Tuesday, January 28, 2025

మనసులే సుమాలైతే మాధవుడు మనవాడే

  • గోవింద గోదా గీతం తిరుప్పావై –  5

గోదాదేవి అయిదో పాశురంలో చెప్పిన భగవదనుగ్రహ ప్రాధాన్యత, అన్నమయ్య కీర్తన అంతర్యామిలో అక్షరక్షరంలో కనిపిస్తుంది. భగవంతుని అయిదో స్థానం అర్చారూపం అని గోదాదేవి విప్పిచెప్పిన పాశురం ఇది.

మనం తెలిసీ తెలియక ఎన్నో పాపాలు చేశాము. పోయిన జన్మలలో చేసిన పాపాలెన్నో తెలియదు. ఈ పాపాలన్నీ పోయిన తరువాతనే గదా మనకు శ్రీకృష్ణసంశ్లేషం లభిస్తుంది. పాపాలన్నీ ప్రక్షాళన అయ్యేదెప్పుడు? రుషులు మునులకే తపస్సులు ఫలించలేదు ఎందుకంటే పాపాలు ప్రక్షాళన కాలేదు కనుక. అయినా మంచి పనులు చేయడానికి ఆటంకాలెన్నో. ఓ సరస్సులో తామరపూవుపై తుమ్మెద వాలింది. సాయంకాలం గడిచిపోతున్న విషయం గమనించలేదు. పద్మము మూసుకుపోయి లోపలే బందీ అయింది. సరే రాత్రి గడిచి తెల్లవారగానే సూర్యుడుదయిస్తాడు, పద్మము వికసిస్తుంది. తాను విడుదలైస్వేచ్ఛగా వెళ్లిపోతాను కదా అని నిశ్చింతగా నిద్రపోయిందట. కాని అంతలోనే ఒక ఏనుగు సరస్సులో జొరబడి తామరతూండ్లను తొండంతో తెంపి విసిరికొట్టింది. పద్మం తెరుచుకోనేలేదు. దైవం అనుకూలంగా లేకపోతే మన ప్రయత్నం ఫలించదు కదా అని సందేహం. ఇటువంటి వన్నీ కర్మఫలితాలంటూ ఈ సంశయానికి గోదాదేవి ఈ పాశురంలోసమాధానాలిచ్చారు. 

పాశురం 5

మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్

Also Read : మేఘం వంటి భగవంతుడు, ఆచార్యుడు

ప్రతిపదార్థాలు

మాయనై = ఆశ్చర్యకరమైన, మన్ను = ఎల్లప్పుడు భగవత్సంబంధము గలవాడు, వడమదురై మైందనై =ఉత్తరమధురానగర నాయకుడైన, తూయ =పరిశుధ్ధుడైన, పెరునీర్ = మహాజలప్రవాహముగల, యమునైత్తుఱైవనై= యమునానదీ తీరమున ఉండే వాడు, ఆయర్ కులత్తినిల్ = గోపవంశంలో, తోన్ఱుం =ప్రకాశించిన, మణి విళక్కై= మణిదీపమైన వాడిని, తాయై క్కుడల్ = తల్లి యశోద కడుపున, విళక్కం శెయ్ద =ప్రకాశంపచేసిన, దామోదరనై= దామోదరుని, తూయోమాయ్ =పరిశుద్ధులమై, వందు = వచ్చి, నాం తూ =పవిత్రమైన, మలర్ =పూలను, తూవి = అక్రమముగా విసిరి, త్తొళుదు =సేవించి, వాయినాల్ పాడి = నోటితో పాడి, మనత్తినాల్ = మనస్సుతో, శిందిక్క=చింతించి, ధ్యానము చేసి, పోయ పిళైయుం = ముందటి పాపములున్నూ, పుగుదురువాన్ నిన్ఱనవుం =మునుముందు రాబోయే పాపములను, తీయనిల్ = నిప్పులో, తూశాగుం = దూదిగా కాలిపోతుంది శేప్పే= పరమాత్ముడిని నామాములను కీర్తించే, లోర్ ఎమ్బావాయ్= మావ్రతము

