* ధర్మపురి జాతర ఉత్సవాలు స్వామివారి కళ్యాణం
* ప్రభుత్వం పక్షాన తలంబ్రాలు పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్
ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి జాతర ఉత్సవాలలో ప్రధాన ఉత్సవం శ్రీ స్వామివారి కళ్యాణం గురువారం గోధూళి సుముహూర్తాన ఆలయ ప్రాంగణంలోని శేషప్ప కళా వేదికపై అంగరంగ వైభవంగా జరిగింది.
స్వామివారి కల్యాణంకు ప్రభుత్వం పక్షాన జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోతు రవి దంపతులు తలంబ్రాలు, పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపత్ని స్నేహలత, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధర్మపత్ని విజయలక్ష్మి స్వామివారికి తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి సంగీ సత్యమ్మ కుటుంబ సభ్యులు స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. వీరితో పాటు జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజేశం దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి దావా వసంత తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
Also Read : ధర్మపురి నాట్యమండలికి 85 వసంతాలు
ప్రముఖ ప్రవచకులు, శృంగేరి పీఠం ఆస్థాన విద్వాంసులు డాక్టర్ బాచుపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పాల్గొని స్వామివారి కళ్యాణం తీరు ఆవశ్యకత హిందూ ధర్మ విశిష్టత గురించి ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశారు. ఒకే వేదికపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరగడం ఈ క్షేత్రం ఈ ప్రాంత ప్రత్యేకత అంటూ ఆయన వ్యాఖ్యానం చేశారు. వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, ముత్యాల శర్మ మధు సాంబయ్య ఘనాపాఠి, కాసర్ల వంశీకృష్ణ. మధు మహదేవ్. అర్చక స్వాములు నంబి శ్రీనివాసాచార్యులు , నేరెళ్ల శ్రీనివాసాచార్యులు వంశీ, పాలెపు ప్రవీణ్ శర్మ, బొజ్జ కుమార్, సంతోష్ శర్మ , కందాల పురుషోత్తం ఆచార్యులు. నంబి నరసింహమూర్తి, తదితర వేదపండితులు అర్చకస్వాములు వేదమంత్రాల ఘోషతో మంగళ వాయిద్యాలు కన్నుల పండువగా నిర్వహించారు. సాయంత్రం 6-35 నిమిషాలకు ప్రారంభమైన కళ్యాణ మహోత్సవ కార్యక్రమం 8 గంటల 22 నిమిషాలకు మంగళసూత్రధారణ వరకు ఘనంగా కొనసాగింది. స్థానిక ఎస్.ఆర్.ఆర్ కేబుల్ నెట్వర్క్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆలయ అధికారులు సిబ్బంది,పోలీస్ అధికారులు సిబ్బంది, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
Also Read : ధర్మపురి శ్రీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు