(నారాయణుడే వ్రతం, నారాయణుడే వ్రతఫలం అని చెప్పే పాశురం మార్గళి తొలి గోవింద గీతం).
మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్
లక్ష్మణ యతీంద్రుల అనువాదం
నారాయణుండు కన్నయ్య – ఆతండె
సర్వమ్ముమనకు తాసమకూర్పగలడు
మనసున్న వారెల్ల మానినులార
తానమ్ములాడగ తరలిరండమ్మ
బొమ్మకంటి శ్రీనివాసాచార్యుల వారి అనువాదం సిరినోము
శ్రేష్ఠమై ఈ మార్గశిరపు వెన్నెల రేయి
నీరాడ రారండి నెలతలార1
చెలువమ్ము, సంపద చెలగు వ్రేపల్లె జ
వ్వనులార 1 భూషిత ప్రమదలార 1
వేలాయుధము దాల్చి వేయి కన్నుల గాచు
నందగోపు ననుంగు నందనుండు
చలువకంటి యశోద సాకు సింగపు పిల్ల
కరి మేను చెంగనుల్ గలుగువాడు
సూర్యచంద్రుల బోలు సుంద రాస్యము వాడు
నారాయణుడె ఇచ్చునమ్మ ‘డక్కి’
నీరాడగానెంచు నెలతలారా 1 రండు
వాడ వాడలు మన వ్రతము పొగడ 1
పదాలు అర్థాలు
ఇది మార్గళినెల (మార్గళి త్తింగళ్) చంద్రుడు పదహారుకళలతో పూర్తిగా వికసించిన మంచిరోజు (మది నిఱైంద నన్నాళాల్) స్నానం చేయదలిచిన వాళ్లు (నీరాడ ప్పోదువీర్) రండి (పోదుమిన్) అందమైన ఆభరణాదులు ధరించిన సుదతులారా (నేరిళైయీర్) సిరిసంపదలతో కూడిన (శీర్ మల్గుం) గొల్లపల్లెలోని (ఆయ్ ప్పాడి) భగవదనుగ్రహమనే సంపదను, ధనధాన్యాలనే సంపదను (శెల్వచ్చిఱుమీర్గాళ్) వాడియైన శూలం ధరించి (కూర్వేల్) శ్రీకృష్ణుడికి హాని చేయదలిచిన దుర్మార్గులను క్రూరంగా నిర్జించే (కొడుందోళిలన్) నందగోపుని కుమారుడు (నందగోపన్ కుమరన్) అందమైన నయనాలతో కూడి (ఏరారంద కణ్ణి) తల్లి యశోదకు (యశోదై) సింగపు పిల్లవంటివాడు (ఇళమ్ శింగం) నల్లని మేని రంగు కలిగి (కార్మేని) కెందామరల తో పోలిన కన్నులు (చ్చెంగణ్) ప్రకాశంలో సూర్యుడిని (కదిర్) చల్లదనంలో చంద్రుడిని (మదియం) పోలిన ముఖ బింబము గలవాడు (పోల్ ముగత్తాన్) భగవానుడైన శ్రీమన్నారాయణుడే (నారాయణనే) పఱై అనే వాయిద్యాన్ని మన అభీష్ఠాలను (పఱై) ప్రపంచంలోని ప్రజలంతా (పారోర్) ప్రశంసించే విధంగా (పుగళ ప్పడిందు) ఈ వ్రతంలో పాల్గోనే విధంగా పావై వ్రతాన్ని అనుష్టించడానికి సిద్ధంగా ఉన్నమనకు (ఎమ్బావాయ్ నమక్కే) అనుగ్రహిస్తాడు (తరువాన్).