govinda goda geetham tiiruppavai 5

బొమ్మకంటి శ్రీనివాసాచార్యుల వారి తెలుగు అనువాదం, సిరినోము

మాయావి, నుత్తర మధుర కేలిక, నచ్ఛ

        సలిలయై యమునకు సంగడీని

గోప కులమ్ము వెల్గుల దేల్చు జ్యోతిని

        పావన చరిత దేవకి పిరాట్టి

గర్భమ్ము వెలుగొంద గనినట్టి దామోద

        రుని, కృష్ణు, భవసాగరొత్తరిష్ణు

చేరి విశుద్ధిమై సేవింప – మేలైన

        పూలతత్పాదాల పూజ సంయ

మనసార ధ్యానింపుచును వాని నామమే

        నోరార నేవేళ నుడువుచున్న

సంచిత, మ్మాగామి జ్వలదగ్నిలో దూది

        వలె కాలు – హరి కీర్తి పలుకు డెపుడు1

సారాంశం:

భగవదవతారాలతో విరాజిల్లిన ఉత్తర ప్రాంతం. అందులో మధురా నగరం. ఆనగరాధీశుడు. లీలా మానుష విగ్రహుడు. యమునాతీర విహారి. గోపకులాలంకార దీపకుడు. తల్లియశోద మాటకు కట్టుబడి ఆమె కట్టిన తాడుకు బందీ అయిన దామోదరుడు. పవిత్రులమై వచ్చి, మంచి పూలతో పూజించి, చేతులారా సేవలుచేసి, కీర్తనలు పాడి, మనసారా ధ్యానిస్తే చాలు మన పూర్వసంచిత పాపరాశి, రాబోయే ఆగామి పాపరాశి అంతా అగ్నిలో పడిన దూది వలె బూడిదై పోతుంది, ఆ భగవన్నామమే పాడదాం అంటున్నారు గోపికలు.

Also Read : గోవింద గోదా గీతం తిరుప్పావై -3

మాయ అంటే ఆశ్చర్యకరమైన లీల. భగవంతుడి లీల. మాయావి అంటే శ్రీ కృష్ణుడు. ఆయన గురించి చెప్పినా చూసినా విన్నా ఆశ్చర్యంగానే ఉంటుంది. పరమపదంలో ఉండే వాడు మధురలో పుట్టాడు. వైకుంఠం వదిలి వ్రేపల్లెలో పెరిగాడు. మధురలోనే సిద్ధాశ్రమం ఉంది. అక్కడే వామనుడై హరి వెలిసాడు. లవణాసురుడిని చంపిన శతృఘ్నుడు మధుర రాజధానిగా పాలించాడు. మధురలోనే కంసుని చెరసాలలో కృష్ణుడు పుట్టాడు. నమ్మాళ్వార్లు, ఇతర మహర్షులు ఇక్కడ భగవన్నామాలను కీర్తించారు.

వడమదురైన్దనై = మధురానామ నగరీ పుణ్యాపాప హరీ శుభా యస్యాం జాతో జగన్నాథః సాక్షాద్విష్ణుః సనాతనః అని మధురను మునులంతా కీర్తించారు. అనేక అవతారాలతో అనుబంధం ఉన్న మధుర పుణ్యప్రదేశం. పాపాలను హరించే చోటు. ఉత్తర మథుర వైకుంఠముతో సమానమైనది. భగవంతుడు తనను తాను పుట్టించుకున్నచోటు మధుర. వైకుంఠము భగవంతుడుండు చోటు. మధుర కు రాజధాని గా కన్న, శ్రీ కృష్ణుడి జన్మస్థలంగా గొప్పది. మైన్దనై బిడ్డ అనీ, రాజు అనీ, బలశాలి అయిన వాడు కూడా అని అర్థం. పుట్టగానే తండ్రి సంకెళ్లు తామే వీడినట్టు చేసినవాడు, యౌవనం రాకముందే కంసుని చంపిన వీరుడు, మథురకు రాజు కాకపోయినా రాజువలె అధికారాలు కలిగిన వాడు. మాయావి మథురానాథుడైనాడు.

పరమపదంలో పగటిదీపం

తూయ పెరునీర్ యమునైత్తురైవనై = యమునాతీర విహార రసికుడైన శ్రీకృష్ణుని రాజధానీ నగరం మధుర. సంసారమనే సాగరాన్ని దాటించడానికా అన్నట్టు యమునా తీరాన్ని దాటేందుకు సహాయం చేయడానికి గాను ఎప్పుడు తనను పిలుస్తారో అన్నట్టు, శ్రీకృష్ణుడు ఆ తీరంలో ఎదురుచూస్తుంటాడట. ఆయనెవరంటే గోపకుల దీపకుడు. మణిదీపం వలె వెలిగే వాడు యశోదాగర్భంలో వెలుగులు నింపిన వాడు. మధురలో జన్మించినా నందవ్రజంలో ప్రకాశించిన వాడు. తూర్పు దిక్కుతో సూర్యుడికి సంబంధం ఉన్నా తూర్పులోనే ఉద్భవించాడని కాదు. మధురలో పుట్టినా వ్రేపల్లెలోనే పుట్టిన మణివలె ప్రకాశిస్తున్నాడు. అది నిత్యప్రకాశము కలిగిన మణి. పరమపదంలో ఉన్నప్పుడు పగటి దీపం వలె ఉంటాడట.ఆయన దామోదరుడు. యశోద ప్రేమబంధాలకు భక్తి బంధాలకు కట్టుబడి తాటి రాపిడికి కలిగిన మచ్చను ఇష్టంగా ధరించే వాడు. తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ ద దామోదరనై = జగన్నాథుడయిన శ్రీ కృష్ణుడు యశోద కట్టిన తాడుకు కట్టుబడి ఉంటాడు. కట్టిన మచ్చలను ఆమె ప్రేమకు గుర్తుగా మిగిల్చుకుంటాడు. దామోదరత్వముచేత తల్లికి కీర్తి తెచ్చిన వాడు. మాయనై తో మొదటు పెట్టి శ్రీకృష్ణ కీర్తనను ఆండాళ్ దామోదరనై తో ముగిస్తుందీ పాశురంలో.
తూయోమాయ్ వందునామ్ పరిశుద్ధులమై వచ్చినాము అంటారు గోపికలు. భగవత్సంబంధమే నిజమైన శుధ్ధి. విభీషణుడు రామశరణాగతికి ముందు సముద్ర స్నానం చేయాలన్న నియమం చెప్పలేదు. అర్జునుడికి చరమ శ్లోకం చెప్పినప్పుడు, రజస్వల అయిన ద్రౌపది శ్రీకృష్ణ శరణాగతి చేసినప్పుడు వేరొక శుద్ధిగురించి చెప్పలేదు. బాహ్యశుధ్ధిని కావాలని వదులుకోవాలని కాదు. కాని బాహ్యశుద్ధి లేదని అనర్హత రాదు. పరమాత్మను ఆత్మలో తలచుకున్నవాడు పవిత్రుడు.తూమలర్ త్తూవి త్తోళుదు= ఆ దామోదరునికి పవిత్రములైన పూలను సమర్పించండి. పూలంటే ఇక్కడ మనసులు. పవిత్రభావాలు. ఆ పూలు విసిరితే చాలు. జాగ్రత్తగా పాదాలమీద పెట్టాల్సిన పనిలేదట. ఓ లెక్క పద్థతి ప్రకారం క్రమం తెలిసి నమస్కరించాల్సిన పని లేదు. ఏదో ఒక నమస్కారం చేస్తే చాలు. ఆ నమస్కారమే పాపాలను పోగొట్టి శుభములను ఇస్తుందని యామునాచార్యుల వారు చెప్పారు. పూలకోసం దేశమంతా శ్రమపడి తిరగనవసరం లేదు. మనసునే పూవుగా సమర్పించండి అని శంకర భగవత్పాదులు చెప్పినారు. అహింస, ఇంద్రియనిగ్రహం, సర్వభూతదయ, క్షమ, జ్ఞానము, తపస్సు, ధ్యానము సత్యము అనే ఎనిమిది పూవులంటే విష్ణువుకు ఇష్టమట.

వాయనాల్ పాడి= నోటితో కీర్తించి మనసుతో ధ్యానిద్దాం అని గోపికలు పిలుస్తున్నారు. మనత్తినాల్ శిన్దిక్క= మనఃపూర్వో వాగుత్తర, ముందు మనసులో ధ్యానించి తరువాత మాటతో కీర్తించాలి. ఆ విధంగా భగవంతుని చూచి, పాడి, ధ్యానిస్తే పాపాలన్నీ దగ్ధమైపోతాయి.

మూడు రకాల పాపాలు

పోయపిళ్లైయమ్ పుగుదరువానినర్ఱనవుమ్ నీయనిల్ తూశాగుమ్ = ముందుచేసిన పాపాలు రాబోయే పాపాలు కూడా దగ్ధమైపోతాయి. పాపాలు మూడు రకాలు సంచితములు, ప్రారబ్దములు, ఆగామి. ఇంతకుముందున్న జన్మలో మనం చేసిన కర్మలకవల్ల కలిగే పాపాలు సంచితములు. ఈ జన్మలో ఈ శరీరంతో తెలిసి తెలియక, కలలో చేసిన పాపాలు ప్రారబ్దము. ఈ జన్మలో చేసినది, అంతకు ముందు నిలువ ఉన్నది, రాబోయే జన్మలో అనుభవించవలసి ఉంటుంది. అదే ఆగామి. ఈ మూడూ భగవంతుని చేరగనే దూదిరాశి నిప్పుతో తగలబడిపోయినట్టు కాలికూలిపోతాయి. దూదిరాశిలో నిప్పు కణిక వేస్తే మొత్తం ఏ విధంగా ఎంత వేగంగా చూస్తుండగానే దగ్ధమైపోతుందో భగవంతుని ధ్యానంతో పాపాలు కూడా ఆ విధంగానై కాలిపోతాయని గోదాదేవి అద్భుతమైన పోలిక చూపుతారు ఈ పాశురంలో.

శ్రీ భాష్యం గోపాలాచార్య స్వామి దీనికి మరొక హృద్యమైన భాష్యం చెప్పారు. ఒక విలుకాడు బాణాలను పట్టుకుని యుద్ధానికి పోతాడు. బాణంతీసి విల్లులో సంధించి విడుస్తాడు. మరొకటి విడవడానికి సిద్ధంగా పట్టుకుంటాడు. మరికొన్ని అమ్ముల పొదిలో ఉంటాయి. బాణము వదిలిన తరువాత శత్రువు శరణంటే రెండో బాణం వేయడు. అమ్ములపొదిలో బాణం తీయడు. విడిచిన బాణం ముందుకు పోవలసిందే. వెనక కు మరలదు. ఆగామి కర్మ చేతిలో ఉన్నబాణం వంటిది. సంచిత కర్మ అమ్ములపొదిలోబాణం. ప్రారబ్దం వేసిన బాణం. ప్రారబ్ద కర్మ పూర్తికాగానే సాయుజ్యం లభిస్తుంది. పాపాలకు భయపడే పనిలేదు, భగవంతుడికీర్తి పాడదాం రండి అని గోదమ్మపిలుస్తున్నదీ పాశురంలో. ఎంతగొప్ప ఆలోచన? ఔననిపించే పోలిక.

మనం ఇంత మంచి వ్రతం చేయడానికి బయలుదేరాం కదా ఏదైనా విఘ్నం వస్తే అని ఒక గోపిక సంశయం వ్యక్తం చేసింది. రాముడి పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయిస్తే వనవాసానికి వెళ్లవలసి వచ్చింది కదా అని వాదించినదట. పద్మంమీద వాలి మధుపానం చేసి మత్తిలి నిద్రిస్తే చీకటిపడగానే ముకుళించిన పద్మంలో బందీ అయింది. మధ్యరాత్రి లేచి బయటకు వెళ్లే దారి లేక సూర్యకిరణాలతో పద్మం వికసించగానే వెళ్లొచ్చులే అని నిద్రలోకి వెళ్లిపోయిందట. కాని తెల్లారకముందే స్నానానికి వచ్చిన మదపుటేనుగు పద్మాన్ని పీకి విసిరేందంట. తుమ్మెద ప్రాణాలు కోల్పోయింది. ఈ సంశయానికి గోదాదేవి ఈ పాశురంలోసమాధానాలిచ్చారు.  ఇటువంటి వన్నీ కర్మఫలితాలు.

కర్మల ఫలితాన్ని అనుభవించకతప్పదని పెద్దలు అంటారు. కర్మను అనుభవించకుండానే నశిస్తాయని ఉపనిషత్తులంటున్నాయనివివరిస్తున్నారు. ఏది నిజం? అని ఒక గోపిక అడిగితే వేదాంతం తెలిసిన మరొక గోపిక కర్మకు చేతనం లేదు. అదే ఫలితం ఇవ్వదు.కర్మ చేసిన తరువాత కొంతకాలానికి ఫలితం వస్తుంది. ఫలం ఇచ్చేది కర్మ కాదు. భగవంతుడు కర్మ ఫలాన్ని స్తాడు. శృతి స్మృతి మనకు ప్రవర్తనా నియమావళి చెప్పే శాసనాలు. ఆ విధంగా ప్రవర్తిస్తే భగవదనుగ్రహం కలుగుతుంది. అది సుఖం. అది తప్పి ప్రవర్తిస్తే ఆగ్రహం కలుగుతుంది. అది దుఃఖం. మన పట్ల ప్రీతి కలిగిన తరువాత బుద్ధిపూర్వకంగా కాకుండా ప్రమాదవశాత్తూ చేసిన కర్మలను ఎరుగజాలని వాడు గనుకనే విష్ణువును అవిజ్ఞాతా అనే పేరుతో సహస్రనామాల్లో కీర్తిస్తాం.

అన్నమయ్య అన్నది

‘‘భారపు పగ్గాలు పాపపుణ్యములు నేరుకొనబోవు నీవు నీవు వద్దనక’’ అంటాడు అన్నమయ్య. భగవంతుడి అనుగ్రహం ఉంటేనే ఏదైనా సాధ్యం అని ప్రకటించే కీర్తన ‘‘అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీశరణిదెజొచ్చితిని’’. కట్లు కోయనివి, కొరికలు తీరనివి. అంతర్యామి తెంచితేనే తెగుతాయి. ‘‘జనుల సంగములు జక్క రోగములు నను విడువవు నీవు విడిపించక, వినయపు దైన్యము విడువని కర్మము, చనదది నీవిటు శాంతపరచక’’ అట్లాగే మదిలో చింతలు మైలలు మణుగులు… అవికూడా వదలవునివవి వద్దనక. ఎదుటనే శ్రీ వేంకటేశ్వర నీవదె అదన గాచితివి అట్టిట్టనక.. అని అన్నమయ్య శరణాగతి చేస్తాడు వేంకటేశునికి. ఆయన అదన గాచకపోయినా, అట్టిట్టు అన్నా మనకు దారి లేదు. కర్మము కూడా ఆయన దయ ఉంటేనే విడుస్తుంది. మనసుకు శరీరానికి పట్టిన రోగాలు మైలలు ఎన్నో అవన్నీ నీవే వదిలించాలని అని కోరుకుంటున్నాడు అన్నమయ్య. సరిగ్గా గోదమ్మఇదే చెప్పింది తన అయిదవ తిరుప్పావై తమిళ పాశురంలో.

Also Read : నారాయణచరణాలే శరణు

వెనుకటి పాపాలు, ముందు రాబోయే పాపాలు భగవద్దర్శనంతో పోతాయి. అంటే ప్రారబ్దం పోనట్టే కదా. శ్రీకృష్ణ సంయోగం కోసం అందాకా ఎదురుచూడాల్సిందేనా అని ఒక గోపిక అడిగింది. నారాయణుడే ఉపాయమని నమ్మితే ప్రారబ్దమును కూడా నాశనము చేసి తనతో సంశ్లేషము ఇస్తాడు. అగ్ని దహిస్తుంది. అది నిజమే. దానికి తిరుగులేదు. కాని నీరున్న చోట అగ్ని దహించే ప్రసక్తేలేదు. కర్మలు ఫలములిస్తాయి నిజమే. కాని భగవంతుని కాక ఇతరములను ఆశ్రయిస్తే కర్మలు ఫలాలనిచ్చేదాకా ఎదురుచూడాల్సిందే. కాని భగవంతుడే ఉపాయమనుకున్నప్పుడు ఆ అవసరం లేదు. శ్రీ కృష్ణుడిని చేరడానికి కర్మలు ప్రతిబంధకాలు కావు అని గోపికలు వివరిస్తారు. మాయావీ, మథురానాయకా, యమునా తీర విహారీ, నందవ్రజమంగళదీపా యశోదాగర్భ ప్రకాశకా, దామోదరా అని కీర్తిస్తే చాలు. మన పూర్వపాపాలు ఆగామి పాపాలు పోతాయి. నామ సంకీర్తనముచేత పాపాలు పోతాయి అని సందేశం.

చిన్న జీయర్ స్వామి వివరణ:

చిన్న జీయర్ వివరణ లేకుండా మనం తిరుప్పావైని అర్థం చేసుకోవడం కష్టం. వారి వివరణ: మనం చేసే కర్మలచే పుణ్య-పాపాలు భగవంతుడు నిర్ణయిస్తాడు. మనం చేసే చిన్ని విషయం కూడా ఆయనకు తెలియకుండా ఉండదు- అందుకే ఆయననను సర్వజ్ఞుడు-సర్వవేత్త అంటారు. ఆయా కర్మలకు తగిన ఫలాన్నిచ్చే శక్తి కూడా కలిగి ఉంటాడు. …మనం కావాలని అనుకుంటే సంచితాలను-ఆగామిని తీసివేయవచ్చు కాని ప్రారబ్దం మాత్రం ఉంటుంది. భగవంతునికి శరణాగతి చేస్తే ప్రాచీన కర్మలను తుడిచివేస్తాడు, ఇకపై మనం చేసే కర్మలు మంచిగా ఉండటం చే ఆగామి దూరం అవుతుంది. మరి ఈ కర్మలన్నీ ఎక్కడో ఒక దగ్గర అనుభవించాలి కదా, మరి అవి ఎక్కడికి పోతాయని ఒక గోపిక అడిగింది. ఇది మనం అందరం తెలుసుకోవలసిన సంగతి. భగవంతుడు మనను అనుగ్రహిస్తే మన పై ఉండే పాపాలను మనల్ని ద్వేషించే వారికి, పుణ్యాలను మనల్ని ప్రేమించే వారికి పంచి, మనల్ని స్వీకరిస్తాడు. ఇక ప్రారబ్దం కూడా నిర్వీర్యం కావాలంటే – మనం భగవంతునికి చెందిన వాడను- నేను చేసేది భగవత్సేవ–భగవానునికోసమే చేస్తునాను అనే భావన ఉంటే చాలు. మనకు అందిన నామంతో ఆయన పేరు పలికితే చాలు ప్రారబ్దం కూడా అంటదు. దీన్నే ఉజ్జీవించి బ్రతకటం అంటారు. ఆయన నామాన్ని పాడుదాం రండి అని ఆండాళ్ ప్రబోధించారు.

Also Read : హరిగుణ గానమే స్నానమట

పూర్ణం, దేనితో నిండినది?

పూర్ణమిదం పూర్ణ మద: పూర్ణాత్ పూర్ణముదచ్యతే|
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే ||

‘‘ఇది శుక్లయజుర్వేద శాంతి మంత్రం. పూర్ణం అనగానే ముందుగా మనకు దేనితో నిండి ఉన్నదనే ప్రశ్న వస్తుంది. పూర్ణం అనగా అన్నీ నిండుగా కలదని అర్థం. అంటే స్వరూపం, గుణం, దయ మొదలైనవి నిండుగా కలిగినది అనవచ్చు. మరి ఏమిటా పూర్ణం, ఎక్కడ లభిస్తుంది? ఈ మంత్రం దానికి సమాధానం ఇస్తుంది. “పూర్ణమిదమ్”- ఇదం అంటే చాలాదగ్గరగా ఉంటుంది, నీ లోపలనే. దీన్నే మనం అంతర్యామి స్వరూపం అంటాం. కాని మనకు తెలియలేదు కదా!. “పూర్ణ మదః”- అదః అంటే అంతటా వ్యాపించి ఉంది. అదీ పూర్ణమే. దీన్నికూడా గుర్తించటం కష్టం. ఈ పూర్ణంఏం చేస్తుంది? “పూర్ణాత్ పూర్ణముదచ్యతే”- ఆ పూర్ణమే ఒక చోటకు చేరి ఉంటుంది- అదీ పూర్ణమే.

కృష్ణతత్వమని గ్రహిస్తే పిలిచితే పలికే దైవం

సృష్టి,స్తితి,లయ కార్యాలు చేయటానికి వ్యూహ స్తానంలో ఉంటుంది. అదీ పూర్ణ రూపమే, కానీ మనం చూడలేం కదా. “పూర్ణస్య పూర్ణమాదాయ” ఆయా అవసరాలను బట్టి ఆపూర్ణం లోనుంచి మరో పూర్ణం మన వద్దకు దిగి వస్తుంది- అదీ పూర్ణమే. వీటినే విభవములు అనీ అవతరాలు అనీ అంటారు. ఇవి కాలానుగుణం బట్టి వచ్చేవికదా మనం ఇప్పుడు చూడలేము కదా, ఎలాగా? “పూర్ణమేవా వశిష్యతే”- ఆయా అవతారాలలో వచ్చినప్పుడు ఆయా గుణాలను బట్టి మనం ఏర్పాటుచేసుకొన్న విగ్రహం కూడా ఒక పూర్ణమే. అందుకే మనం ఆరాధించే విగ్రహం ఒక సంపూర్ణమైనదే అని ఒక సంపూర్ణవిశ్వాసం ఏర్పడాలి. ఈ స్వరూపాలన్నన్నింటినీ గోదా మాత ఒక్కోక్క పాటగా మనకు అందించింది. అందుకే తిరుప్పావైని వేదాల సారం’’ అనిజీయర్ స్వామి అద్భుతంగా వివరించారు. ఆ విగ్రహం అర్చా స్వరూప నారాయణుడు. అది కృష్ణ స్వరూపం అని విశ్వసించి సంశయాలు వదిలి, అది కృష్ణతత్వమని గ్రహిస్తే పిలిచితే పలికే దైవం అని అర్థమవుతుంది. ఈ గుర్తింపు లేకపోతే, ఏం చేసినా ఎక్కడికి వెళ్లినా ప్రయోజనం లేదు. అహంకారం నశించి ఆ విజ్ఞానం ఉదయిస్తే ఇల్లే తపోవన మవుతుంది. అటువంటి జీవనమే తపస్సు అవుతుందని వివరిస్తూ నాలుగో పాశురంలో గోద భగవంతుని స్థానం అంతర్యామిత్వమని జీయర్ స్వామి వివరించారు. అయిదో పాశురంలో భగవంతుని స్థానం అర్చారూపంగా మనముందుంచారు.  జీయర్ స్వామి వారు పూజకు నిబంధనలేమీ లేవని, ప్రేమతో అచంచలమైన విశ్వాసంతో పలికి మాటలే మంత్రాలని, ప్రేమతో చేసిన సేవలే ఆరాధన అనీ, మీరు ఎంచుకున్న విగ్రహంలోనే విశ్వాన్ని నడిపే శక్తి ఉందని ఆండాళ్ ఈ పాశురంలో వివరించారు.

Also Read : శ్రీవైష్ణవ ఆళ్వార్లలో ఏకైక స్త్రీమూర్తి గోదా కవయిత్రి

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles