- రహానే, సుందర్, సిరాజ్ లకూ అభినందనల వెల్లువ
ఆస్ట్ర్రేలియాను ఆస్ట్ర్రేలియా గడ్డపై ఓడించి స్వదేశానికి తిరిగి వచ్చిన టెస్ట్ సిరీస్ హీరోలు విజయానందంతో గాల్లో తేలిపోతున్నారు. తమతమ స్వస్థలాలకు తిరిగి వచ్చి కుటుంబసభ్యులు, స్నేహితులతో కలసి మురిసిపోతున్నారు. బ్రిస్బేన్ టెస్ట్ లో భారత్ అపూర్వ విజయంలో ప్రధానపాత్ర వహించిన యువపేసర్ నటరాజన్ , స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, కెప్టెన్ అజింక్యా రహానే, పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ లకు తమతమ నగరాలలో ఘనస్వాగతం లభించింది.
చిన్నంపట్టిలో జనరథం…
భారత్ లో క్రికెట్టే మతం అని మరోసారి తెలిపోయింది. తమ అభిమాన క్రికెటర్లను దేవుడితో సమానంగా చూడటం, పిచ్చిగా అభిమానించడం కేవలం భారత అభిమానులకు మాత్రమే చెల్లు అనుకొనేలా…యువ పేస్ బౌలర్ తంగారసు నటరాజన్ కు అతని స్వగ్రామం చిన్నంపట్టి గ్రామప్రజలు అపూర్వరీతిలో ఘనస్వాగతం పలికారు.
బ్రిస్బేన్ నుంచి దుబాయ్ మీదుగా బెంగళూరు విమానాశ్రయం చేరిన నటరాజన్ కు అక్కడి ప్రయాణికులు స్వాగతం పలికారు. నెట్‌బౌలర్ నుంచి టెస్ట్ బౌలర్ స్థాయికి ఎదిగిన తమ గ్రామముద్దుబిడ్డ నటరాజన్ కోసం వేలూరు జిల్లాలోని చిన్నంపట్టి గ్రామప్రజలు ఓ రథాన్ని సిద్ధం చేశారు. బెంగళూరు నుంచి తమ గ్రామంలోకి ప్రవేశించిన వెంటనే నటరాజన్ ను పల్లకీ ఆకారంలో తయారు చేసిన గుర్రపు బగ్గీ రథంలో ఊరేగింపుగా తీసుకువచ్చారు.
ఈ గ్రామంలో వూరిప్రజలంతా పాల్గొనడం విశేషం. ఒక్క మాటలో చెప్పాలంటే మారుమూల గ్రామం చిన్నంపట్టిలో పండుగవాతావరణం చోటు చేసుకొంది. కేవలం రెండువారాల వ్యవధిలోనే భారత వన్డే, టీ-20, టెస్టు క్యాప్ లు సాధించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించిన ఘనత నటరాజన్ కు మాత్రమే దక్కుతుంది. నటరాజన్ రథం ఊరేగింపు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించాడు.
Also Read : ఖాళీ స్టేడియాలలో క్రికెట్ మ్యాచ్ లకు ఇక సెలవ్
‘‘ఇది భారత్. ఇక్కడ క్రికెట్ కేవలం ఓ ఆట మాత్రమే కాదు.. అంతకు మించి చాలా…చాలా… నటరాజన్‌కు తన గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. వ్వాటే స్టోరీ’’ అనే క్యాప్షన్‌తో వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరో సారి షేర్ చేయడం ద్వారా తన ఆనందాన్ని పంచుకొన్నాడు.