అంతరార్థం:
దేనికైనా సమయం రావాలంటారు. ఈ వ్రతానికి సరైన సమయం మార్గశీర్షమాసం. అంతగా వేడి ఉండదు, చలీ ఉండదు. సమశీతోష్ణవాతావరణం. పంటలు పండి చేలో పక్షులు వాలే కాలం. నీళ్లలో చేపలు తుళ్లిపడేరోజులు. పంటచేలల్లో హంసలు తిరుగాడుతున్నాయట. మాసానాం మార్గశీర్షోహం అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. ప్రకృతిలో ఏది శ్రేష్టమో అదే నేను అని అంటూ శ్రేష్టత్వమే భగవంతుడని నిరూపిస్తాడు. అటువంటి శ్రేష్ఠమైన మాసం ఇది. విష్ణుస్వరూపమైన ఈ నెల సమశీతోష్ణంగా ఉండి బ్రహ్మ ముహూర్తంలో భగవద్ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది. వెన్నెల విరిసే నెల. దేవతల లెక్క ప్రకారం తెల్లవారుఝాము. ఎట్లా అంటే మనకు ఏటా పన్నెండునెలలు దేవతలకు ఒక రోజు. దక్షిణాయనం దేవతలకు రాత్రి ఉత్తరాయణం పగలు. సూర్యుడు దక్షిణాయనం నుంచి సంక్రాంతి రోజు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే నెల మార్గశీర్షం. దేవతలకు తెల తెల వారే సమయం. సత్వగుణాన్ని పెంచేకాలం. కనుక వ్రతానికిది మంచి సమయం. మనసు మురిసే వెన్నెల వెల్లివిరిసే కాలం. భగవంతుని కళ్యాణ గుణగానాలతో మన పాపాలను కడిగివేసుకొనే స్నానం చేద్దాం రండి. భగవంతుని గురించి తెలుసుకోవాలనే జ్ఞానం ఉంటే చాలు ఈ వ్రతం మనమూ చేయవచ్చు. పంటలు బాగా పండే ఆ నందగోకులంలోని సంపన్నులైన గోపబాలల వలె మనం కూడా శ్రీ కృష్ణుని ప్రేమకోసం గోపబాలలమైపోదాం. ఇక మనకు ఏ భయమూ లేదు. ఆ పరమాత్ముడే పరమ సాత్వికుడైన నందగోపుని కుమారుడిగా మనలో ఒకడుగా ఉండడానికి మనదగ్గరికి వచ్చినాడు. ఎప్పుడే రాక్షసులు వస్తారో అని అనుక్షణం తాను కత్తి పట్టుకుని కాపలా కాసే నందగోపుడు మనవాడే. తన లీలలతో ఆశ్చర్యపరిచిపదేపదే యశోద కళ్లు విప్పార్చే గోపాల బాలుడు సింగపు పిల్ల వలె ఆమె ఒడిలో పెరుగుతున్నాడు. నల్లని మేఘం వంటి శరీర చ్ఛాయ. వాత్సల్యం వంటి అనంతమైన గుణాలు కలిగిన వాడు. మిత్రులకు చల్లదనం, శత్రులకు వేడి కలిగించే సూర్యచంద్ర వదనుడు. గోదాదేవి మనందరకీ ఈ తొలిపాశురంలో నారాయణమంత్రోపదేశం చేస్తూ వ్రతానికి పురి కొల్పుతున్నది. ఆయనే మన వ్రతఫలం అని వివరిస్తున్నది.
ఆయన గుణాలే కాదు రూపాలు కూడా అనంతం. ఆకాశం వలె, సాగరం వలె, అంతంలేని జన్మల వలె, తెగని మన కర్మల వలె. అనంత కళ్యాణ గుణ సంపన్నుడు. కొదవ, లోటు లేని వాడు. అంతటా వ్యాపించిన విష్ణువు. విష్ణు అన్నా వాసుదేవ అన్నా నారాయణ అన్నా ఆయన సర్వవ్యాపక శీలాన్ని వివరించే పదాలే. విష్ణు అంటే వ్యాపించి, వాసుదేవా అంటే అంతటా వసించి ప్రకాశించే వాడు. నారాయణ అన్నా వ్యాపకత్వ శబ్దమే. నారములంటే కదలనివి కదిలేవి అనీ అయణం అంటే వాటికి ఆధారమైనవాడని అర్థం. అంతటా వ్యాపించి అన్నింటికీ ఆధారమై అన్నింటినీ ప్రకాశింపచేసేవాడు. వాటికిలోపలా ఉంటాడు బయటా ఉంటాడు. జీయర్ స్వామి నారాయణ మంత్రాన్ని అద్భుతంగా వివరిస్తారు. ఈ నారాయణ అనే శబ్దాన్ని రెండు సమాసాలు వివరిస్తాయి. ఒకటి తత్పురుష రెండవది బహువ్రిహి. తత్పురుష అనేది నారములన్నిటికి తాను ఆధారమైన వాడు, ఆధారమై తనలోపల పెట్టుకున్నవాడు అని చెబుతుంది. మరి బహువ్రీహి సమాసం నారములన్నిటికి తాను లోపల ఉండి రక్షిస్తాడని చెబుతుంది. అంటే లోపలా బయటా ఉంటాడు. అయణ అనే శబ్దంచే ఆయన అన్ని గుణములు కల్గిఉంటాడు. ఒక్కసారి చేయిచాస్తే చాలు అందేట్టు ఉంటాడు. సులభంగా అందడం సౌలభ్యగుణం. మనలోపలే ఉంటాడు కనుక చాలాదగ్గరగా ఉన్నట్టు. సమీపం సామీప్యలక్షణం. పైన కూడా ఉంటాడు కనక పరుడు- అది పరత్వం. జ్ఞానులు కూడా ఈ నారములలోని వారేకనుక తాను జ్ఞానం కల్గి ఉంటాడు. వారిలోని దోషాలూ తెలుసు, వాటిని దూరం చేయగల్గడం కూడా తెలుసు. దోషాలను తొలగించాలనుకునే వాత్యల్యం తొలగించే శక్తి కూడా కలిగిన వాడు. వీటన్నిటినీ తనవనుకునేస్వామిత్వం ఉంది, వీరి యోగ్యత గుర్తించే జ్ఞానంచే సర్వజ్ఞత్వం ఉంది, తాను ఏ విధేంగానైనా ఏమైనా చేయగలడు ఎవ్వరూ అడ్డనంత శక్తి ఉంది. ఎంత ఇచ్చినా తరగని నిండుతనం అంటే పూర్ణత్వం ఉంది. అన్నిగుణాలు కలిగిన పరిపూర్ణత్వ శక్తి మంత్రాన్ని మనకు సాధనంగా గోదాదేవి అందిస్తున్నారు. వ్యక్తిగత శారీరక సుఖాలు ఏకాంతంలో అనుభవించేవి. కాని భగవదనుభవం అందరితో కలిసి అనుభవించేది. అందరూ కలిసి రావడం గోష్ఠి. అందరూ కలిసి భగవద్గుణానుభవంతో స్నానం చేసి నారాయణ మంత్రంతో వ్రతం చేద్దాం రండి అంటున్నారు. వ్రతం చేయాలన్న కోరిక ఉంటే చాలు అదే యోగ్యత. మరేదో లేదని భయపడవలసిన పని లేదు.
కంసుని ఊడిగం వదిలే మంచి రోజు అక్రూరుడికి, రాముని శరణు వేడే మంచి రోజు విభీషణుడికి వచ్చినట్టు మంచి రోజు వచ్చింది. మార్గం అంటే దారి అని మనకు తెలుసు. ఉపాయమని కూడా అర్థం. భగవంతుడిని చేరడానికి కర్మ జ్ఞాన భక్తి మార్గాలు మూడున్నాయి. కాని ఈ మూడింటి కన్న మంచిమార్గం మరొకటి ఉంది. అది భగవంతుడే. సాధనమూ ఆయనే సాధ్యమూ ఆయనే. భగవానుడే ఉపాయంగా ఉపయోగించి లక్ష్యమైన ఆభగవానుడిని చేరే వ్రతం తిరుప్పావై.
స్నానం. శ్రీకృష్ణుడి విరహంలో వేడి చల్లారాలంటే స్నానం చేయాలి. శ్రీ కృష్ణ విశ్లేషం (విరహం) వల్ల కలిగే విరహం చల్లారాలంటే శ్రీకృష్ణ సంశ్లేషం (సంయోగం) అనే స్నానం కోరుతున్నారు గోపికలు. శ్రీ కృష్ణుడే ఒక జలాశయం. నీతో ఏడేడు జన్మలకూ తొలగని విడదీయరాని సంబంధం కావాలని కోరుతూ ఆ శ్రీ హరి జలాశయంలో మునుగుతారట గోపికలు. వారు ఏదైనా కలిసే చేస్తారు. అంతా ఒక్కరికే అనే స్వార్థంవారికి లేదు. ఆభరాణలతో అలంకరించుకోవడం అంటే శ్రీకృష్ణుడు ఏ క్షణంలో తమను చేరి కౌగిలించుకుంటాడో అని సిద్ధంగా ఉండడం. నమస్కారం, వంచిన తల, పులకించే దేహం, తడబడుతున్న గొంతు, కన్నుల్లో నీరు, ఇవీ ప్రపన్నుల లక్షణాలు. ఇవే ఆభరణాలు. వీటితో సిద్ధంగా ఉన్న ప్రేమైకజీవి ప్రపన్నుడు. గోపకులంలో సంపద పాడి పంటలు, పాలు నెయ్యి.. అన్నీ సరే. కాని అసలు సంపద భగవంతుడైన శ్రీ కృష్ణుడే. ఆయనకు మించిన సంపదేమిటి. ఆయన అన్ని గుణాలతో రేపల్లెలో ప్రకాశిస్తున్నాడు. సులభుడు, సుశీలుడు, సమీపంలో ఉన్నవాడు. వ్యాపకుడు, ప్రకాశించే వాడు. లోటు లేని పరిపూర్ణుడు. చేయిచాస్తే చాలు అందుకునే వాడు. ఆయనమనతో ఆడుతూ పాడుతూ ఉంటే ఈ రెపల్లె అయోధ్య కన్న పరమపదం కన్నఎంతో గొప్పది. అయోధ్యలో వసిష్టుడు ఇతర మునులూ ఉన్నారు. కాని కుడి ఎడమతెలియకపోయినా అమాయకులు శ్రీ కృష్ణునితో కలిసి మెలిసి తిరుగుతున్నారు.
నందగోపుడు సాధారణంగా మెత్తని వాడు. కాని శ్రీకృష్ణుడికి వచ్చే ఆపదలతో కఠినుడైపోయాడు. రాక్షసుడెవడైనా వస్తే చీల్చి చెండాడడానికి శూలంతో సిధ్ధంగా ఉన్నాడు. దూడను ఈనిన ఆవువలె దగ్గరికి గడ్డివేయడానికి వచ్చినా సరే ఎవరొచ్చినాసరే కొమ్ములతో చీల్చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు.
ఇక శ్రీ కృష్ణుడు కార్ మేని అంటే మేఘం వలె దాచడానికి వీల్లేని శరీరం గల వాడు. తల్లిదండ్రులు దాచలేని అందం ఆయనది. అందరినీ మోహితులు చేసే సౌందర్యం. చంద్రభాస్కర వర్ఛసుడు. వెలుగుతో పాటు వేడి ఉంటుంది. కాని శ్రీ కృష్ణుడు వెలుగు చల్లనిది.నారాయణనే అనే శబ్దప్రయోగం చేసి గోదాదేవి మరెవరూ సాటిరాని నారాయణుడొక్కడే అని ఘంటాపథంగా ప్రకటిస్తున్నారు. ‘‘ఇతడొకడే సర్వేశ్వరుడు సిత కమలాక్షుడు శ్రీవేంకటేశుడు’’ అన్న గీతాన్ని అన్నమయ్య ఇతడొక్కడే అని ముగిస్తాడు. ఆచార్యత్వం, వాత్సల్యం, జ్ఞానం, శక్తి వంటి అన్ని గుణాలున్నవాడొక్కడే ఒకే ఒక్కడు నారాయణుడు. దేవతలు కూడా తెల్లవారుఝామున గుమికూడే సమయంలోనే దయాసాగరుడైన పరమాత్ముని సంశ్లేషభాగ్యం మనమూ పొందుదాం. ప్రాప్య ప్రాపకాలు రెండూ నారాయణుడే. నారాయణుడై పఱై (ఒక పాత్ర అనీ లేక పరలోక మార్గాన్నిఅనీ) ఇస్తాడు. వ్రతాన్ని చేయడానికి ఎవరు అర్హులు. ఎవరి గురించి చేయాలి. ఆ స్వరూపం ఎటువంటిది అనే ప్రాథమిక వివరాలను ప్రథమ పాశురం వివరిస్తున్నది. ముఫ్పైపాశురాల స్వరూపం సూక్ష్మంగా ఈ మొదటి పాశురంలో ప్రతిఫలిస్తున్నది.