- కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ
- సీనియర్ జర్నలిస్టులతో సంభాషణ
హైదరాబాద్ : తెలంగాణ, పుదుచ్ఛేరి గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ పదవిలో రెండేళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె బుధవారంనాడు ఒక కాఫీ టేబుల్ బుక్ ను విడుదల చేశారు. అందులో గత రెండేళ్ళలో ఆమె గవర్నర్ గా సందర్శించిన స్థలాలూ, కలుసుకున్న వ్యక్తులు, హాజరైన సమావేశాల వివరాలు సచిత్రంగా ఉన్నాయి. సభకు హాజరైన సీనియర్ సంపాదకులతో ఆమె మాట్లాడారు. వారిని ఉద్దేశించి ఉపన్యసిస్తూ, గవర్నర్ గా తన బాధ్యతలను నిర్వర్తించడం పట్ల సంతృప్తిని వెలిబుచ్చారు.
గవర్నర్ తమిళసైని పుదుచ్ఛేరి ఎన్నికల కంటే ముందు అక్కడ మాజీ పోలీసు అధికారి కిరణ్ బేడీ స్థానంలో అదనపు బాధ్యతగా లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించారు. అప్పటి నుంచి ఆమె కొన్ని రోజులు హైదరాబాద్ లోనూ, కొన్ని రోజులు పుదుచ్చేరిలోనూ గడుపుతున్నారు. ఇటీవల గవర్నర్ మాతృమూర్తి కాలధర్మం చెందారు. ఆమెను కలిసిన సంపాదకులూ, సీనియర్ జర్నలిస్టులూ సంతాపం వెలిబుచ్చారు. మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్, తెలంగాణ ప్రెస్ అకాడెమీ అధ్యక్షుడు అల్లం నారాయణ, ఆంథ్రప్రదేశ్ మాసపత్రిక పూర్వ సంపాదకుడు వల్లీశ్వర్, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్, తెలంగాణ మాసపత్రిక సంపాదకుడు అష్టకాల రామ్మోహన్, సిీీనియర్ జర్నలిస్టులు దాసు కేశవరావు, భండారు శ్రీనివాసరావు, గౌరీశంకర్, కృష్ణారావు, ప్రజాసంబంధాల అధికారి కృష్ణానంద్, తదితరులు ఈ సమావేశానికి హాజరైనారు.