Sunday, December 22, 2024

రాహుల్ కు భారీ ఊరట

  • పార్లమెంటుకు హాజరు, ఎన్నికలలో పోటీ
  • ప్రతిపక్షాలు సంఘటితం కావడం కొత్త పరిణామం

‘మోదీ’ ఇంటిపేరుపై గతంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. దిగువ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. గుజరాత్ హైకోర్టు శిక్షను ధ్రువీకరించింది. ఆ తర్వాత ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. ఈ కేసులో సుప్రీం కోర్టు తాజాగా ‘స్టే’ ఇచ్చింది. దీనితో రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. నాలుగు నెలల తర్వాత లోక్ సభలో రాహుల్ అడుగుపెట్టారు. తన పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ లోని నేతలు కూడా ఆయనకు ఘన స్వాగతం పలికారు. నినాదాలతో, స్వీట్ల పంపకంతో హడావిడి చేశారు. సభ్యత్వ పునరుద్ధరణ జరిగింది. ఇటీవలే తను ఖాళీ చేసిన క్వార్టర్ తిరిగి ఇస్తారా? మరేదైనా కేటాయిస్తారా? తెలియాల్సివుంది. మొత్తంగా చూస్తే, రాహుల్ కు భారీ ఊరట లభించింది. సమీప కాలంలో తన రాజకీయ భవిష్యత్తుకు ఢోకాలేదు. రేపు జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి అవకాశం ఉంటుందనే చెప్పవచ్చు. ఈ పరిణామంతో రాహుల్ రెట్టింపు ఉత్సాహంతో ముందుకు దూకనున్నారు. సుప్రీంకోర్టులో స్టే మంజూరు చేసిన న్యాయమూర్తికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గ్రాఫ్ బాగా పెరిగిందన్నది వాస్తవం. దిగువ కోర్టు తీర్పుతో లోక్ సభ్యత్వం రద్దు కావడం, పార్లమెంట్ లో అడుగుపెట్టే పరిస్థితి లేకపోవడం, క్వార్టర్స్ ఖాళీ చేయాల్సిన పరిస్థితి రావడం మొదలైన సంఘటనలన్నీ ఒక విధంగా రాహుల్ కు మేలుచేశాయి. అతనిపై ప్రజలకు సింపతీ పెరిగేట్టు చేశాయి. యూట్యూబ్ మొదలైన సోషల్ మీడియా వేదికలలో రాహుల్ గాంధీని చూసే వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

Also read: మూగబోయిన యుద్ధనౌక

కర్ణాటక విజయంతో అందుకున్న దశ

హిమాచల్ ప్రదేశ్,కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కూడా పెరిగింది. మరీ ముఖ్యంగా, కర్ణాటకలో దక్కిన భారీ విజయం పార్టీకి మరింత జవజీవాలాను చేకూర్చింది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి, నరేంద్రమోదీని అధికారం నుంచి దూరం చేయడానికి శత్రువులంతా ఏకమవుతున్నారు. చాలావరకూ ప్రతిపక్షాలు ఒక గొడుగు కిందకు వచ్చాయి. ‘ఇండియా’ పేరుతో ఒక కూటమిగా ఏర్పడ్డాయి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో తమ ఐక్యతను చాటి చెబుతున్నాయి. ముఖ్యంగా మణిపూర్ అంశం వీరందరికీ బాగా కలిసి వచ్చింది. దీనిని ఆయుధంగా మలుచుకొని మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని కూడా ప్రకటించారు. లెక్కప్రకారం మంగళవారం నాడు (8వ తేదీ) జరగాలి. గందరగోళాల మధ్య సభలు వాయిదా పడుతూనే వున్నాయి. పార్లమెంట్ సజావుగా సాగిన దాఖలాలు లేనేలేవు. వర్షాకాలం సమావేశాలు ముగింపుకు కూడా వచ్చేశాయి. అవిశ్వాస తీర్మానంపై చర్చ ఏ మేరకు సక్రమంగా సాగుతుందన్నది అనుమానమే. సభ్యత్వం బలంగా వున్న బిజెపికి వచ్చిన లోటేమీలేదు కానీ, ప్రతిపక్షాలు విమర్శలు చేయడానికి బలమైన అవకాశం ఇచ్చినట్లయింది. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇస్తూనే కొన్ని వ్యాఖ్యలు చేసింది. రెండేళ్లు జైలు శిక్ష విధించడానికి సరైన కారణాలు చూపించలేకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. అట్లే, ప్రజాజీవితంలో కొనసాగేవారు ఎంతో జాగ్రత్తగా అలోచించి ఆచి తూచి మాట్లాడాలని హితవు పలికింది. ఇది కేవలం రాహుల్ గాంధీకే కాదు.అందరికీ వర్తిస్తుంది.

Also read: నవనవోన్మేష సాహిత్యోత్సవం

ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకోవాలి

గత కొన్నాళ్ళుగా కొందరు రాజకీయ నాయకులు మాట్లాడుతున్న తీరు, వాడుతున్న భాష అత్యంత జుగుప్సాకరంగా ఉంటోంది. వివిధ మీడియా వేదికల్లో వినవస్తున్న ఆ భాష  కుటుంబ సభ్యులతో కలిసి వినలేని పరిస్థితిలో ఉంటోంది. దీనికి తెలుగురాష్ట్రాలే ఉదాహరణ. ఈ తీరు మారాలి. మారకపోతే అటువంటి నాయకులనే మార్చేయాలి. ఆ హక్కు ప్రజలు వేసే ఓటులోనే వుంది. అది సద్వినియోగమైతే అన్నీ సర్దుకుంటాయి. దేశంలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలకు పెద్ద సమయం లేదు. ఈసారి ఎన్నికల్లో మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఆశిస్తున్న బిజెపి ఇక నుంచి మరింత అప్రమత్తంగా ఉండాలి. పదేళ్లపాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ విపక్షాల సహకారంతో అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని కలలు కంటోంది. ఈసారి ఎన్నికలు అన్ని పక్షాలకు అత్యంత ప్రతిష్ఠాత్మకం. ప్రజల్లో విశ్వాసాన్ని, ప్రతిష్ఠను ఎవరు ఎక్కువగా సంపాయించుకుంటే? వారికే అధికార పీఠం వశమవుతుంది. ‘ఇండియా’ పేరుతో కూటమి ఏర్పాటుతోనే సంబరం కాదు. ఐకమత్యాన్ని నిలబెట్టుకోవడం విపక్షాలకు ముఖ్యం. అతివిశ్వాసం,  అహంకారం అధికారపక్షానికి తగదు. ప్రజలు అన్నీ గమనిస్తూనే వుంటారానే స్పృహ అన్ని పక్షాలకు అవసరం.

Also read: వేదవిద్యాపారంగతుడు మాణిక్య సోమయాజులు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles