Saturday, December 21, 2024

మేఘం వంటి భగవంతుడు, ఆచార్యుడు

  • గోవింద గోదా గీతం – 4

ఆళిమళైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్
ఆళియుళ్ పుక్కు ముగున్దు కొడార్తేరి
ఊళిముదల్వ నురువమ్పోల్ మెయికరుత్తు
పాళియందోళుడై పర్పనాబన్ కైయిల్
ఆళిపోళ్ మిన్ని, వలమ్బురి పోల్ నిన్రదిరిన్దు
తాళాదే శార్ జ్ఞ్గముదైత్త శరమళైపోల్
వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళిన్దేలో రెమ్బావాయ్ !

ప్రతిపదార్థములు

ఆళి = సముద్రం వలె గంభీరస్వభావంగల, మళైక్కణ్ణా = వర్షాలకు అధిపతియైన వరుణదేవా, నీ ఒన్రు = నీవు ఇసుమంతైనా, నీ = నీవు, కై కరవేల్ = దాచుకోవద్దు, ఆళియుళ్ = సముద్రంలోపల, పుక్కు = చొరబడి, ముగున్దు కొడు = అక్కడున్న నీటిని, ఆర్తు = మేఘ గర్జనలుచేస్తూ, ఏఱి =ఆకాశంలో వ్యాపించి, ఊళిముదల్వన్ = కాలము వంటి అనేక చరాచర పదార్థాలకు కారణ భూతుడైన నారాయణుని యొక్క, ఉరువమ్పోల్ = శరీరం వలె, మెయికరుత్తు= శ్యామవర్ణ శరీరంగా, పాళియందోళుడైయ = మహనీయమూ, మనోహరమూ అయిన భుజస్కందాలు కలిగిన వాడు, పర్పనాబన్ కైయిల్ = పద్మనాభుని దక్షిణ హస్తమందున్న, ఆళిపోళ్ మిన్న =చక్రాయుధం వలె మెరుపులు మెరిపించి, వలమ్బురి పోల్ = దక్షిణావర్త శంఖమైన పాంచజన్యం వలె, నిన్రదిరిన్దు =స్థిరంగా నిలిచి ఘోషించి, తాళాదే = ఆలస్యం చేయకుండా, శార్ జ్ఞ్గ =పరమాత్ముడి విల్లైన శాజ్ఞ్గమ్, ముదైత్త శరమళైపోల్ =వేగంగా కురిపించి బాణముల వర్షం వలె, వాళవులగినిల్ = విశ్వంలోని సకల జీవరాశి జీవించడానికి, నాంగళుమ్ = వ్రతాన్ని ఆచరించే మేమూ, మగిళిన్దు = సంతోషంతో, మార్గళి నీరాడ = మార్గళి స్నానం చేయడానికి, పెయ్ దిడాయ్ = వర్షాన్ని కురిపించాలి.

బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు తిరుప్పావై పాశురాలకు తెలుగులో రచించిన పద్యం ఇది.

కావవే పర్జన్యదేవ: నీనెనరు మా

          పై సుంతయును కొరవడగ నీక

అంభోధిపై వాలి అచటి నీళులు త్రావి

          గర్జింపుచును మింటి గనను ప్రాకి

కాలాది సర్వాది కారణుండగు శ్రీ వి     

          భుని వోలె నల్లని తనువు తాల్చి

జగదేక సుందరుండగు స్వామి దక్షిణ

          హస్తమందలి చక్రమట్లు మెరసి

మొరసి తత్ శంఖమ్ము పోలిక – తత్ శార్ఞ్గ

          వరముక్తశర పరంపర విధాన

వర్షింపులోకులు హర్షింప, మేమును

          మార్గశీర్షస్నాన మాచరింప1

భావార్థము:

నా దేశం కరువులు లేని సుభిక్ష దేశంగా వర్ధిల్లాలి. పంటలు పండేట్టు. ఆకలి లేని ఆనందం విరిసేట్టు, వర్షం కురియాలి, ఆ నీలమేఘ శ్యాముడే గగన సదృశుడైన హరి నారాయణుడే మేఘమై రావాలని గోదమ్మ ఈ వ్రతం ప్రారంభించింది. మేఘం స్వభావం గాంభీర్యం, వర్షానికి వాహకుడు మేఘుడు. పర్జన్య దేవుడని మనం సమ్మానిస్తాం. ఆ మేఘానికి ఈ పాశురం ద్వారా ప్రార్థన చేస్తున్నది. ఓ మేఘమా నీవు దాతృత్వములో చూపే ఔదార్యాన్ని ఏమాత్రమూ కూడా తగ్గించరాదు. గంభీరమైన సముద్రంలో మధ్యకు వెళ్లి, ఆ సముద్ర జలాన్ని త్రాగి, గర్జించి, ఆకాశమంతటా వ్యాపించి, సర్వజగత్కారణ భూతుడైన శ్రీమన్నారాయణుని నీల మేఘ విగ్రహమువలె శ్యామల మూర్తియై, ఆ పద్మనాభుని విశాలసుందర బాహుయుగళిలో దక్షిణ బాహువునందలి చక్రమువలె మెరసి, ఎడమచేతిలోని శంఖమువలె ఉరిమి, శార్జ్గ్ మనే ధనుస్సు విడిచే బాణముల ములుకుల వర్షం వలె వర్షించాలి. లోకమంతా సుభిక్షంగా ఉండేట్టు మేమంతా సంతోషంతో మార్గశీర్ష స్నానము చేసేట్టు గా వర్షాన్ని కురిపించవూ అంటున్నది ఆండాళమ్మ. వర్షానికి కులమత భేదాలు హెచ్చుతగ్గులు లేవు. సమానంగా కురుస్తాయి.  గోదాదేవి వలెనే రామానుజుడు కూడా వేయి సంవత్సరాల కిందట గోపురమెక్కి నారాయణ మంత్ర రహస్యాల జ్ఞాన వర్షాన్ని లోకశ్రేయస్సు కోసం స్వ పర భేదం లేకుండా హెచ్చుతగ్గుల లెక్క లేకుండా అందరికీ వర్షించిన వాడు.

Also Read : గోవింద గోదా గీతం తిరుప్పావై -3

అంతరార్థం

గోపికల వ్రతానికి కారణం స్వార్థం కాదు, వారి లక్ష్యం దేశం క్షేమమే. తమ వ్రతం చేత లోకమంతటా పాడిపంటలు సమృద్ధిగా ఉండాలన్నదే వారి కోరిక. ఈ వ్రతానికి స్నానమే ప్రధానం. దీన్ని స్నాన వ్రతం అనీ అంటారు. వారి స్నానానికి జలం సమృద్ధిగా ఉండాలి. గోపికలు కృష్ణభగవానుడే ‘ఉపాయము, ఆయనే ఫలము’ అని నిశ్చయించుకొన్నారు. ఇతరములయిన ఏ ఫలితాలను వారు ఆశ్రయింపరు, వారిది అనన్య భక్తి.

govinda goda githam tiruppavai 4

భగవంతుడు సర్వేశ్వరుడు. ఆయనే అందరినీ వివిధ అధికారాలలో నియమించారు. బ్రహ్మను సృష్టికార్యానికి, శివుడిని లయకార్యానికి, అష్టదిక్పాలకులను తదితర కార్యాలకు నియుక్తులను చేశారు. సర్వేశ్వరుని ఆశ్రయిస్తే ఆ భగవానుడు నియమింన దేవతలందరూ భక్తులను అనుసరిస్తారు.నారాయణుడే పర్జన్యదేవుడిని వర్షాలు కురిపించే బాధ్యతకు నియమించినాడు. ఈ విధంగా నియమితులందరూ భగవంతుడికి భయపడి తమ విధులు నిర్వర్తిస్తుంటారు. వారు భగవంతుడికే కాదు భగవన్నామ సంకీర్తన చేసే వారికి కూడ భయపడుతూ ఉండాలి. ఒకసారి కూరత్తాళ్వార్ ను ‘అన్యదేవతలను చూసినపుడు మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారు?’ అని అడిగితే ‘మీరు శాస్త్ర విరుద్ధంగా అడుగుతున్నారు. మిమ్మల్ని చూసి అన్యదేవతలు ఏ విధంగా ప్రవర్తిస్తారు అని అడగాలి’ అని సమాధానం చెప్పారట. పరమాత్మనాశ్రయించిన వారివద్ద, భగవానునివద్ద వినయవిధేయతలతో మెలిగినట్లు దేవతలందరూ కూడా వారికి ఆజ్ఞావశవర్తులై ఉంటారట. పరమాత్మను ప్రసన్నం చేసుకుంటే ఇతర దేవతలంతా ప్రసన్నమవుతారు.

Also Read : నారాయణచరణాలే శరణు

ఆళి మళైకణ్ణా = వర్షనిర్వాహకుడా, వర్షం కురిపించే మేఘుడు, అది పాపాత్ములుండే చోటని తక్కువ పుణ్యాత్ములున్నారని ఎక్కువ ఉన్నారని కాకుండా అంతటా సమానంగా కురుస్తూనే ఉంటాడు. ఒన్ఱునీకైకరవేల్ =నీకై ఏమీ దాచుకోకుండా, పుణ్యుల చోటు, పాపులున్నచోటని, ఎడారి అనీ పంటపొలమనే పక్షపాతం లేకుండా అంతటా సమంగా వర్షాన్ని కురిపించు. గర్జించు. నీ గర్జనలు విని లోకం సంతోషించాలి. ఆర్ తు ఏఱి.. గర్జించి మిన్నంది..ఆకాశమంతా వ్యాపించు. వూళి ముదల్వనుర్వంబోల్ =చేతనాచేతన పదార్థములకు కారణభూతుడైన సర్వేశ్వరుడి మేని వలెనే, మేయ్ కరత్తు = మేఘమువంటి మేనిఛాయగల తమ నాయకుని వలె మేఘము అని పోల్చుతున్నారు.

పాళి యందోళుడై = విశాలమైన బాహువులకలవాడు. రాముని బాహుబలంతో లోకమంతా సురక్షితమైంది. నాభియందున్న బ్రహ్మను తొట్టెలోయుంచి నారాయణుడు భుజాలతో కాపాడినాడట. పఱ్పనాభన్ కైయిల్ ఆజ్ పోల్ మిన్ని = పద్మనాభుని చేతిలో చక్రంవలె మెరిసి, మేఘం కురియాలనికోరుతున్నారు. వలమ్బురిపోల్ శ్రీ కృష్ణుని పాంచజన్యం కురుక్షేత్రంలో పాండవపక్షంలో హర్షం కురిపించినట్టు, నిన్దురిన్దు= నిలిచి గర్జించాలట. తాళాదే = ఆలస్యం చేయకుండా, శార్ ఙ్గముదైత్త శరమళైపోల్ వింటినుండి చిమ్మిన శరముల వలె రామబాణ వర్షము కురిపించాలి. నాఙ్గళుమ్ మగిళిన్దు మార్గళ నీరాడ =మేం సంతోషించి మార్గళి స్నానంచేసేట్టు అంటున్నారు.

మూడవ, నాలుగవ, అయిదవ పాశురములు త్రికాల సంధ్యా వందనములకు ప్రతీకలని, ప్రవచన సార్వభౌములు కీర్తి శేషులు శ్రీ భాష్యం అప్పలా చార్యుల వారు వివరించారు. ఉదయాన మిత్రుని, సాయంకాలం వరుణుని మధ్యాహ్నం సూర్యుడిని ప్రార్థిస్తారు. జీయర్ స్వామి వారు మరో అద్భుత వాక్యం చెప్పారు. మనలో మంచితనాన్ని మేల్కొలుపడానికి ఈ వ్రతాన్ని గోద రచించారని. అందరం కలిసి అందరికోసం దేశం కోసం మంచి కోసం వ్రతం చేయాలనే సంఘీభావాన్ని ఆమెప్రకటించారు.

మేఘమే ఆచార్యుడు

ముందుగా మేఘాన్ని నారాయణుడితో పోల్చుతారు ఆండాళ్. ఆ తరువాత అంతరార్థంలో మేఘమును ఆచార్యుడితో పోలుస్తున్నారు. త్రాగడానికి వీలుకాని సముద్రజలాన్ని మేఘం గ్రహించి, కడుపులో దాచుకుని, కదిలి జనావాసాల మీదకు ప్రయాణించి, అక్కడ ఉరిమి, మెరిసి, త్రాగునీటిగా మార్చి, కురిసి సంపన్నులను చేసేది మేఘం. ఆ విధంగానే అర్థం కాని సంక్లిష్ఠమైన శాస్త్రాలను అధ్యయనం చేసి అర్థం చేసుకుని అర్థమయ్యేట్టుగా బోధించేవాడు ఆచార్యుడు.  భగవంతుడికన్న ఆచార్యుడికే ఎక్కువ దయ. మేఘం సముద్రంలోని ఉప్పునీటిని త్రాగి, తీయని జలాన్ని కురిపిస్తుంది. కఠినమైన శృతి సాగర జలాలను ద్రావి, వాటిని సులభంగా అర్థమయ్యే రీతిలో మార్చి బోధించే ఆచార్యుడూ అంతే. భగవద్గుణాలను సుబోధకంగా బోధించే వాడే అసలైన ఆచార్యుడు. ఆయన రెండు గుణాలు బోధించాలట. ఒకటి: భగవంతుడు మనచే ఆశ్రయించుటకు అందుబాటులో నుండువాడే అని మనకు తోచి ఆశ్రయించడానికి వీలుకల్పించే గుణములు. రెండు: ఆశ్రయించిన వారి కార్యములను చేయగలవాడు భగవంతుడు అనేట్లు స్ఫురింప చేసే గుణములు.

జ్ఞానవర్షం

ఆచార్యుడిచ్చేది జ్ఞానమే. అదనంగా తెలిసింది ఆచరించడం అంటే మెరుపు. శంఖమువంటి ధ్వని అంటే ఆచార్యుని వేదఘోష. ఆజిమజక్కణ్ణా = భగవద్గుణానుభవాన్ని వర్షించే ఆచార్యుడా. ఒన్ఱునీకైకరవేల్ = భగవంతుని ఆశ్రయింపజేయునట్టి ఆచార్యసార్వభౌమా. ఆజ్ యుళ్ పుక్కుముగున్దుకొడు =ఉభయ వేదాంత సాగరముల అట్టడుగుదాకా మునిగి వాని అర్థవిశేషములను గ్రహించి, అర్తు =గర్జించి, తిరుగోష్టియూర్ గోపురమెక్కి రామానుజుడు గర్జించినట్టు, పాజ్ యన్తోళుళై పఱ్పనాభన్ కైల్= పద్మనాభుని చేతిచక్రమై భగవత్ విరోధులను త్రుంచి వేసేది, రామానుజుడు కుదృష్టి మతములను అణగద్రొక్కినట్టు. వలంబురిపోల్ = పాంచజన్యమువలె జ్ఞానబోధ ద్వారా వైష్ణవ మతవ్యాప్తిచేస్తాడు. తాజాదే శార్ ఙ్గమ్ ఉదైత్త =శ్రీరాముని బాణముల వర్షముచేత శిష్టరక్షణ జరిగినట్టు ఆచార్యుని కారుణ్యవర్షముచేత చేతనులు స్వరూప జ్ఞానము సాధించి ఉజ్జీవింతురు. నాఙ్గలుమ్ మార్గళినీరాడ = ఆచార్యాభిమానమునందే నీరాడుట. పర్జన్యదేవుని అడగగానే భగవద్భక్తులకు సాయం చేసే సదవకాశం లభించినందుకు సంతోషించి వెంటనే మన్నించాడట. ఆచార్యుడు కూడా అడిగిన వెంటనే జ్ఞాన వర్షం కురిపిస్తాడు.

Also Read : హరిగుణ గానమే స్నానమట

గోపికలు సర్వోత్తముడైన సర్వేశ్వరుని శ్రీనామాలు కీర్తించి వ్రతాన్ని ప్రారంభించారు. వారి కోరికను నెరవేర్చడానికి మేఘుడు సాక్షాత్కరించాడు. మేఘుడు ఏ విధంగా కురవాలో గోపికలు ఆజ్ఞాపిస్తున్నారు.
నారాయణుడు మేఘ వర్ణుడు. ‘నీలతోయద మధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా’ అన్నట్టు మెరుపులతో కూడిన మేఘం వలె ఉంటాడట నారాయణుడు. ఇది వేదవాక్కు.

‘‘శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవేనందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళమ్’’

Also Read : శ్రీవైష్ణవ ఆళ్వార్లలో ఏకైక స్త్రీమూర్తి గోదా కవయిత్రి

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles