Sunday, December 22, 2024

సామాజిక మాధ్యమాలకు ముకుతాడు

నియమావళి రూపొందించిన కేంద్ర ప్రభుత్వం

ఫిర్యాదులను 24 గంటల్లోగా పరిష్కరించాలని మార్గదర్శకాలు

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన ట్విటర్

ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాలు ప్రపంచ గతినే మార్చివేస్తున్నాయి. మనదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్,  ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాలు సమాచార మార్పిడిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రజాభిప్రాయాన్ని మార్చగలిగే శక్తి, సమాచార మార్పిడితో కోట్లాది మందిని ప్రభావితం చేయగలిగే వార్తలను చేరవేయడంలో పెద్ద పెద్ద సామాజిక మాధ్యమాలు ఎనలేని పాత్ర పోషిస్తున్నాయి. అయితే కొన్ని సందర్భాలలో సామాజిక మాధ్యమాల్లో చట్టవిరుద్ధమైన, తప్పుడు సమాచారం చేరి విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక వ్యక్తికి సంబంధించిన ఆందోళన లేదా బాధను పంచుకోవడానికి సామాజిక మాధ్యమాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఈ మధ్యకాలంతో అనేక ఉద్యమాల వ్యాప్తికి, రాజకీయ ప్రచారాలకు సైతం సామాజిక మాధ్యమాలను విరివిగా వినియోగిస్తున్నారు.  దీంతో మంచి కంటే చెడు ఎక్కువ జరిగే సందర్భాలు కూడా ఉన్నాయి.

దీంతో పలు దేశాలు సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. అసత్య ప్రచారాన్ని వ్యాపింపచేస్తున్న సోషల్ మీడియా సంస్థలను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కూడా కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సామాజిక మాధ్యమాలకు కొత్త నియమావళిని రూపొందించింది. నూతన మార్గదర్శకాల ప్రకారం సామాజిక మాధ్యమ సంస్థలు తప్పనిసరిగి ఫిర్యాదులు స్వీకరించేందుకు కావాల్సిన వ్యవస్థను రూపొందించుకోవాల్సి ఉంటుంది.  దీనికి గాను ఫిర్యాదులను పరిష్కరించేందుకు ముఖ్య అధికారితో పాటు మరో నోడల్ అధికారిని నియమించుకోవాల్సిఉంటుంది. యూజర్లు చేసే ఫిర్యాదులను 24 గంటలపాటు నిరాఘాటంగా స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మహిళలకు సంబంధించిన అసభ్యకరమైన, మార్పిడిచేసిన ఫొటోలపై వచ్చే ఫిర్యాదులను 24 గంటల్లోగా పరిష్కరించాలని కొత్త మార్గదర్శకాలలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

సర్వోన్నత న్యాయస్థానం సూచన :

సోషల్ మీడియా దుర్వినియోగం, విద్వేష పూరిత ప్రసంగాలు, ఏదైనా ఓ వర్గం వారిని రెచ్చగొట్టే వ్యాఖ్యలను నివారించేందుకు మార్గదర్శకాలను రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఓటీటీ, సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని సునిశితంగా పరిశీలించి విస్తృతంగా చర్చలు జరిపిన మీదట వాటికి సంబంధించి నూతన మార్గదర్శకాలను విడుదల చేసినట్లు కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌  ప్రకటించారు.

ఇదీ చదవండి: సోషల్ మీడియా సామాజిక విప్లవమా?సమస్యల సమాహారమా?

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించని ట్విటర్:

సామాజిక మాధ్యమాలపై నియంత్రణ ఉండాలనే అంశంపై  భారత్‌తోపాటు ప్రపంచదేశాలలో చర్చ జరుగుతోంది. సాగు చట్టాలపై ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంబంధించి విద్వేష ప్రసంగాలు, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారంటూ 12 వందలకు పైగా ఖాతాలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌ను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన ట్విటర్‌ కొన్ని ఖాతాలను మాత్రమే తొలగించి తమ యూజర్ల భావవ్యక్తీకరణకు భంగం కలిగించబోమని కేంద్రప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై కేంద్రంలోని మోడీ సర్కార్ నూతన మార్గదర్శకాలను తీసుకొచ్చింది.

ఇదీ చదవండి: గీత దాటుతున్న సోషల్ మీడియా

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles