్థాంగి సావిత్రమ్మ గారు అనేక సందర్భాలలో వివరించారు.
లతా మంగేష్కర్ స్ఫూర్తితో…
అంతకు కొనాళ్లకు ముందు ప్రఖ్యాత గాయనీ లతామంగేష్కర్ తండ్రిగారి వర్థంతి సందర్భంగా హైదరాబాద్ లో సంగీత విభావరి నిర్వహించిన ఘంటసాల వారికి, ఆమె తాను ఆలపించిన `గీత`శ్లోకాల రికార్డులు బహూకరించారు. ఆంగ్ల వ్యాఖ్యానంతో ఉన్న వాటిని విన్న తరువాత, అందరికీ అర్ధమయ్యేలా తెలుగు తాత్పర్యంతో సులభశైలిలో పాడితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చిందట. హెచ్.ఎం.వీ. రికార్డింగ్ సంస్థ వారికీ అలాంటి ఆలోచనరావడం కాకతాళీయమే. అయితే విదుషీమణి ఎం.ఎస్.సుబ్బులక్ష్మిగారితో పాడిచాలని ఆ సంస్థ మొదట భావించినా ఆ భాగ్యం ఘంటసాల వారిని వరించింది. కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీస్పులూ అందుకున్నారు ఘంటసాల.`మంచిపని చేస్తున్నావు. తప్పకుండా ఇది చాలా ప్రజాదరణ పొందుతుంది. నీ జన్మచరితార్థమవుతుంది నాయనా..`అని ఆశీర్వరించారట(అంతకు కొన్నేళ్ల ముందు హైదరాబాద్ శంకరమఠంలో కంచిస్వామి వారి సమక్షంలో ఘంటసాల గారు `గిరిజాకల్యాణం `యక్షగానాన్ని ఆలపించడం మరో ముచ్చట). అదే సమయంలో ఆరోగ్య సమస్య వచ్చినా లక్ష్య పెట్టకుండా భగవద్గీత శ్లోకాల ఎంపిక, వాటికి పండితులు కోట సత్యరంగయ్యశాస్త్రి గారితో తాత్పర్యాలు రాయించడంలో నిమగ్నమయ్యారు. నిష్ఠతోపాడారు. ఆరు నెలల తేడాతో `భగవద్గీత`రికార్డులు రెండు భాగాలు పూర్తయ్యాయి. `భగవద్గీత పాడిన నోటితో సినిమా పాటలు పాడను`అన్నారట. ఆ మాటదక్కించుకున్నట్లే పాటలు పాడడం అటుంచి `గీత`ను వినకుండానే (రికార్డులు విడుదల కాకుండానే) ఆ గాత్రం మూగవోయింది.
Also Read : పరిశోధక ‘ప్రభాకరుడు’
అమరగాత్రానికి అపచారం
`ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతమ్
ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ
ఏకో మంత్రస్య నామాని యాని
కర్మాప్యేకం తస్య దేవస్య సేవా`
గీతాశాస్త్రమే అసలైన శాస్త్రం. దేవకీనందనుడే ఏకైక దైవం. ఆయన నామాలే దివ్యమంత్రాలు. ఆయన సేవే సత్కర్మాయుక్త ఏకైక సేవ) అని ఆర్యోక్తి. అంతటి ఉత్కృష్టమైన గీతను సరళభాషలో మధురగానంతో ఈ జాతికి అందించారు ఘంటసాల. కానీ `జీవనగీత`వరస మారుతోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఆలయాలలో కంటే అంతిమయాత్రలలో ఇది ఎక్కువగా వినిపించడం శోచనీయం. ఆయన గానం చేసిన `గీత` విన్నవెంటనే ఆయా ప్రదేశాలలో `శవ జాగరణో, శవయాత్రో` అనే సంకేతాలు ఇచ్చే స్థితికి తీసుకురావడం చాలా మందిని బాధించే అంశం. భగవద్గీతకు, అంతిమయాత్రలో దానిని వాడడానికి సంబంధం ఏమిటో బోధ పడదు. విద్యావంతుల నుంచి సామాన్యుల వరకు ఇదే వైఖరి. మృతి చెందిన వ్యక్తి (సజీవంగా ఉన్నప్పుడు)ఆస్తికుడా? నాస్తికుడా? అనే దానితో నిమిత్తం లేదు. ఒకవంక వ్యక్తిత్వ వికాస గ్రంథంగా మన్ననలు అందుకుంటూ, మనిషి `మనీషి`గా ఎలా మారాలో చెప్పే `జ్ఞానగీత` ఇలా `జాగరణ గీత`గా మారడం బాధించే అంశం. ఈ తీరు మారాలి. ఇది `శోభ` గీత కానీ `శోక`గీత కాదు, కారాదనే భావన కలిగినప్పడు, కల్పించగలిగినప్పుడే `గీత`కు గౌరవం, అమరగాయకుడికి అసలైన నివాళి.
Also Read : కథాభి`రాముడు`
( ఫిబ్రవరి 11న ఘంటసాల వర్ధంతి)