సుందరం…సుమధురం…
బ్రిస్బేన్ టెస్ట్ చారిత్రక విజయంలో తనవంతు పాత్ర నిర్వర్తించిన యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కు చెన్నైలో అభిమానులు, కుటుంబసభ్యులు ఘనస్వాగతం పలికారు. బ్యాటింగ్ లో , బౌలింగ్ లో 22 సంవత్సరాల సుందర్ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో శార్దూల్ తో కలసి రికార్డు భాగస్వామ్యంతో పాటు 62 పరుగుల స్కోరు సాధించాడు. స్పిన్నర్ గా 3 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ చేజింగ్‌లో సైతం దూకుడుగా ఆడాడు. 22 పరుగులు సాధించాడు.
టెస్ట్ మ్యాచ్ అరంగేట్రంలోనే అంచనాలకు మించి రాణించిన తన కుమారుడుని చూసి అతని తండ్రి ఎం. సుందర్ పొంగిపోతున్నారు. ఆస్ట్రేలియాలో సుందర్ ప్రదర్శన చాలా ప్రత్యేకమైనదని, అతనికి గొప్పక్రికెటర్ కాగలిగిన సత్తా ఉందంటూ మురిసిపోతున్నారు.
Also Read : తండ్రి సమాధి వద్ద సిరాజ్ భావోద్వేగం
వాషింగ్టన్‌లో నైపుణ్యం, శ్రమించే తత్వం, అంకితభావం, క్రమశిక్షణ ఉన్నాయని, భారతజట్టులో సుదీర్ఘకాలం కొనసాగేలా దేవుడు దీవించాలని కోరుకొంటున్నట్లు చెప్పారు. వాస్తవానికి ఆఖరి టెస్ట్ లో ఈ స్పిన్ ఆల్‌రౌండర్‌కు అనూహ్యంగా చోటు దక్కింది. రెగ్యులర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజా ఇద్దరూ లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సుందర్‌ను తీసుకున్నారు.
రహానేకు రెడ్ కార్పెట్…..
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భారత్‌కు చిరస్మరణీయమైన విజయం అందించిన సారథి, తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానేకు ముంబైలో అభిమానులు,కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు. అతడికి అభిమానులు, తమ ఇరుగుపొరుగువారు జేజేలు పలికారు. ‘ఆలా రే ఆలా అజింక్య ఆలా’ (మా అజింక్య వచ్చేశాడు) అంటూ నినాదాలు చేశారు. రహానే నివాసం వద్ద పండగ వాతావరణం నెలకొంది. సంప్రదాయ ఢోల్ తషా చప్పుళ్లతో.. పూలు చల్లుతూ రెడ్‌కార్పెట్ పరిచి రహానేకు స్వాగతం పలికారు. ఆసీస్ జాతీయ జంతువు కంగారూ రూపంలో తయారు చేసిన కేక్‌ను కట్ చేసేందుకు అజింక్య నిరాకరించడం ద్వారా తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు.
నాన్నకే ఆ 5 వికెట్లు అంకితం…
బ్రిస్బేన్ టెస్టు రెండోఇన్నింగ్స్ లో తాను సాధించిన ఐదు వికెట్లను తన దివంగత తండ్రికి అంకితమిస్తున్నట్లు హైదరాబాదీ కమ్ భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రకటించాడు. ఐపీఎల్, ఆస్ట్ర్రేలియా పర్యటనల కారణంగా గత ఐదుమాసాలుగా కుటుంబానికి దూరంగా ఉన్న సిరాజ్ నగరానికి తిరిగి వచ్చిన వెంటనే తనతండ్రి సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించాడు. తనతండ్రి లేకపోతే తాను లేనని, భారత్ కు టెస్ట్ మ్యాచ్ ఆడటం ద్వారా నాన్నకలను సాకారం చేశానని భావోద్వేగంతో సిరాజ్ చెప్పాడు.
మొత్తం మీద..ఆస్ట్ర్రేలియాతో టెస్ట్ సిరీస్ విజయం భారత క్రికెటర్లకు మాత్రమే కాదు…అభిమానులకు సైతం ఓ తీయటిజ్ఞాపకంగా మిగిలిపోతుంది.
Also Read : స్వస్థలాలకు చేరిన క్రికెట్ హీరోలు