ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం హుందాగా సాగడం లేదు. పట్ట భద్రుల ఓట్ల కోసం కూడా సామ దానభేదదండోపాయాలు ఉపయోగిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ నెల జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే విధంగా ప్రచారంలో ఆరోపణలు చేసుకుంటున్నారు. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. నల్లగొండ- ఖమ్మం-వరంగల్ నియోజక వర్గంలో అభ్యర్థులు ఎక్కువే.. ప్రచారాలు ఎక్కువే కనిపిస్తున్నాయి. ఇక టీవీ లలో డిబేట్లు పెరిగాయి. గెలుపు ఓటముల మీద సర్వేలు జరుగుతున్నాయి. అనుభజ్ఞులైన విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. భవిష్యత్ వాణి వినిపిస్తున్నారు.
డబ్బు ప్రభావం ఓటర్లపైన కనిపిస్తోంది
టిఆర్ఎస్ పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం లాంటివని మరి కొందరు ఉత్సాహవంతులు చెప్పేస్తూ తృప్తి పడిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కన్నా అధికంగా పత్రికల్లో ప్రకటనల పరంపర కూడా సాగుతున్నది. సవాళ్లకు కొదువ లేదు. ఉద్యమ పార్టీలు, ఉద్యమ కారులు పోటీ పడుతున్నారు. పట్టభద్రులు అంటేనే విజ్ఞత గలవారు. అయితే, ఇంకా మారని ఎన్నికల ప్రక్రియ వల్ల ఇక్కడ డబ్బు ప్రభావం, రాజకీయ పార్టీల ప్రభావం ఓటర్ల పైన కొంత కనిపిస్తోంది. అయితే అసెంబ్లీలో మాదిరి పరిస్థితి ఉండదు. పట్టభద్రులు ఇక్కడ ఎప్పుడూ విజ్ఞతతోనే వ్యవహరించారు.
Also Read : నేర రహిత సమాజ నిర్మాణంలో సిసి కెమెరాలు కీలకం
తీర్పు భిన్నంగా ఉంటుంది
ఈసారి ఓటర్స్ లో దేశంలో ఉన్న పరిస్థితులు.. వంద రోజులకు చేరుకుంటున్న అన్న దాతల ఉద్యమ నేపద్యాన్ని కేంద్రం తీరు ప్రభావం సైతం ఉంటుంది. గ్రౌండ్ లో ఆ ప్రభావం కనిపిస్తోంది.. పట్టభద్రులైన రైతులు వారి కుటుంబ సభ్యుల్లో ఈ ప్రభావం ఉండే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తీర్పు రొటీన్ గా ఏమీ ఉండదు. తీర్పు తప్పని సరి షాకింగ్ గానే ఉంటుంది. బొగ్గు గనుల ప్రాంతంలో గల పట్టభద్రులు ఉద్యమకారులైన అభ్యర్థుల పై దృష్టి సారిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థుల వెంట యూనియన్ నాయకులు తిరుగుతున్నారు.
నేత ఆలోచనలకు భిన్నంగా పరిస్థితులు
చాలా చోట్ల అటు ఖమ్మం జిల్లా అయినా, వరంగల్ జిల్లాలో అయినా రాజకీయ పార్టీల కోలాహలం ఉన్నప్పటికీ నాయకుల ఆలోచనకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. టిఆర్ఎస్.. కాంగ్రెస్.. బిజెపి నాయకులు తామే గెలుస్తామనే నమ్మకం పెట్టుకున్నారు. విజ్ఞానవంతులైన పట్టభద్రులు అయిన ఓటర్స్ తప్పనిసరిగా ఎలాంటి ప్రభావానికి లోను కాకుండా అభ్యర్థుల లో కాస్త మెరుగైన అభ్యర్థినే ఎన్నుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పరస్పర విమర్శలు.. సవాళ్లు వృధా ప్రయాస అవుతాయంటే అతిశయోక్తి కాదు. క్షేత్రవాస్తవికతను అర్థం చేసుకోవాలి. పెద్దల సభకు పోటీ చేసేవారు ప్రచారంలోను హుందాగా ఉండాల్సిన అవసరం ఉంది. 70 మందికి పైగా పోటీలో ఉన్నారు. గెలుపు పై ఎవరికి వారు భరోసాతో ఉన్నారు. గెలుపు కోసం కక్కుర్తి పడుతున్న వారు ఉన్నారు. అభ్యర్తి ఎవరు గెలిస్తే ఎలాంటి ప్రయోజనం సమాజానికి ఉంటుందని పట్టభద్రులు ఆలోచిస్తున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Also Read : సాగర్ లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్